Dec 04,2022 06:52

మనిషి వైజ్ఞానికంగా పెరిగి, మనోవైజ్ఞానికంగా తరిగిపోతున్నాడా...అనిపిస్తుంటుంది. 'ప్రతిది సులభ సాధ్యమ్ము కాదు సుమ్మి/ నరుడు నరుడౌట ఎంత దుష్కరమ్ము' అంటాడు కవి గాలిబ్‌. మనిషి తనం, మానవత్వం మంటగలిసిపోతోంది. మనిషి ఎంత విజ్ఞానం సాధించినా సమానత్వం విషయంలో సంకుచితంగానే వ్యవహరిస్తున్నాడు. 'మెదడే పెరిగి హృదయం తరిగి/ నరుడే ఈనాడు వానరుడైనాడు' అంటాడు దాశరథి. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సంకుచిత ధోరణి పరాకాష్టకు చేరుతోంది. మహిళలను వేధించడం, లైంగికదాడి, అవహేళన నిత్యకృత్యమైంది. పితృస్వామ్య భావజాలం నిండిన సమాజంలో అమ్మ, అక్క, చెల్లి, భార్య... ఇలా ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో ఈ హింసను అనుభవించినవారే ఎక్కువ. మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగినా... వారి పట్ల అసహనం, హింస వంటివి అన్నిచోట్లా కనిపిస్తూనే ఉన్నాయి. వికృతమైన చూపులు, వ్యంగ్యపు మాటలు అనేక రూపాల్లో వ్యక్తమౌతుంటాయి. స్త్రీ అణచివేత ఒక నిశ్శబ్ద ఉద్యమంగా సాగే విధానం ఒకటి ఈ సమాజంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్నది. దాని విభిన్న రూపాల్లోని ఒక పార్శ్వం బాడీ షేమింగ్‌. అవయవాల పేరుతోనో, సన్నగా వున్నారనో, లావుగా వున్నారనో, రంగు పేరుతోనో ఒక మనిషి మరో మనిషిని గేలి చేయడం... మానవత్వానికి, మనిషితనానికి మాయని మచ్చ.
స్త్రీ అంటే...శరీరాన్ని మాత్రమే చూసే పితృస్వామ్య సంస్కృతిని, మనువాద భావజాలాన్ని పెంచిపోషిస్తున్న ప్రభుత్వాలు ఒకవైపు, అదే శరీరాన్ని వస్తువుగా మార్చే కార్పొరేట్‌ సంస్కృతి మరోవైపు ఆడపిల్లలపై హింసను ప్రేరేపిస్తున్నాయి. ఏసీ గదిలో కూర్చున్నా ఉక్కపోసినట్లు... నలుగురి మధ్యలోవున్నా అభద్రత...న్యూనతాభావం తప్పడంలేదు. 'అర్థరాత్రి ఒంటరిగా స్త్రీ తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం' అన్నాడు గాంధీజీ. కానీ, పట్టపగలు కూడా తిరిగే పరిస్థితి లేదు. లైంగిక దాడులతో పాటు బాడీ షేమింగ్‌ను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో వున్నవారిపై సైతం అనుచిత వ్యాఖ్యలు వెలువడ్డాయి. తాజాగా రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలు ఉన్మాదానికి పరాకాష్ట. ప్రవచనాల పేరుతో మహిళలను అవమానించే గరికపాటి వంటి వారికీ కొదవ లేదు. 'సోషల్‌ మీడియాలో నా బరువు గురించి చాలామంది ట్రోల్స్‌ చేశారు. ఇక నా పెళ్లికి వచ్చిన వారు కూడా నేను లావుగా ఉన్నానని మాట్లాడుకోవడం నేను విన్నాను' అంటూ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ నటి కన్నీటిపర్యంతమైన విషయం కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. భర్త చనిపోతే...విధవ అని ముద్ర వేసి, అరిష్టం, అశుభం, అనర్థం అంటూ అవమానించే అనాగరిక చర్య ఇంకా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు శారీరకంగా, లైంగికంగా, మానసికంగా ఏదో ఒక రూపంలో హింసను అనుభవిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా లైంగిక హింస పెరిగిందని ఐరాస చెబుతోంది.
'నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించు' అనేది ఒక సూక్తి. మనిషి ఎంత కురూపి అయినా తనను తాను ప్రేమించుకుంటాడు. తన సౌందర్యానికి తానే మురిసిపోతాడు. ఎవరి ఆనందం వారిది. కానీ, ఇతరులను తక్కువచేసి మాట్లాడే హక్కు మాత్రం లేదు. ప్రతి వ్యక్తికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ వుంది. పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టినవారు, తడబడుతూ మాట్లాడేవారు...రకరకాల శారీరక, మానసిక సమస్యలున్న వారికి సైతం ఈ సమాజంలో గౌరవంగా జీవించే హక్కు వుంది. తోటి మనిషిని మనిషిగా గౌరవించాలి. నల్లగా వున్నారనో, స్థూలకాయులనో, అంగవికలురనో, వితంతువులనో హేళన చేయడమంటే...వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. దీనికితోడు బాబాలు, ప్రవచనకారులు, సంఘపరివార్‌ శక్తులు...మహిళల శరీరంపైనా, వారి వస్త్రధారణపైనా విషం చిమ్ముతున్నారు. 'ఇక సాగదు ఈ నేలపై దురాచారం/ ఆశలన్నీ చిగురించే సమయమిది/ అవకాశాలన్నీ మోసులెత్తే సమయమిది/ కొత్త యుగానికి శుభారంభమిది' అంటారు కవయిత్రి వాసా ప్రభావతి. వేళ్ళు ముదిరి ఇంటి పునాదులకే ప్రమాదం వచ్చినప్పుడు ఆ చెట్టును కొట్టేయాలి. మనిషితనానికి ఓ మనిషే విఘాతంగా మారినప్పుడు ఆ మనిషికి బుద్ధి చెప్పాలి. మనిషిపై మనిషికి నమ్మకం కలిగించాలి. మనిషితనాన్ని బతికించాలి.