Jan 08,2023 12:46
  • ఐద్వా మహాసభలో మరియం ధావలే

ఎం.సి. జోసఫిన్‌ నగర్‌ (తిరువనంతపురం) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిది : పెద్ద ఎత్తున అణచివేతకు పాల్పడుతున్న మతోన్మాద విధానాలను కేరళ మహిళలు అత్యంత చైతన్యవంతంగా ప్రతిఘటించారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి మరియం ధావలే చెప్పారు. తిరువనంపునంలోని ఎం.సి జోసఫిన్‌ నగర్‌లో జరుగుతున్న జాతీయమహాసభలో శనివారం ఆమె ఉద్యమ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా అణచివేత పెరిగిందని అన్నారు. మతం పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారని, స్వేఛ్చను పూర్తిగా హరిస్తున్నారని చెప్పారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం చరిత్రను సైతం వక్రీకరిస్తున్నారని చెప్పారు. తమ మాటాలతో ప్రజలను మతం మత్తులో ముంచుతున్నారన్నారు. అయితే, ఈ విధానాలను కేరళలో మహిళలు సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేరళలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు ఓటు వేశారన్నారు. ఈ చైతన్యాన్ని దేశ వ్యాప్తంగా తీసుకురావాలన్నారు. మరోవైపు కరోనా సమయంలో పేదలందరికీ 10 కేజీల బియ్యం ఇవ్వాలని ఐద్వా డిమాండ్‌ చేసిందని, కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. అనేక మందికి అవికూడా అందలేదన్నారు. దీంతో చాలా కుటుంబాలు మైక్రో ఫైనాన్స్‌, రుణ యాప్‌ల బారిన పడుతున్నాయని చెప్పారు. దేశంలో ఆకలి సమస్య పెరిగిపోయిందని, ఒడిశా వంటి రాష్ట్రంలో పేదల ఒక్కపూట మాత్రమే తినే దుస్థితి ఏర్పడిందన్నారు. కులదురహంకార హత్యలు, గహహింసపైన, యువతులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాలన్నారు

On-the-way-to-Kerala


 

                                    పెరుగుతున్న మహిళల పాత్ర : సౌహార్ధ్ర సందేశాల్లో వివిధ సంఘాల నేతలు

దేశ వ్యాప్తంగా వివిధ సమస్యలపై జరుగుతున్న పోరాటాల్లో మహిళల పాత్ర పెరుగుతోందని, ఇది ఆహ్వానించదగిన పరిణామమని సౌహార్ధ్ర సందేశాలిచ్చిన వివిధ సంఘాల నేతలు చెప్పారు. అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ మాట్లాడుతూ వ్యవసాయంలో మహిళల శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదన్నారు.
              అందుకే భూమికి జాయింట్‌ పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మికంసంఘం అధ్యక్షులు విజయరాఘవన్‌ మాట్లాడుతూ దేశాన్ని మతం, కులం ప్రాంతం పేరుతో చేస్తున్న విభజనలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం మహిళలను విద్యకు దూరం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. నూతన విద్యా విధానం దీనిలో భాగమేనని చెప్పారు.

On-the-way-to-Kerala

                                                                            పుస్తకావిష్కరణలు

1. ''ఆన్‌ ఆలిండియా ఉమెన్స్‌ ఆర్గనైజేషన్‌ టేక్స్‌ షేప్‌''. ఇందులో ఐద్వా మొదటి, రెండవ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను పొందిపరిచారు. ఐద్వా నాయకులు అర్చనాప్రసాద్‌, ఛాయ, మినతి, విమల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
2. ''గుమ్‌ నామ్‌ వీరంగనాయి'' అనే హిందీ పుస్తకాన్ని మంజీత్‌, చంద్రకళ ఆవిష్కరించారు.
3. ''ఎర్లీ స్ట్రగుల్‌ ఫర్‌ లా రిఫామ్‌: డౌరీ అండ్‌ రేప్‌'' అనే పుస్తకాన్ని సతీ, సుధ ఆవిష్కరించారు.
4. చింత పబ్లికేషన్‌ వారు 30 మంది మహిళా నాయకుల జీవితాలతో తీసుకొచ్చిన మలయాళ సంపుటిని బందా కరత్‌ ఆవిష్కరించారు.
ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్‌
మహాసభల సందర్భంగా స్ఫూర్తి దాయక మహిళల చిత్రపటాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంటోంది. మహాసభ ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌ను తిలకించడానికి వస్తున్నారు.

On-the-way-to-Kerala

                                    ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నాం : చర్చల్లో సి.హెచ్‌ రమణి, సాయిలక్ష్మి

ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆంధ్రప్రడేశ్‌ నుండి చర్చల్లో పాల్గొన్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు సిహెచ్‌ రమణి అన్నారు. అదే జరిగితే దాని ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఈ కారణం వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో కార్మికులతో కలిసి ఐద్వా చురుకుగా పాల్గోంటోందని అన్నారు. కోవిడ సమయంలో దేశ వ్యాప్తంగా మహిళలపై హింస పెరిగిందన్నారు. అంతర్జాతీయ పరిస్థితులపై చర్చల్లో పాల్గొన్న ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిలక్ష్మి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాయని, వామపక్ష ప్రభుత్వాలు ఉన్న దేశాలు మాత్రం దీనికి భిన్నంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాయని చెప్పారు. తెలంగాణ నుండి చర్చల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు నాగలక్ష్మి అధిక ధరల ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతోందన్నారు. అనేక కుటుంబాల్లో తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మరో కార్యదర్శి వర్గ సభ్యురాలు రత్నమాల మాట్లాడుతూ బిజెపి ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందన్నారు. కులదురహంకార హత్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ చర్చల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 35 మంది ప్రతినిధులు పాల్గోన్నారు.