Mar 09,2023 06:33

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎప్పటి కప్పుడు జరుగుతున్నప్పటికీ, పాకిస్తాన్‌ నిజానికి మిలిటరీ ఆధ్వర్యంలో నడిచే దేశం. కాబట్టి సైన్యం ఇప్పుడు అక్కడ అన్నిటికన్నా ప్రాధాన్యత కలిగిన విభాగం. ఆ సైన్యానికే రెండు పూటలా భోజనం కష్టమవుతుండడం పాకిస్తాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభానికి దర్పణం పడుతోంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు తీవ్రవాద దాడులు కూడా పదే పదే జరుగుతున్నాయి. సైన్యం, పోలీసులకు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థ తెహ్రిక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టిటిపి) ఈ దాడులకు పాల్పడుతోంది. ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న పాకిస్తాన్‌లో రాజకీయ రంగం కూడా ఉత్కంఠ రేపుతోంది. దీని నుంచి పాకిస్తాన్‌ ఆర్మీ కూడా ప్రయోజనం పొందాలని చూస్తోంది.

  • ఆర్థిక సంక్షోభం

పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశ విదేశీ అప్పు 1,30,000 కోట్ల డాలర్లు. దేశ బడ్జెట్‌లో సగం విదేశీ రుణం చెల్లించేందుకే సరిపోతుంది. ఆహార పదార్థాలు, ఇంధనం తదితరాలను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన విదేశీ మారకద్రవ్య నిల్వలు కరువయ్యాయి. పాకిస్తాన్‌ తన విదేశీ రుణంలో భాగంగా వచ్చే ఏడాదిలో 22 బిలియన్‌ డాలర్లను తిరిగి చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం తన దగ్గర ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 300 కోట్ల డాలర్లు మాత్రమే. తాజా సమాచారం ప్రకారం, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు నలభై శాతం పెరిగాయి. దీంతో పెట్రోల్‌ ధర రూ.267, డీజిల్‌ రూ.184, కిరోసిన్‌ ధర రూ.187 ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడిదారీ దేశాలు తమ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి అనుసరించిన పన్ను సంస్కరణలు విఫలమయ్యాయి.
ఈ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికిగాను...ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించడం, విదేశాలలో పనిచేస్తున్న పాక్‌ రాయబార కార్యాలయాల సంఖ్యను తగ్గించడం, కోత పెట్టడం వంటి తీవ్రమైన పొదుపు చర్యల వైపు పాకిస్తాన్‌ అడుగులు వేస్తోంది. పాక్‌ గూఢచారి సంస్థ (ఐఎస్‌ఐ)కి మాత్రం ఎలాంటి నిధుల కొరత లేదు. ఇది ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ప్రజలను మరింత దుర్భర పరిస్థితులలోకి నెడుతోంది.
ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి పాకిస్తాన్‌ ఎంచుకున్న చివరి మార్గం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి అప్పు తీసుకోవడం. ఇప్పుడు అందజేసే సాయంతో పాటు, ఐఎమ్‌ఎఫ్‌ ఇప్పటికే 22 సార్లు పాకిస్తాన్‌కు రుణాలు మంజూరు చేసింది. మరో 6.5 బిలియన్‌ డాలర్ల రుణం కోసం పాకిస్తాన్‌ ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతోంది. అందుకుగాను ఐఎంఎఫ్‌ నిర్మాణాత్మక సంస్కరణలతో సహా అనేక చర్యలను ముందుకు తెచ్చింది. తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకోవడానికి, తన విదేశీ అప్పుల వాయిదాలను తిరిగి చెల్లించడానికి వాటిని అంగీకరించడం మినహా పాకిస్తాన్‌కు మరో మార్గం లేదు. అంతే కాకుండా సౌదీ అరేబియా, చైనా సహా పశ్చిమాసియా దేశాల సాయాన్ని కూడా అది కోరింది.
కోవిడ్‌ మహమ్మారి ప్రభావం నుండి కోలుకోక ముందే గత సంవత్సరం సింధ్‌, బెలూచిస్తాన్‌, ఖైబర్‌ పఖ్తుంక్వా రాష్ట్రాలను నాశనం చేసిన వరదలు పాకిస్తాన్‌ వెన్నెముకను విరిచేశాయనే చెప్పవచ్చు. మూడున్నర కోట్ల మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన ఈ వరదల్లో 1800 మందికిపైగా మరణించారు. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1500 కోట్ల డాలర్ల ఆస్తి నష్టం జరిగింది.

