- మహారాష్ట్రలో 110మందిని కాపాడిన వైమానిక దళం
న్యూఢిల్లీ, ముంబయి : గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో దేశంలో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. కుండపోత వర్షాలతో పలు నదులు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. దేశ రాజధానిలో యమునా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. గత కొద్ది రోజులుగా 205.33 మీటర్ల మార్క్‌ను దాటుతోంది. శనివారం ఉదయం కూడా పరిస్థితి ఇలానే వుంది. ఉత్తరాఖండ్‌లో కూడా పలు చోట్ల వర్షాలు పడుతుండడంతో మళ్లీ నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం వుంది. దీనివల్ల ఢిల్లీలో వరదలకు దెబ్బతిన్న పల్లపు ప్రాంతాల్లో పునరావాస చర్యలకు జాప్యం జరుగుతోంది. 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురియగలవని వాతావరణ అధికారులు చెప్పారు. శనివారం ముంబయి, దాని శివారు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడడంతో పలుచోట్ల నీరు నిలిచిపోయి ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో పాల్ఘర్, థానే, రారుగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ముంబయి నగరానికి ఆరంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. పాల్ఘర్, థానేల్లో శనివారం పాళశాలలు మూసివేశారు. ములుంద్, థానే, భివాండి, కల్యాణ్ ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు. మహారాష్ట్రలోని యవత్మాల్ లో, జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో చిరాల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో వరద తరహా పరిస్థితి నెలకొంది. యవత్మాల్‌జిల్లాలోని మహాగన్ తాలుకాలో కుండపోత వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. 110మందికి పైగా ఈ వరదల్లో చిక్కుకుపోయారు, వారిని భారత వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణా దళానికి చెందిన బలగాలు కాపాడాయి. శుక్రవారం నుండి ఇక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. యవత్మాల్ జిల్లా మహాగన్ తాలుకాలో రికార్డు స్థాయిలో 231 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వారు వరదనీటిలో చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్ అయోల్ యెడ్జ్ తెలిపారు.










