
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతులేని కథగా మారాయి. అంతకంతకూ అవే విషయాల చుట్టూ మునిగి తేలుతున్నాయి. రాజధాని కేసులు, ప్రభుత్వ విభిన్న ప్రకటనలూ, ప్రతిపక్షాల విమర్శలకు కారణమవుతూనే మార్పును మింగించే విన్యాసాలుగా గోచరిస్తున్నాయి. మీడియా కథనాలూ అస్పష్టత పెంచుతుంటే తేల్చవలసిన న్యాయస్థానాలు ఆలస్యంతో అయోమయానికి దారి తీస్తున్నాయి. రాష్ట్రం పదేపదే తన వైఖరిని పరిపరివిధాల ప్రకటిస్తుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవకాశవాదంతో అయోమయం పెంచుతున్నది. అప్పులపై వాదనలూ, ఉద్యోగుల ఉద్యమాలు, ఎంఎల్‌సి ఎన్నికల సన్నాహాల్లో పాలక వైసీపీ పోకడలూ, ప్రతిపక్ష టిడిపి పాదయాత్రలపై ఆంక్షలూ, ఈ మధ్యలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల మార్పిళ్లు, అడుగడుగునా అసహనంతో నిందారోపణలూ దూషణ భూషణలూ దుర్భరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాలూనడానికి బిజెపి పాట్లు, దానితో జట్టు కట్టిన జనసేన కొత్త జట్టు కోసం వేస్తున్న పిల్లిమొగ్గలూ ఆసక్తికరంగా వున్నాయి. ఈ రాజకీయ ప్రహసనంలో ప్రయోజనం కోసం కులమతాలను కూడగడుతున్న తీరు కూడా ఆందోళనకరంగా మారుతున్నది.
- రాజధాని రాజకీయం
ముందుగా రాజధాని రాజకీయం చూద్దాం. అమరాతి నుంచి విశాఖపట్టణానికి రాజధాని తరలింపు తథ్యమని ప్రభుత్వం నుంచో వైసీపీ నుంచో ప్రకటన రాని రోజు దాదాపు లేదు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో వుంది గనక ఏదో ఒక తుది తీర్పు వస్తుందనుకుంటే అది ఆలస్యం అవడం తథ్యంగా కనిపిస్తున్నది. అక్కడ కేసు వుంది గనక... గతంలో తీర్పునిచ్చిన హైకోర్టు కూడా నిరీక్షణలో పడింది. అందరికీ నోటీసులు ఇచ్చి అఫిడవిట్లు కోరిన సుప్రీం ధర్మాసనం ఇంకా లోతైన విచారణ మొదలెట్టవలసే వుంది. వెంటనే విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖ రాసింది గాని దాని ప్రభావం కనిపించలేదు. ఈలోగానే ముఖ్యమంత్రి జగన్ దేశ రాజధానిలో మాట్లాడుతూ విశాఖ మా నూతన రాజధాని అనీ, తను అక్కడికే వెళ్లి పాలన చేయబోతున్నానని ప్రకటించారు. ఇది కోర్టు ధిక్కారమని ప్రతిపక్షాలు విమర్శించినా కొందరు కోర్టుకు రాసినా సుప్రీం ఈ నెల మొదట్లో జరిపిన విచారణలో ఆ అంశం లెక్కలోకి తీసుకోలేదు. నిజానికి తాను మాట్లాడింది కోర్టు ధిక్కారం కాదనీ, నేరుగా కోర్టునే అడిగామని సమర్థించుకోవడానికే లేఖ రాశారనే అభిప్రాయం కూడా వుంది. ఈ లోగా కేంద్రం పార్లమెంటులో ఏవో సమాధానాలు ఇచ్చిందనీ, అవి అమరావతినే రాజధానిగా ధృవీకరిస్తున్నాయని కొన్ని మీడియాల్లో ప్రచారం హోరెత్తింది. నిజానికి కేంద్రం సమస్యను దాటవేసింది తప్ప తన అభిప్రాయం గాని, నిర్ణయం గాని చెప్పలేదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని గతంలో రెండుసార్లు కేంద్రం అఫిడవిట్లు దాఖలు చేసింది. తాజా సమాధానాలలో ఆ అంశం కూడా ప్రస్తావించలేదు. సుప్రీం కోర్టు ముందు కేసు వుంది గనక తానేమీ చెప్పబోనని తప్పించుకుంది. కానీ విశాఖలో జి20 సదస్సులు వంటివి భారీగా నిర్వహిస్తున్నది. అంతకు ముందు ప్రధాని, రాష్ట్రపతి ప్రత్యేక పర్యటనలతో సహా అనేక కీలక కార్యక్రమాలు నిర్వహించి పరోక్షంగా వత్తాసునిచ్చింది. అక్కడ పోటీ చేస్తారనుకుంటున్న బిజెపి నేత జీవిఎల్ నరసింహారావు కూడా ముందే విశాఖ అనుకుని వుంటే బావుండేదని సెలవిచ్చారు. మేము అమరావతికే కట్టుబడి వున్నామని రాష్ట్ర నాయకులతో చెప్పిస్తూ కేంద్రం దాగుడుమూతలు ఆడటం ఒక ఎత్తుగడ.
