- వైసిపి, టిడిపి ఎటువైపో తేల్చుకోవాలి : వి. శ్రీనివాసరావు
- పునరావసం పూర్తయిన తరువాతే పోలవరం డ్యామ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేశాన్ని రక్షించుకోవాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశరక్షణ భేరీలో భాగంగా విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఆర్థికదోపిడీ ఆపాలన్నా, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవాలన్నా మోడీ సర్కారును గద్దెదించడమొక్కటే మార్గమని ఆయన అన్నారు. కొద్దిరోజులుగా ఎన్నడూ లేని విధంగా శనివారం విజయవాడలో ఎండకాసింది. పైగా మిట్ట మధ్యాహ్నాం 12 గంటల సమయంలోనూ సభ కొనసాగింది. ఆ మండుటెండలోనూ సభకు హాజరైన వేలాదిమంది కదలకుండా ఏచూరితో పాటు, ఇతరుల ప్రసంగాలను విన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, అది పెంచి పోషిస్తున్న మతోన్మాదాన్ని వక్తలు విమర్శించినప్పుడు సభకు హాజరైన వారు పెద్దఎత్తున కరతాళధ్వనులు చేశారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఏడేళ్ల బిజెపి పాలనలో నిరుద్యోగం, పేదరికం, ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. దేశ వ్యాప్తంగా 42 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని చెప్పారు. తినడానికి తిండికూడా లేని అభాగ్యుల సంఖ్య పెరుగుతోందన్నారు. అదే సమయంలో పెద్దపెద్ద పెట్టుబడిదారులకు 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేశారని, మరో రూ.2 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారని తెలిపారు. ఇదంతా సాధారణ ప్రజల కష్టార్జితమేనని, వారు రూపాయి, రూపాయి కూడగట్టి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులేనని వివరించారు. కార్పొరేట్లు రుణాల తీసుకుని ఎగ్గొడుతున్నా మోడీ సర్కారు పట్టిచుకోవడం లేదని చెప్పారు. వాటిని వసూలు చేస్తే దేశం అన్ని రంగాల్లోనూ ముందుక వెళ్తుందని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఉండదని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలేసిన మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలు, రవాణా వ్యవస్థలను తెగనమ్ముతోందన్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొచ్చిన ఐదుగురు మహా కోటీశ్వరులు గుజరాత్‌కు చెందిన వారేనని చెప్పారు. ఉపాధి హామీ పనులకు రూ.73 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని కేంద్రం గుజరాత్‌కు చెందిన వేదాంతకు రూ.80 వేలకోట్ల మైనింగ్ సబ్సిడీ ఇచ్చిందని చెప్పారు. ఒకవైపు కార్పొరేట్లకు భారీ ఎత్తున లభ్ది చేకూరుస్తున్న మోడీ ప్రభుత్వం అందే సమయంలో ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు చేస్తూ లౌకికతత్వానికి తూట్లు పొడుస్తోందని వివరించారు. అత్యాచారానికి గురైన బిల్కిస్‌బానో కేసులో నేరస్తులను శిక్ష పూర్తికాకుండానే వదిలేసిందని, వారిని హీరోలుగా చిత్రీకరిస్తోందని అన్నారు. . బీమా కోరేగావ్ కేసులో మేధావులు, రచయితలను జైల్లో కుక్కి నాలుగేళ్లవుతున్నా ఛార్జిషీటు దాఖలు చేయలేదని చెప్పారు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరుగుతోందని, ప్రశ్నించిన వారిపైనా, ప్రతిపక్ష నాయకులపైనా సిబిఐ, ఇడి దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని తెలిపారు. కర్నాటక, గోవా, మహారాష్ట్రలో బిజెపి ఓడిపోయినా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని, దీనివెనుక సిబిఐ, ఇడి ఉన్నాయని తెలిపారు. మోడీ ప్రభుత్వ హయాంలో 11 వేలమంది యువకులు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మహిళలపై దాడులు 20 శాతం పెరిగాయని వివరించారు. దళితులపై దాడులకు అంతేలేదని వివరించారు. భూములు సాగుచేసుకుంటున్న దళితులు, మైనార్టీలను ఆ భూముల్లో నుండి తరిమేస్తూ వాటిని భూస్వాముల పరం చేస్తున్నారని తెలిపారు. మీడియా సంస్థలను భయపెట్టి ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారాలకు దిగుతోందని తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన దేశ భక్తులకు పోరాడే సమయం వచ్చిందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతారా లేదా బిజెపిని పాలనను నిలబెడతారా అనేది వైసిపి తేల్చుకోవాలని తెలిపారు. రూ.36 వేల కోట్లు కేంద్రం నుండి రావాల్సి ఉన్నా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అడగడం లేదని విమర్శించారు. బిజెపి వ్యతిరేక పోరాటాలు రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని వాటిపట్ల వైసిపి వైఖరి స్పష్టం చేయాలన్నారు.
