గాజా : అంబులెన్స్ కాన్వాయ్ పై ఇజ్రాయిల్ అమానవీయ దాడిని పాలస్తీనా రెడ్ క్రసెంట్ సొసైటీ (పిఆర్‌సిఎస్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి ఓ ప్రకటనను విడుదల చేసింది. అల్ షిఫా ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట అంబులెన్స్‌లు లక్ష్యంగా ఇజ్రాయిల్ సైన్యం క్షిపణిని ప్రయోగించిందని, ఈ దాడిలో 15 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ ఏడున గాజాలో యుద్ధ ప్రారంభమైనప్పటి నుండి అంబులెన్స్‌లు లక్ష్యంగా ఇజ్రాయిల్ చేపట్టిన దాడిలో ఎనిమిది అంబులెన్స్‌లు ధ్వంసమయ్యాయని పిఆర్‌సిఎస్ పేర్కొంది. వైద్య బృందాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం జెనీవా ఒప్పందం ఉల్లంఘనేనని, ఇది యుద్ధ నేరమని స్పష్టం చేసింది.
స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.05 గంటల సమయంలో పాలస్తీనా ఆరోగ్య శాఖ నిర్ణయం మేరకు ఆల్ షిఫా ఆస్పత్రి నుండి అంబులెన్స్‌కాన్వాయ్ బయలు దేరింది. ఈ కాన్వాయ్ లో ఆరోగ్య శాఖకి చెందిన నాలుగు అంబులెన్స్‌లు, ఒకటి పిఆర్‌సిఎస్ అంబులెన్స్ ఉన్నాయని తెలిపింది. ఆస్పత్రి నుండి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన కాన్వాయ్ .. ఇటీవల ఈజిప్ట్ తెరిచిన రఫా సరిహద్దు దాటింది. అక్కడి నుండి సరైన రహదారి లేకపోవడంతో వెనక్కి తిరిగింది. తిరిగి అల్ షిఫా ఆస్పత్రికి చేరుకునే సమయంలో మొదటి అంబులెన్స్ లక్ష్యంగా ఇజ్రాయిల్ క్షిపణితో విరుచుకుపడినట్లు పిఆర్‌సిఎస్ తెలిపింది.
ఈ అంబులెన్స్‌లలో హమాస్ ఉగ్రవాదులను, ఆయుధాలను తరలిస్తున్నట్లు ఇజ్రాయిల్ వాదిస్తోంది. తమ దాడిలో పెద్ద సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు మరణించినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. అయితే ఈ వాదనను నిర్థారించే ఎలాంటి ఆధారాలు చూపలేదు.
ఇజ్రాయిల్ వాదనను పాలస్తీనియన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్ -ఖుద్రా తీవ్రంగా ఖండించారు. తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం ఈ ఆంబులెన్స్‌లలో ఈజిప్ట్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ దాడిలో సుమారు 9,299 మంది పాలస్తీనియన్లు మరణించగా, 25, 000 మందికి పైగా గాయపడ్డారని గాజా వైద్య శాఖ తెలిపింది.
అంబులెన్స్‌పై దాడిని ఐరాస అధ్యక్షుడు అంటోనియో గుటెరస్ ఖండించారు. ఈ దాడి ఘటన తనను భయాందోళనకు గురిచేసిందని అన్నారు. ఆస్పత్రి వెలుపల వీధిలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల దృశ్యాలు భయానకంగా ఉన్నాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.