Oct 23,2022 06:41

మేడం! లేచి ఇంతసేపయింది, అప్పుడే రెండు పేపర్లు చదవడం కూడా పూర్తిచేసేశాను, కబుర్లే తప్ప, కాఫీ కూడా లేదా అని గౌరీశంకర్‌ అడగడంతో ఇదుగో చిటికలో తెస్తానని భార్యామణి వంటింట్లోకి అడుగులు వేసి, నిజంగా నిముషాల్లోనే తెచ్చి ఇచ్చింది. మన గౌరీశంకర్‌కి రోజూ లేచిన వెంటనే అన్ని పేపర్లు చదివితేనే కానీ దినచర్య ముందుకెళ్లదు. తాను చదివింది భార్యతో పంచుకోవడం ఆయనకు మరో మంచి అలవాటు.
ఏమోరు! ఈ బిజెపి వాళ్ళు మేమే త్వరలో అధికారంలోనికి వచేస్తామని అంటున్నారు కానీ, రాష్ట్రంలో అధికారం రావడం వారి తరమా? స్వంతంగా ఒక్క సీటు కూడా గెలిచే బలం లేని వీరు, వచ్చే ఎన్నికల్లో ఏకంగా అధికారంలోకి రావాలనుకోవడం చూస్తే, ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరినట్లు లేదూ? అని ప్రశ్నించాడు.
అయ్యో! ఎంత అమాయకులండీ! మీరు. వీరికి రాష్ట్రంలో బలం లేదని ఎవరన్నారండీ. కనపడేది చదివి వదిలేస్తే ఇలానే ఉంటుంది తెలివి. కొంచెం బుర్ర పెట్టి చూడండి. మీకే తెలుస్తుంది అని చెప్పడం మొదలెట్టింది తనకున్న రాజకీయ స్పహతో. ఏవండీ. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో దేశంలో ఒకే ఒక రాష్ట్రం నుండి వారి అభ్యర్ధికి ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా నూటికి నూరు ఓట్లు వచ్చిన రాష్ట్రమేదో చెప్పండి అనడంతో, ఓఎస్‌! అదేముంది. వారు అధికారంలో ఉన్న ఏ గుజరాతో, ఉత్తరప్రదేశో అయి ఉంటుంది. అది కూడా చెప్పలేనా అని తల ఎగరేశాడు.
అదో! మీరక్కడే పప్పులో కాలేశారు. ఆ రెండూ ఏం కాదు. అలాగే వారు అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రమూ కాదు. వారికి ఒక్క సీటు కూడా లేని మన రాష్ట్రమేనండీ అని భార్యామణి అనడంతో నోరెళ్లబెట్టి అదెలా అని ప్రశ్నించాడు గౌరీశంకర్‌.
ఎలాగంటారేమిటండీ! రాష్ట్ర అసెంబ్లీలో సీట్లున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ వారికి ఓట్లేసేశారు కదండీ. దీనితో మొత్తం ఓట్లన్నీ వారి అభ్యర్ధికే పడ్డాయి. చూశారా? ఒక్క సీటు కూడా లేకపోయినా అన్ని ఓట్లు ఎలా సంపాదించిందో! మరి బలం లేదంటారేమిటి?
ఇంకో విషయమండోరు! పోనీ ఓట్లేసినా, కనీసం రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలు, రైల్వే జోన్‌ వంటివి ఇస్తేనే ఓట్లు వేస్తామని చెప్పినా బాగుండునండీ! ఈ పార్టీల అవకాశవాదం మాటెలా ఉన్నా, రాష్ట్రానికి కొంతైనా న్యాయం జరిగుండేది. అది కూడా కనీసం అడగలేదు చూడండి మన దద్దమ్మలు.
అమ్మో! బాగా విశ్లేషణ చేసేవే. నేనంత ఆలోచించలేకపోయాను అంటూ భార్య వైపు మెచ్చుకోలుగా చూసి, లేవబోయాడు. 'అప్పుడే లేచిపోతున్నారేమిటండీ, ఇంకా ఉంది కూర్చోండి' అనడంతో మరలా చతికిలపడ్డాడు.
చూడండి. ఈ మూడు పార్టీలూ వారిలో వారు తిట్టుకుంటూ, మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా పల్లెత్తు మాట కూడా అనరు. రాజధాని పేరుతో ప్రజలకు నాటకాలు చూపిస్తున్నారు. ఆఖరుకు మన యువకుల బలిదానంతో సాధించుకున్న స్టీల్‌ప్లాంటును మోడీ ప్రభుత్వం అమ్మేస్తున్నా, ప్రశ్నించని చీమూ, నెత్తురూ లేని పార్టీలండీ, ఈ మూడూనూ. వీటిలో ఏ పార్టీ గెలిచినా మోడీకి వచ్చిన ముప్పేమీ లేదు సరికదా, బిజెపి గెలిచినట్లే కదా! ఇక బలం లేదని ఎలా అంటారండీ అని భార్యామణి హితోపదేశం చేయడంతో అక్కడి నుండి చల్లగా జారుకున్నాడు గౌరీశంకర్‌.

- సీతారాం