- రాష్ట్రంలో బిజెపి వత్తాసుతో అడ్డగోలు పాలన
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రం పట్ల వైసిపి సానుకూల వైఖరి అనుసరిస్తోందన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా మాట్లాడటం లేదన్నారు. విశాఖ ఉక్కును అమ్మేస్తుంటే కార్మికులే పోరాడుతున్నారని కడప ఉక్కు ఫ్యాక్టరీని ఇంతవరకు నిర్మించలేదని విమర్శించారు. పోలవరం పునరావాసం గురించి పట్టించుకోవడం లేదన్నారు. ముంపు లెక్కలు సక్రమంగా లేకపోవడంతో ప్రభుత్వం చెబుతున్న దానికన్నా ఎక్కువ ప్రాంతం నీట మునుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌లో తప్పులున్నాయని చెబుతున్న ప్రభుత్వం ముంపు లెక్కలు సక్రమంగా ఉన్నట్లు భావిస్తోందని, ఇదెక్కడి పద్దతని ప్రశ్నించారు. పాత ముంపు లెక్కలను పక్కనబెట్టి కొత్తగా లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో ముంపు బాధితులను గుర్తించి, వారికి పరిహారం, పునరావాసం పూర్తి చేసిన తరువాతే పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగించాలన్నారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని ప్రచారం చేస్తున్నవారికే కాలం చెల్లుతోందన్నారు. ప్రపంచవ్మాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రై తులకు కనీస మద్దతు ధర లేదని, గంటకో రైతు ఆత్మహత్యచేసుకుంటున్నారని, శాంతి భద్రతల సమస్యలు పెరిగాయని అన్నారు. సంక్షేమ పథకాలు అంటూనే ఎస్‌సి, ఎస్‌టిలకు ఇస్తున్న కరెంటు రాయితీలకు కోత పెట్టారని తెలిపారు. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి పదిరూపాయలు గుంజుకుంటోందని విమర్శించారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని పక్కదారి పట్టించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులు, కౌలు రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. కౌలు రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరారు. ప్రజల సమస్యలపై పోరాటాలు పెరుగుతున్నాయని చెప్పారు. వైసిపితో పాటు టిడిపి కూడా ప్రజల వైపు ఉంటారో, వారిని కష్టాల పాల్జేస్తున్న మోడీ సర్కారు వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ కేంద్ర కమిటీ షభ్యుల ఎం.ఏ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ, సీనియర్ నాయకులు పి.మధు, గిరిజన నాయకులు మొడియం నాగమణి ప్రసంగించారు. నాగమణి గిరిజన భాషలో ప్రసంగించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ వక్తలను వేదిక మీదకు ఆహ్వానించగా ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ వందన సమర్పణ చేశారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేశాయి. వేదికపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు, పి.జమలయ్య, బి.తులసీదాస్, జిల్లా కార్యదర్శులు వై.నరసింహారావు, పాశం రామారావు, ఎ.రవి బి.బలరాం, జి.విజయకుమార్, గంగయ్య పాల్గన్నారు. పట్టణ ప్రముఖులు, వామపక్ష అభిమానులు అనేక మంది ఈ సభకు వచ్చి సంఘీభావం ప్రకటించారు.



















