Mar 04,2023 15:02

హైదరాబాద్‌ : నగరంలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్‌ చొరవతో నాలాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. పికెట్‌ నాలాపై వంతెన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి ఏప్రిల్‌ చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం మినిస్టర్‌ రోడ్‌ లో గల పికెట్‌ నాలా పై ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది పెంచి పనులు వేగంగా చేపట్టాలని సూచించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలాకు ఎగువ నుంచి వచ్చే నీరు సక్రమంగా వెళ్లక పరిసర కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కరాచీ బేకరీ వద్ద పికెట్‌ నాలాపై రూ. 10 కోట్ల వ్యయంతో నాలాలోని నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్లిపోయే విధంగా నూతనంగా వంతెనను నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.
మినిస్టర్‌ రోడ్‌ లో ఉన్న పాత వంతెన ను తొలగించి గతంలో ఉన్న దానికంటే ఎత్తులో, వాహనాల రాలపోకలు సులువులుగా సాగేలా వెడల్పు గా నిర్మిస్తున్నట్లు చెప్పారు. వంతెన నిర్మాణంతో అన్నా నగర్‌, రసూల్‌ పురా బస్తీ, ఇక్రిశాట్‌, బెల్‌ కాలనీ తదితర అనేక కాలనీలకు ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. బేగంపేట నాలా పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నాలా వెంట ఉన్న కాలనీలలో డ్రెయినేజీ, వాటర్‌ పైప్‌ లైన్‌ పనులు పూర్తయ్యాయని, రోడ్డు నిర్మాణం పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన నాలాల నిర్వహణను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కూడా వరద ముంపు సమస్యకు ఒక కారణంగా పేర్కొన్నారు. మంత్రి వెంట బేగంపేట కార్పొరేటర్‌ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్‌ అత్తిలి అరుణ గౌడ్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్‌ఎన్‌డీపీ సీఈ కిషన్‌, వాటర్‌ వర్క్స్‌ డైరెక్టర్‌ కఅష్ణ, ఈఈ సుదర్శన్‌, వాటర్‌ వర్క్స్‌ జీఎం రమణా రెడ్డి, శానిటేషన్‌ డీఈ శ్రీనివాస్‌, ఎలక్ట్రికల్‌ డీఈ శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.