
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. చిన్నచిన్న అవినీతి, ఆర్థిక నేరాల కూపీ లాగుతున్నట్టు కనిపిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఆదాయపన్ను విభాగం (ఐటి) సంస్థలకు ప్రపంచాన్నే విస్మయానికి గురిచేసిన అదానీ గ్రూప్ కుంభకోణాలు ఎందుకు కానరావడం లేదన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మీయ సన్నిహితుడైన గౌతమ్ అదానీ అక్రమాల కారణంగా దాదాపు రూ.13 లక్షల కోట్ల మదుపర్ల సొమ్ము ఆవిరైపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు కానరావడం లేదు? చిన్నపాటి అవినీతినైనా తాము సహించబోమని పదేపదే వల్లించే మోడీ.. అదానీ బాగోతంపై ప్రపంచమంతా నిలదీస్తున్నా ఉలకడు..పలకడు! ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసులో శరవేగంగా దర్యాప్తు సాగిస్తున్న సిబిఐ, ఇడి గతంలో అదానీకే చెందిన గుజరాత్ ముంద్రా పోర్టులో రూ.21 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే ఒక్క కేసు కూడా నమోదు చేసింది లేదు. అటు చూసింది లేదు. నిన్నటికి నిన్న కర్ణాటకలో బిజెపి ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు రూ.40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి..విజిలెన్స్ సోదాల్లో లెక్కాపత్రం లేని రూ.ఆరు కోట్ల నగదు పట్టుబడితే ఇడి పట్టించుకోవడం లేదు. ఈ కేసులో ఎ1 గా ఉన్న సదరు ఎమ్మెల్యే పరారరవ్వడం, అత్యంత వేగంగా ముందస్తు బెయిల్ మంజూరు కావడం, బాజాభజీంత్రలతో బిజెపి ఘనస్వాగతం ఏర్పాటు చేయడం దేనికి సంకేతం? ధైర్యం చేసి కేసు కట్టిన విజిలెన్స్ అధికారులపై ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై ఆఘమేఘాల మీద బదిలీ వేటు వేసి కక్ష తీర్చుకున్నారు. బిజెపికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వేధింపులకు గురిచేస్తూనేవుంది. బిజెపిలో చేరిపోతే సత్తిపూసలు..లేకపోతే సంకెళ్లు.. ఇది ఇప్పుడు దేశంలో నడుస్తున్న దర్యాప్తుల తీరు.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 124 సిబిఐ కేసుల్లో 118 మంది ప్రతిపక్షాల నాయకుల మీదనే నమోదయ్యాయి. 121 ఇడి కేసుల్లో 115 మంది ప్రతిపక్ష నేతలే నిందితులు. అంటే 95 శాతం మంది బిజెపి రాజకీయ ప్రత్యర్థులే. మనీల్యాండరింగ్ పేరిట ఎంుపీలపై 51 కేసులు, ఎమ్మెల్యేలపై 71 కేసులు పెట్టారు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. కోర్టుల్లో ఇడి కేసులు నిలబడవు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఆదాయపన్ను విభాగం (ఐటి) కేంద్ర ప్రభుత్వ పంజరంలోని చిలకలన్నది పాత మాట. ఇప్పుడు అంతకు మించి..అని ఈ పరిణామాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండాల్సిన ఈ సంస్థలు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఆడించే కీలుబొమ్మలుగా, తోలుబొమ్మలుగా మారిపోయాయి. పరిశ్రమించేతత్వం, నిష్పక్షపాతం, నిజాయితీ-నిబద్ధతతో కూడిన సమగ్రత తన లక్షణాలుగా సిబిఐ రాజముద్రలోనే ప్రకటించుకుంది. పౌర హక్కులు, మానవత్వం, శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంపొందించడం లక్ష్యాలుగా చెప్పుకుంది. ఇడి అయితే మరింత మెరుగైన లక్షణాలతో.. సమగ్రత, జవాబుదారీతనం, అంకితభావం, నైపుణ్యం, నిష్పక్షపాతం అనే పంచసూత్రాలను మూల సూత్రాలుగా పేర్కొంటోంది. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ ఆదర్శాలన్నీ ఇప్పుడు బిజెపి ఒత్తిళ్లకు బలైపోతున్నాయి. ఉదాత్తమైన ఈ లక్షణాలు వదిలేసి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేతలకు బంట్లుగా, ఏజెంట్లుగా దర్యాప్తు సంస్థలు గులాం గిరీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయడమే.
ప్రఖ్యాత వినీత్ నారయణ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుననుసరించి సిబిఐ, ఇడి అధినేతల పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉండేది. అయితే 2021 నవంబరులో దాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ మోడీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. తరువాత షరా మాములుగా చట్టమైపోయింది. సుప్రీంకోర్టు చెప్పినా చట్టాన్ని తన చుట్టంగా మార్చుకుని మోడీ సర్కారు పాలన సాగిస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్యతతో ప్రజా ఉద్యమాలు సాగించాలి. అప్పుడే సర్కారు మెడలు వంచడం సాధ్యం.