Apr 23,2023 06:30

పాన్‌ కార్డును ఆధార్‌కు అనుసంధానం చేయించుకోవడం ఆలస్యమైతే కేంద్ర ప్రభుత్వం జరిమానా విధించడం న్యాయం కాదు. సామాన్యులకు భారం అవుతుంది. పాన్‌ కార్డు అంటేనే సామాన్యులలో అత్యధికులకు తెలియదు. పాన్‌కార్డు ఆధార్‌కు లింకు చేయకపోతే జులై నుంచి తమ బ్యాంకు ఖాతా రద్దవుతుందని ఇంకా చాలా మందికి తెలియదు. ఇన్‌కమ్‌ టాక్సు పరిధిలోకి రాని వారికి పాన్‌కు, ఆధార లింకు ఎందుకని పేద, మధ్యతరగతి వారు ప్రశ్నిస్తున్నారు. నమోదు చేయడానికి వంద, రెండు వందల రూపాయలు మీసేవా కేంద్రాలలో తీసుకుంటున్నారు. ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి లింకు చేయించు కోకపోతే జరిమానా వేసినా ఒక అర్ధం ఉంటుంది. సరైన ప్రచారం చేయకుండా వేయి రూపాయలు జరిమానా వేయడం సరైనదేనని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అనడం బాధాకరం. జీరో అకౌంటు వల్ల, డ్వాక్రా గ్రూపుల వల్ల ప్రతి కుటుంబంలోను కనీసం రెండు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. దీంతో ప్రతి సామాన్య కుటుంబానికి రూ.2200 నుంచి రూ.2400 వరకు ఖర్చు అవుతుంది. పెరిగిన ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరల జరిమానా భారం సామాన్యులను మరింత కుంగదీస్తుంది. సామాన్యుని పాన్‌ ఆధార్‌ లింకు రద్దు చేయాలి. లేదా జరిమానా రద్దు చేయాలి. ఈ విషయంపై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకురావాలి.

- బి.బి. రామకృష్ణారావు,
సామర్లకోట, కాకినాడ జిల్లా.