Jul 21,2023 22:17

న్యూఢిల్లీ : శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కి గురువారం చేరుకున్నారు. ఆయనకు కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి. మురళీధరన్‌ స్వాగతం పలికారు. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌కి చేరుకున్న విక్రమ్‌సింఘేకు ప్రధాని నరేంద్రమోడీ సాదరంగా స్వాగతం పలికారు. ఇరువురు ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాలపై హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్వీట్‌ చేశారు. 'ఈ ఏడాది రెండు దేశాలు దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. దీర్ఘకాలంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను సమీక్షించి, రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకోవడానికి ఈ సమావేశం దోహపడతుంది' అని అరిందమ్‌ బాగ్చి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, మోడీని కలిసే ముందు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ శ్రీలంక ప్రధానిని కలిశారు. ఇక భారతదేశం పొరుగుదేశమైన శ్రీలంక ఫస్ట్‌ పాలసీ, విజన్‌ సాగర్‌లో కీలక భాగస్వామిగా ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని బలపరుస్తుందని, ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకర సహకార మార్గాలకు దోహదపడుతుందని ఇరు నేతలు భావిస్తున్నారు.