
రాష్ట్రంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, ప్రజా సంఘాలు కలసి బడి కోసం బస్సు యాత్రను మొదలుపెట్టాయి. ఈ కార్యక్రమం మొన్న 25న మొదలై ఈ నెల 31 వరకు సాగనుంది. 3, 4, 5 తరగతుల విలీనం నిలుపుదల చేయాలని, పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియాలు సమాంతరంగా నడపాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో మొదలై సత్యసాయి జిల్లా పెనుకొండ వరకు ఈ బస్సు యాత్ర సాగుతుంది. అసలు ఎందుకు ఈ బస్సు యాత్ర? ఎవరికోసం?
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకు వస్తున్న మార్పుల గురించి గనుక ఆలోచిస్తే సామాన్య వ్యక్తికి కూడా కలత తప్పదు. అందరికీ సమానంగా విద్య అందాలని ఆశించే వారికి వ్యధ, ఆవేదన తప్పవు. 3, 4, 5 తరగతులను ఎక్కడో దూరంగా ఉన్న (1, 2 కిలోమీటర్ల దూరంలో) ఉన్నత పాఠశాలలకు తరలించి ప్రతిరోజు వారు చదువుకోడానికి ఇక్కడకు మాత్రమే రావాలి అని నిర్దేశించడం ఎవరికి లాభం చేకూర్చడానికి? ఇంటికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న పాఠశాలను వదిలి చదువుకోడానికి, చతుర్విధ ప్రక్రియలు నేర్చుకోడానికి అడుగులు కాదు పరుగులు తీయాలి అంటే ....అప్పుడే మాట స్థిరపడి, భాష సరిపడి, నల్ల బల్ల మీద నుండి పుస్తకాల మీద పఠనం కోసం చూపు నిలబడిన పసి బాలల గురించి ఈ ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించిందా? లేదనే చెప్పాలి. గోడలకు రంగులు వేయడంలో ఉన్నంత లగం పసి మనసుల మీద రవ్వంత ఉన్నా ఈ పాఠశాలల విలీనం ప్రభుత్వం చేపట్టేదే కాదు.
కానీ నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ వయస్సును సైతం లెక్క చేయకుండా నిర్విరామంగా పని చేసే పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు ఈ విషయాన్ని అలక్ష్యం చేసే మనస్తత్వం లేదు. అందుకే ప్రజా సంఘాల తోడుతో ఈ బస్సు యాత్రకు బయలుదేరారు. ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ విలీన ప్రక్రియ గురించి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని బయలుదేరారు. ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వానికి నచ్చచెప్పాలని నడుం బిగించారు.
ఈ యాత్ర ఎవరి గుండెల్లో గుబులు రేపుతుందో వారు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాల కోసమే ఈ బస్సు యాత్ర చేపట్టారని ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలే వారికి సమాధానం చెబుతారు. పాఠశాలలు పున:ప్రారంభమైన రోజు నుంచే పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్న తల్లిదండ్రుల ఆవేదన చూసి కూడా ఈ యాత్రలో తాము సైతం భాగస్వాములం కావాలనుకోవాల్సింది పోయి విమర్శలు గుప్పిస్తున్నారు అంటే వారు ఎటువైపో సమాధానం చెప్పాలి!
అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో మాతృభాషలో బోధన జరుగుతూ ఉంటే, విద్యా హక్కు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా ఒకే మాధ్యమం అని, అది కేవలం ఇంగ్లీషు మాధ్యమం మాత్రమే అని నిరంకుశంగా వ్యవహరించడం విద్యార్థుల పట్ల అన్యాయమైనది. అటు ఉపాధ్యాయ సంఘాలు, ఇటు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అనేకమార్లు ప్రాతినిధ్యాలు చేసినా విలీనాలు గురించి ఉపాధ్యాయులకు ఎందుకు అని, ప్రభుత్వ విధానాన్ని వద్దు అనే అధికారం ఉపాధ్యాయులకు ఎక్కడిది అని, ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారా అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు?
ప్రభుత్వం విద్యా వ్యవస్థ నుండి తన భారాన్ని, బాధ్యతను తగ్గించుకోవడానికి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకుండా, కాంట్రాక్టు, మినిమం టైం స్కేల్ పొందే ఉద్యోగుల ద్వారా బోధన కొనసాగిస్తూ, డీఎస్సీ ప్రకటించకుండా, ఉన్న ఉపాధ్యాయులపై పని భారాన్ని మోపుతూ, బోధన సమయాన్ని రకరకాల యాప్‌ల కోసం కేటాయించే విధంగా పని ఒత్తిడికి గురి చేస్తూ, ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఉపాధ్యాయులను వినియోగించుకుంటున్నారు. విద్యార్థులను పాఠశాలకు రానివ్వండి! దూర పాఠశాలలకు తరలించకండి అని మొర పెట్టుకుంటుంటే, ఆ నెపాన్ని ఉపాధ్యాయుల మీద తోయడానికి ఇటువంటి ప్రశ్నలను సంధించడం తగదు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న ప్రతి ఉద్యోగి, రాజకీయ నాయకులతో సహా ఈ ప్రశ్నలు వేసుకుంటే సరైన సమాధానం రాగలదు. ఈ బస్సు యాత్రతో ప్రజలు నిజాన్ని తెలుసుకుంటారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీల సారథ్యంలో సాగుతున్న ఈ బస్సు యాత్ర జైత్రయాత్ర కాగలదు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులతో అణచివేయడం మాని తన పాఠశాలల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే పేదలకు, బలహీన వర్గాల పిల్లలకు చదువును దూరం చేసిన వారుగా చరిత్రలో నిలబడిపోతారు.
- షకీల బేగం,
యూటీఎఫ్, సెల్ : 9440368148