Jan 29,2023 06:27

గాంబియాలో 66 మంది పిల్లలకు మూత్రపిండాలు పాడై చనిపోయారు. దీనికి కారణం హర్యానా లోని 'మైడెన్‌ ఫార్మా' మందుల కంపెనీ తయారు చేసిన దగ్గు మందు. ఇందులోని డై ఇథలైన్‌ గ్లైకాల్‌, ఇథలిన్‌ గ్లైకాల్‌ అనే మందులు కలుషితం కావడంతో వీరు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఈ విషయం సభ్య సమాజాన్ని కకావికలం చేసింది. హృదయ విదారకమైన ఈ సంఘటన ప్రపంచాన్ని కలచివేసింది. అదేగాక ఇండోనేషియాలో కూడా ఈ తరహా సంఘటన జరిగిందని వార్తలొచ్చాయి. మందులు కలుషితం కావడం, మోతాదుకు మించి ఉపయోగించడం, సరైన ప్రామాణికాలు పాటించకపోవడంతో ఈ ఘటనలు జరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఈ దారుణాన్ని మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్‌కు చెందిన మారియన్‌ బయోటిక్‌ ఫార్మా కంపెనీ తయారుచేసిన డాక్‌వన్‌ మ్యాక్స్‌ అనే కాఫ్‌ సిరప్‌ తాగడంతో గత డిసెంబరులో ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చనిపోయినట్లు వెలుగు లోకి వచ్చింది. దీంతో మందుల కంపెనీల ఎగుమతుల్లో భారత్‌ ప్రతిష్ట మసకబారేలా వుంది.
మన దేశంలోనూ అనేక ప్రాంతాల్లో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో మధుమేహ వ్యాధిగ్రస్తుడు రోజూ ఇన్సులిన్‌ తీసుకుంటున్నప్పటికీ, సుగర్‌ వ్యాధి నియంత్రణ లోకి రాలేదు. దాంతో వైద్యుడు అనుమానంతో ఇన్సులిన్‌ వైల్‌ను పరీక్షకు పంపించగా నిర్ఘాంతపోయే వాస్తవం బైటపడింది. వైల్‌లో ఇన్సులిన్‌ మందు బదులు డిస్టిల్‌ వాటర్‌ వున్నట్లు గుర్తించి దిగ్భ్రాంతి చెందారు. ఔషధ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి ఘటనలు అనేకం వున్నాయి. 1986లో దేశ ఆర్థిక రాజధాని ముంబయి లోని జెజె ఆస్పత్రిలో చోటుచేసుకున్న 14 మరణాలు దేశ ప్రజలను కలచివేశాయి. 10 నుంచి 76 ఏళ్ల వయసు కల్గిన ఈ 14 మంది మూత్రపిండాలు దెబ్బతిని చనిపోయారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఈ మరణాలపై ప్రభుత్వం కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. ఈ దుర్ఘటనపై ముంబాయి హైకోర్టు జడ్జి భక్తావర్‌ లెంటిన్‌తో స్వతంత కమిషన్‌కు ప్రభుత్వం ఆదేశించింది. వివిధ స్థాయి అధికారులు ఈ కంపెనీ అవకతవకల్లో భాగస్వాములైనట్లు కమిషన్‌ గుర్తించింది. డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌ను సమర్ధవంతంగా అమలు చేయాలని సూచించింది. మందుల షాపులు, ఔషధ కంపెనీల్లోని లోపాల్ని ఎత్తిచూపింది. ముంబయి జనాభా అవసరాలకు మించి మందుల షాపులున్నట్లు తేల్చింది. ఈ సంఘటనతో అన్ని పార్వ్శాలను లెంటిన్‌ అధ్యయనం చేసి మందుల తయారీ నుంచి అమ్మకాల వరకు నియంత్రణ, పర్యవేక్షణ లోపాలపై ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక ఇచ్చారు. ఈ తరహా ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
మందుల్లో 35 శాతం వరకు నాసిరకం, నకిలీ మందులు చలామణిలో వున్నాయని...2004లో అప్పటి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పార్లమెంట్‌లో ప్రకటించారు. నాసిరకం మందుల తయారీదారులు, అమ్మకందారులను బహిరంగంగా ఉరితీయాలని ఆవేశంగా మాట్లాడారు. కానీ నాసిరకం మందుల తయారీదారులపై మోడీ ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పర్యవేక్షణ పెంచలేదు. ప్రాణాలను కాపాడ్డానికి ఔషధాలను తయారుచేసే ఫార్మా కంపెనీలు అధిక లాభాల కోసం మనుషుల ప్రాణాలను తీయడానికి సైతం సిద్ధపడుతున్నాయని ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి. ఫార్మా ఉత్పత్తులు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి తప్ప వాటిలో నాణ్యతను పరిశీలించడంలేదు. ఉత్పత్తి సంస్థలు చేస్తున్న తప్పిదాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడటంలేదు. ఔషధ నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయడంలేదు. యాభై ఔషధ కంపెనీలకు, రెండొందల మందుల షాపులకు ఒక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వుండాలన్న సిఫార్సులను అమలు చేయడంలేదు. నాణ్యత, ప్రమాణాలను పరీక్షించాల్సిన సిబ్బంది లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటంతో మందులు విచ్చలవిడిగా మార్కెట్లోకి చేరుతున్నాయి.
గాంబియాలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో భారత్‌కు చెందిన 16 మందుల కంపెనీల దిగుమతులపై నేపాల్‌ ప్రభుత్వం గత డిసెంబరులో నిషేధం విధించింది. ఇందులో రామ్‌దేవ్‌ బాబాకు చెందిన దివ్య ఫార్మసీ, పతంజలి ఉత్పత్తులు కూడా వున్నాయి. భారత్‌ లోని ప్రముఖ మందుల ఉత్పత్తి కంపెనీలు కూడా నిషేధిత జాబితాలో వున్నాయి. అనేకసార్లు అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేసిన భారత్‌కు చెందిన ప్రఖ్యాత కంపెనీల మందులు తరచూ వెనక్కి వస్తున్నాయి. నేపాల్‌ ప్రభుత్వం నిషేధించిన మందులు భారత్‌ మార్కెట్‌లో వినియోగంలో వున్నాయంటే, ప్రభుత్వం మందుల కంపెనీల పట్ల ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నదీ అర్ధమవుతుంది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భారత ఔషధ నియంత్రణ వ్యవస్థను పటిష్టపరచాలి. ఉత్పత్తిలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చట్టాలకు మరింత పదును పెట్టాలి. నాసిరకం మందులు తయారుచేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా వ్యవస్థలను బలోపేతం చేయనంతకాలం ప్రజల ప్రాణాలకు రక్షణ వుండదు. ప్రయివేటు మందుల ఉత్పత్తిదారులను ప్రోత్సహించి, ప్రభుత్వ రంగం లోని ఔషధ కంపెనీలను మూసివేసిన దుష్ఫలితాలు ఇప్పుడు ఈ రూపాల్లో ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. ప్రయివేటు ఔషధ కంపెనీల మోసాలకు ప్రభుత్వాలు ముకుతాడు వేసి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. 'లెంటిన్‌' సిఫారసులను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలుచేయాలి.

kameswarao

 

 

 

 

 

 

వ్యాసకర్త: టి. కామేశ్వరరావు, ప్రజా ఆర్యోగ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సెల్‌: 9985250991