  • పని చేయని అమెరికన్‌ ఏటీఎం

1951 - 2011 మధ్య ఆరు దశాబ్దాల పాటు పాకిస్తాన్‌కు అమెరికా 6,700 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే గత 20 ఏళ్లలో 3,200 కోట్ల డాలర్లు ఆర్థిక సాయం మాత్రమే అందించింది. అంతే కాకుండా కోవిడ్‌ మహమ్మారిపై పోరాడేందుకు ఎనిమిది కోట్ల డాలర్ల సాయం కూడా అందించింది. ఈ ఆర్థిక సహాయంలో ఎక్కువ భాగం 1960ల నుండి పాకిస్తాన్‌ అనుసరిస్తున్న అమెరికా అనుకూల విదేశాంగ విధానంలో భాగం. ప్రొఫెసర్‌ అజరు దర్శన్‌ బెహ్రా ప్రకారం....1960లలో జనరల్‌ యాహ్యా ఖాన్‌ హయాంలో, 1980లలో జనరల్‌ జియా-ఉల్‌-హక్‌ కాలంలో పాకిస్తాన్‌ అమెరికాకు తాబేదారుగా వ్యవహరించింది. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకున్న అమెరికా పాకిస్తాన్‌ను పావుగా ఉపయోగించుకుంది. ఇందుకుగాను ఆ దేశానికి ఉదారంగా నిధులు అందజేసింది. ఆ తరువాత జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ హయాంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లపౖౖె అమెరికా దాడులకు పాక్‌ సహకరించింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఓటమిని అంగీకరించి వెనక్కి తగ్గిన అమెరికాకు ఇప్పుడు పాకిస్తాన్‌ అవసరం తీరిపోయింది.. అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు తోడ్పాటునందించడం పాకిస్తాన్‌ చేసిన ఘోర తప్పిదం. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పాకిస్తాన్‌ సహా సంబంధిత దేశాలకు అమెరికా ఏటీఎం కాకూడదని, అధికారంలోకి వస్తే పాకిస్తాన్‌ కు ఆర్థిక సాయం నిలిపివేస్తామని న్యూయార్క్‌ పోస్ట్‌లో రాసిన కథనంలో హేలీ పేర్కొన్నారు..

  • తెహ్రిక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్తాన్‌

ఇది సంక్షోభంలో ఒక అంశం మాత్రమే. అసలు ఈ ఉగ్రవాద సంస్థ మొదట ఉనికిలోకి తెచ్చింది అమెరికానే. ఆర్మీ చీఫ్‌ జియా-ఉల్‌-హక్‌ సైనిక పాలకుడిగా ఉన్న సమయంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా అమెరికా ఈ తాలిబాన్లను తెరపెకి తెచ్చింది. దాని ఉప ఉత్పత్తే తెహ్రిక్‌-ఇ-తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టిటిపి). ఈ ఊగ్రవాద సంస్థ ఇప్పుడు పాకిస్తాన్‌ ప్రభుత్వానికే సవాల్‌ విసురుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌ లాగా పాకిస్తాన్‌ను పూర్తిగా ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడమే టిటిపి లక్ష్యం. అందుకోసం అమాయకులను ప్రాణాపాయంలోకి నెట్టే ఉగ్రవాద దాడులకు తెగబడ్డారు.
2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానమంత్రి పదవి నుండి తొలగించబడిన తెహ్రీ-కె ఇన్సాఫ్‌ పార్టీ నాయకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఆందోళన బాట పట్టారు. సైన్యం జోక్యంతో ఆయన గద్దెనెక్కిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో ఇమ్రాన్‌పై జరిగిన హత్యాయత్నం షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని మరింత బలహీనపరిచింది. ఇమ్రాన్‌పై విదేశీ నిధుల దుర్వినియోగం, దాడులు, హత్యాయత్నాలు, అనేక అవినీతి కేసులు ఉన్నప్పటికీ పాక్‌ కోర్టులు ఇమ్రాన్‌కు అండగా నిలుస్తున్నాయని బలమైన ఆరోపణ ఉంది.
గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పాక్‌ ఆర్మీ జోక్యం వల్లే ఇమ్రాన్‌ ఖాన్‌ విజయం సాధించారని ఆరోపణలు వచ్చాయి. ఆర్మీలో ముఖ్యమైన పోస్టుల నియామకాల విషయంలో ఇమ్రాన్‌ ఖాన్‌కు, ఆర్మీ చీఫ్‌కు మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ తర్వాత మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధాని అయ్యారు. ఆ మంత్రివర్గం ఏర్పాటులో సైన్యం పాత్ర కూడా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, సైన్యాన్ని విస్మరించి, వారితో పోరాడుతూ పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వమూ ముందుకు సాగదు. ఐఎమ్‌ఎఫ్‌ రుణం పొందడానికి, రక్షణ వ్యయం కూడా తగ్గించబడింది. ఒకవేళ ప్రభుత్వానికి దమ్ముంటే సైన్యం అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఇది మరో సైనిక తిరుగుబాటుకు కూడా దారితీయవచ్చు.
పాకిస్తాన్‌లో మత ఛాందసవాదం, రాజకీయ నాయకుల అవకాశవాదం, సైనిక నాయకత్వం, అమెరికా సహకారంతో మత ఛాందసవాదం, ఉగ్రవాదం వెరసి పాకిస్తాన్‌ను సంక్షోభంలోకి నెట్టాయి. అమెరికా సహా ప్రపంచ ఆధిపత్య దేశాల క్రియాశీల మద్దతుతో, సైన్యం పాకిస్తాన్‌ రాజకీయాలపై పట్టు సాధించింది. పాకిస్తాన్‌లో నేడు మిగిలి ఉన్నది మత ఛాందసవాదం, ఉగ్రవాద దాడులు, అధికార దాహంతో కూడిన సైన్యం, ప్రజాస్వామ్యంలో పునాది లేని రాజకీయ పార్టీలు, కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ, ప్రమాదకరమైన అణ్వాయుధాలు. అమెరికా విదిల్చే రొట్టెముక్కల కోసం, అది తెచ్చే ఒత్తిళ్లకు దాసోహమైనందుకు తన కాళ్ళ కింద నేల కదిలిపోతున్నా గ్రహించని దేశం యొక్క విషాద చిత్రమే నేటి పాకిస్తాన్‌ ముఖచిత్రం.

1

 

 

 

 

 

వ్యాసకర్త: ప్రొ|| జోసెఫ్‌ ఆంటొనీ కేరళ విశ్వవిద్యాలయంలో
మార్క్సియన్‌ స్టడీస్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ డైరెక్టర్‌