Sep 25,2022 06:57

అణుయుద్ధం అంటూ వస్తే విజేతలెవరూ ఉండరు. ప్రపంచమంతా క్షతగాత్రమౌతుంది. అణ్వాయుధాలు దండిగా కలిగిన ఐదు దేశాల్లో ఒకటైన రష్యా నేడు తమ స్వీయ రక్షణ కోసం ఏ ఆయుధాలు వాడడానికైనా వెనుకాడబోమంటూ ప్రకటించడం ఆందోళనకరం. ఉక్రెయిన్‌ పై ఏడు నెలలుగా కొనసాగిస్తున్న దాడి కొలిక్కి రాక, నష్టాలు అధికమై రష్యా తీరని నిరాశలో ఉంది. తేలిగ్గా ముగుస్తుందనుకున్నది నెత్తిన భారమై మిగిలింది. దారిలోకి తీసుకురాగలనుకున్న చిన్న దేశం, నాటో కూటమి మద్దతుతో తన దారేమిటో మర్చిపోయేలా చేస్తుంది. ఈ దాడి తనకు ఊహించని రీతిలో నష్టపర్చడమే కాకుండా మరికొన్ని దేశాల చేరికతో ప్రతికూల కూటమి బలోపేతం కావడానికి దోహదపడుతుంది. ఈ విషయమే రష్యా ని మరింత రెచ్చగొడుతుంది. తీవ్ర నిర్ణయాల వైపు ఆలోచించేలా చేస్తోంది. అందులో భాగంగానే 3 లక్షల మంది రిజర్వు సైనిక దళాల్ని సమాయత్తం చెయ్యడంతో బాటు అమెరికాకు, దాని అనుచరులకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రస్తుతం ఆ రెండు, మూడు దేశాలకే కాదు. ప్రపంచ దేశాలన్నింటికీ ఇది ముప్పే. ప్రపంచాన్ని నష్టపరిచిన కరోనా మహమ్మారి ఇంకా కనుమరుగు కాకమునుపే అణుయుద్ధం ముప్పు ముంగిట్లో వాలడం మానవాళికి శాపం. కాబట్టి పరిస్థితి చెయ్యి దాటకముందే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా బలమైన దేశాలు మేల్కోవాలి. ఇరువైపులా ఉద్రిక్తతలు తగ్గించేలా కృషి చెయ్యాలి. కాలు దువ్వుతున్న దేశాలే కాకుండా, ఆజ్యం పోస్తున్న అగ్ర రాజ్యాలు కూడా బాధ్యతగా మెసిలేలా ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలి. కొన్నేళ్లుగా సుప్తావస్థలో ఉన్న నాటో కూటమి లాంటి యుద్ధ భూతాలు మళ్ళీ లేచి జూలు విదల్చడమే అసలైన ప్రమాద హెచ్చరిక.
 

- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.