Dec 08,2022 17:08
  •  పాడేరు పిఒ మందలింపులే కారణం ?

ప్రజాశక్తి - పెదబయలు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహశీల్దారు ఒ.శ్రీనివాసరావు (48) గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో సివిల్‌ సప్లరు విభాగంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఇటీవలే పెదబయలు తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో ఉంటున్నారు. సెలవుల్లో కూడా ఇంటికి వెళ్లకుండా కార్యాలయంపై ఉన్న నివాస గృహంలోనే ఉంటూ విధులకు హాజరవుతున్నారు. ఈ నెల 5న జగనన్న భూ సర్వేపై కలెక్టర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులకు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో పాడేరు ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ కలెక్టర్‌ సమక్షంలోనే శ్రీనివాసరావును మందలించారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 'నేను ఈ అవమానం భరించలేను. ఆత్మహత్య చేసుకుంటాను' అని పలుమార్లు తహశీల్దారు కార్యాలయ సిబ్బంది వద్ద చెప్పినట్టు సమాచారం. గురువారం ఉదయం కార్యాలయానికి వచ్చిన అటెండర్‌ రవికిరణ్‌ టిఫిన్‌ ఇచ్చేందుకు తహశీల్దార్‌ నివాసానికి వెళ్లగా ఆయన ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ పులి మనోజ్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాసరావు, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌, డిఆర్‌ఒ దయానిధి మృతదేహాన్ని సందర్శించారు. శ్రీనివాసరావు భార్య లక్ష్మి శివరోజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తహశీల్దారు మృతిపై సమగ్ర విచారణ జరపాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. పిఒ గోపాలకృష్ణ దుర్భషలాడటం వల్లే తహశీల్దారు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.