Aug 04,2023 15:35

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ :ఆగస్టు 9 న 'క్విట్‌ ఇండియా' స్పూర్తితో మోడీని గద్దె దింపి దేశాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో విజయవాడ లో జరగనున్న శ్రామిక జనగర్జన లో కార్మిక వర్గం పాల్గని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెస్‌ రాయుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేల్‌ రవికుమార్‌, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి ఈ.సికిందర్‌ లు పిలుపునిచ్చారు.శుక్రవారం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మిక వర్గ సమస్యలు 9 సంవత్సరాల మోడీ పరిపాలనలో పరిష్కారం కాలేదన్నారు. కనీస వేతనం రూ 26వేలుకు పెంచాలన్న డిమాండ్‌ ను మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. స్కీం వర్కర్ల శ్రమను దోచుకోవటం తప్ప వారిని పర్మినెంట్‌ చెయ్యటం లేదని తెలిపారు. అసంఘటితరంగ కార్మికులందరికీ పిఎఫ్‌, పెన్షన్‌, ఆరోగ్య సౌకర్యాలు తదితరాలతో కూడిన సామాజిక భద్రతా పధకాన్ని ఇంత వరకు ప్రకటించలేదన్నారు. ప్రతి సంవత్సరం జరపాల్సిన త్రైపాక్షిక భారత కార్మిక మహాసభను 2015 నుండి జరపడం లేదన్నారు. ఈ మహాసభలు జరిగితే కార్మిక సమస్యలు చర్చలకు వస్తాయని, అఖిల భారత సమ్మెలతో కూడిన పోరాటాలు చేస్తున్న కార్మిక సంఘాలను పిలిచి చర్చించాలన్న ఇంగిత జ్ఞానం కూడా మోడీ ప్రభుత్వానికి లేదన్నారు.
ఈ ప్రభుత్వం కొనసాగితే కార్మికులకే కాక రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివఅత్తిదారులు, తదితర శ్రామికులందరికీ తీవ్రమైన నష్టం వస్తుందని తెలిపారు. కార్మికుల మద్దతుతో చేసిన రైతుల పోరాటానికి తలగ్గి నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ, రైతులకు మోడీ చేసిన వాగ్దానాలు ఇంత వరకు నెరవేరలేదన్నారు. వ్యవసాయం కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి పోయి ఆహార సంక్షోభాలు వస్తాయని అన్నారు. ఏఐటియుసి నాయకులు నాగేశ్వరావు, ఎల్లారెడ్డి, వెంకటేశు, తదితరులు పాల్గొన్నారు.