Jul 08,2023 06:20

ప్రాణాధార మందులు తయారుచేసే ఫార్మా పరిశ్రమలు...అక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికుల ప్రాణాలను తోడేసే మృత్యు కుహరాలుగా మారడం దారుణం. యాజమాన్యాల తప్పిదాలు, తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన పలు విభాగాల అధికార యంత్రాంగం వైఫల్యాలు విలువైన ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ లోని సాహితీ ఫార్మా ల్యాబ్‌లో చోటుచేసుకున్న తాజా ప్రమాదం ఆరుగురిని బలిగొనడం, మరికొందరు తీవ్రంగా గాయపడటం, మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ముగ్గురు తీవ్రంగా గాయపడడం బాధాకరం.

  • రక్షణ లేని జీవితాలు

యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్‌ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్‌ రియాక్షన్‌ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్‌ లాంటి వాహన సౌకర్యాలు లేక నగరానికి చేరే లోపు మరణించిన ఘటనలు కోకొల్లలు. స్థానికంగా విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండడంతో వారి తరపున పరిశ్రమల యాజమాన్యాలపై పోరాటం చేసేవారు లేక కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అనకాపల్లి జిల్లా పరిధిలోనే 2019 నుండి 2023 జులై వరకు జరిగిన 44 ప్రమాదాల్లో 17 మంది మరణించగా, 53 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇవన్నీ అధికారికంగా నమోదైన కేసులు కాగా బయటకురాని సంఘటనలు అనేకం ఉంటాయి. అచ్యుతాపురం సెజ్‌లో బ్రాండిక్స్‌ సీడ్స్‌ విభాగంలో 2022 జూన్‌ 3న, ఆగస్టు 2న విషవాయువు లీకై 500 మందికిపైగా మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంపై కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టలేదు. ఈ ఘటనను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) సుమోటాగా తీసుకొని కార్మికులకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని వెల్లడించింది. దీనిని కూడా ఆ కంపెనీ యాజమాన్యం అమలు చేయడానికి నేటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కల్పించాల్సిన యాజమాన్యాలు తమ లాభాల కోసం వెంపర్లాడడం కార్మిక ద్రోహం.

  • పర్యవేక్షణకు నోచుకోని డిపార్టుమెంట్లు

పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందించి, అందుకనుగుణంగా చర్యలు చేపట్ట్లాలి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం మినహాయిస్తే ప్రమాద కారణాలపై నివేదికలను విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. దీంతో కార్మికుల రక్షణ, కార్మిక చట్టాలు, హక్కులు, పరిశ్రమల్లో సేఫ్టీ అంశాలు, పరికరాలపై నిత్యం తనిఖీలు చేయడం వట్టి మాటగానే మారింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట ప్రభుత్వ శాఖల నుండి జరగవలసిన తనిఖీలు దాదాపుగా నిలిపివేశారు. దాంతో కంపెనీల ఇష్టారాజ్యంగా ఉంది. ఫార్మా పరిశ్రమల్లో వినియోగించే హానికరమైన రసాయనాలపై ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడం, రక్షణ పరికరాలు సమకూర్చడం తదితర చర్యలన్నింటినీ పరిశ్రమలు గాలికొదిలేశాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయడం, పర్యావరణ పరిరక్షణకు, వాతావరణంలో విష వాయువుల మోతాదును తగ్గించడానికి గ్రీన్‌ బెల్ట్‌ను ఏర్పాటు చేయడం, రహదారులను నిర్మించడం వంటివి ఎక్కడా కానరావడంలేదు.

  • ప్రమాదాలు జరగుతున్నా అదే నిర్లక్ష్యం

ప్రమాదాలు జరిగిన వెంటనే మంత్రులు, ప్రజా ప్రతినిధులు రావడం, కంపెనీల్లో భద్రతా చర్యలు చేపడుతున్నామని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. గతంలో సెజ్‌లో జరిగిన ప్రమాదాలపై కమిటీలు వేసి, విచారణ జరిపించిన వైసిపి ప్రభుత్వం ఇంతవరకు ఆ నివేదికలను బయటపెట్టలేదు. కర్మాగారాల్లో భద్రతా చర్యలపై తనిఖీలు చేయాల్సిన పరిశ్రమలు, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, తదితర శాఖల అధికారులు యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుని 'అంతా బాగానే ఉంది' అని సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు. అధికారులు ఏడాదికి రెండుసార్లు ప్రతి కంపెనీ, పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లు తనిఖీలు చేసి, లోపాలను సరిచేయించాలి. కానీ జిల్లాలోని పరిశ్రమల్లో ఈ విధంగా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవనే చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టి...ఉద్యోగులు, కార్మికుల ప్రాణాలు కాపాడాలి.

alluraju

 

 

 

 

 

వ్యాసకర్త సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ సభ్యులు అల్లు రాజు