Jan 07,2023 10:14
  • మార్కెట్‌కు కొత్త సరుకు
  • గరిష్ట ధర రూ.37 వేలు నమోదు
  • విదేశీల నుంచి కూడా ఆర్డర్లు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గుంటూరు మిర్చి యార్డుకు కొత్త సరుకు వస్తోంది. గత వారం రోజులుగా సగటున రోజుకు 40 వేల బస్తాలు వస్తున్నాయి. గత నెల రోజులుగా రాయలసీమ జిల్లాల నుంచి సరుకు ఎక్కువగా వస్తోంది. గత వారం రోజుల నుంచి గుంటూరు, పల్నాడు, ప్రకాశం, ఎన్‌టిఆర్‌ జిల్లాల నుంచి కొత్త సరుకు రావడం ప్రారంభమైంది. కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న గత సీజన్‌కు చెందిన మిర్చి నిల్వలు రోజూ యార్డుకు పది వేల టిక్కిలు, కొత్త సరుకు 30 వేల టిక్కిలు వస్తున్నాయి. మిర్చి యార్డులో గత వారం రోజులు లభించిన సగటు ధరలు నాన్‌ ఎసి కామన్‌ వెరయిటీ కనిష్ట ధర క్వింటాలు రూ.10 వేలు, గరిష్ట ధర రూ.27 వేలు ఉంది. బాడిగ రకం కనిష్ట సగటు ధర రూ.10 వేలు, గరిష్ట సగటు ధర రూ.26,800 పలికింది. మేలురకమైన నెంబరు 5 వైరటీ క్వింటాలు రూ.30 వేలు, బాడిగ 355 రకం రూ.37 వేలు, 334 రకం రూ.28 వేలు గరిష్టంగా లభించింది. నాన్‌ ఎసి స్పెషల్‌ వెరైటీ తేజ కనిష్ట ధర రూ.9,500 వస్తుండగా, గరిష్ట ధర రూ.27 వేలు వచ్చింది. తేజ రకం కనిష్టం రూ.9500, గరిష్ట ధర రూ.26,500, దేవదారు డీలక్సు గరిష్ట ధర రూ. 26 వేలు పలికింది. గత నెల ద్వితీయ పక్షంలో ధరలు స్వల్పంగా తగ్గగా ఈ వారం నుంచి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇంటి అవసరాల కోసం ఆర్డర్లు రావడం వల్ల ధరలు మళ్లీ పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గత వారం కన్నా ఈ వారం మొత్తం అన్ని రకాలకూ క్వింటాలుకు వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు పెరిగాయి. తేజ, బాడిగ, కొత్తవి 2043 రకం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2043 రకం కొంత సరుకు గరిష్టంగా రూ.37 వేల వరకు పలికింది. యార్డుకు వస్తున్న మిర్చి నాణ్యత బాగుందని, అందువల్ల ధరలు కూడా బాగా వచ్చాయని వ్యాపారులు తెలిపారు. ఇటీవల నిలిచిపోయిన ఆర్డర్లకు మళ్లీ ఆయా దేశాల నుంచి గ్రీన్‌ సిగల్‌ వచ్చింది. ప్రధానంగా బంగ్లాదేశ్‌ నుంచి మళ్లీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సింగపూర్‌, మలేషియా, థాయిలాండ్‌, శ్రీలంక నుంచి ఆర్డర్లు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్ణాటక, మహరాష్ట్రలో ఆశించినంతగా మిర్చి ఉత్పత్తి రావడం లేదు. దీంతో, గుంటూరు మిర్చి కోసం పలు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కేరళ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని వ్యాపారులు తెలిపారు.