- మూడా? ఒకటా?
ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మూడు రాజధానులనేది ఒక పొరపాటు భావన అనీ విశాఖనే రాజధాని అనీ బెల్గాంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అక్కడ మకాం వేసి పాలన చేస్తున్నప్పుడు అదే కీలకమవుతుందని వివరించారు. కర్నూలులో హైకోర్టు ప్రధాన ధర్మాసనం వుంటుందని, గుంటూరులో ఏడాదికో సెషన్ (సమావేశం) జరుగుతుందని కొత్త తరహాలో మాట్లాడారు. వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు అంటూ మొదలు పెట్టిన వైసీపీ సర్కారు నెమ్మదిగా విశాఖనే రాజధాని అనడం ఇటీవల జరుగుతూ వచ్చింది. విశాఖ గర్జన వంటి సందర్భాల్లోనే మనం చూశాం. తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఇక్కడ రాజధాని పెట్టకపోతే మూడు రాష్ట్రాల కోసం పోట్లాడతామనే వరకూ వెళ్లారు. సుప్రీంలో కేసు విచారణ తొలి ఘట్టంలో ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టు తరలింపు అనేది ఇప్పుడు ఎజెండాలో లేదు (ఇట్ హాజ్ గాన్) అని స్పష్టంగా చెప్పారు. బుగ్గన కూడా ప్రధాన ధర్మాసనం అని మాత్రమే అన్నారు. అమరావతి శాసన రాజధాని అన్నది కాస్తా ఒక సెషన్‌గా మార్చారు. సహజంగానే ఇవన్నీ విమర్శలకు, సందేహాలకు దారితీశాయి. ఈ విషయమై వివరణ ఇచ్చిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీటి మధ్య తేడాలేదంటూ తమ విధానాన్ని పునరుద్ఘాటించారు. వీరెవరూ మూడు రాజధానుల విధానంతో విభేదించనప్పుడు సమస్యేమిటని ఎదురుదాడి చేశారు. కాని ముఖ్యమంత్రితో సహా అందరూ విశాఖపట్టణమే రాజధాని అంటున్నారు, సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా వంటివాటిపై సూటిగా సమాధానం లేదు. అక్కడ తీర్పు ఒకరకంగా వస్తే ఒక విధంగా మరో రకంగా వస్తే మరో విధంగా ముఖ్యమంత్రి వెళ్లడం జరుగుతుందని మాత్రం చెప్పారు. ఏమంటే అనుకూల తీర్పు వస్తే మొత్తంగా తరలిపోతారు, వ్యతిరేకంగా వస్తే వ్యక్తిగతంగా ఆయన వెళ్లి పాలన సాగిస్తారు అని దీని అర్థం. ఇది నైతికంగా చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుందా అనేదానికంటే మా విధానం అదే అన్నది ఆయన భావంగా వుంది.
రాజ్యాంగంలో రాజధాని భావనే స్పష్టంగా పొందువపర్చకపోవడం, ఆ బాధ్యత కేంద్రానిదా రాష్ట్రానిదా అనేది ఇదమిద్దంగా లేకపోవడం ఒక వాస్తవం. విభజన చట్టంలో 'ఎ క్యాపిటల్' అన్నారు గనక పార్లమెంటు చట్టం ప్రకారం ఇది ఏర్పాటయిందని ప్రతివాదులు చేసే వాదన పట్ల సుప్రీంకోర్టు ఏ వైఖరి తీసుకుంటుందో తెలియదు. అయితే ముఖ్యమంత్రి ఎక్కడ కూచుంటే అదే రాజధాని అన్న వాదన మరీ విపరీతమైంది. ఉదాహరణకు 2015లో అమరావతిని రాజధానిగా చేసిన నోటిఫికేషన్ మార్చకుండా విశాఖను రాజధాని అనడం సాధ్యమవుతుందా? పరిపూర్ణ చట్టబద్దత లేకుండా కేవలం ఆయన పీఠం మార్చి విశాఖను ఊరించడం, మురిపించడం వల్ల ప్రయోజనమేమిటి? అందరూ అంగీకరించినప్పటికీ హైకోర్టును కర్నూలుకు తరలించడం ఎందుకు వెనక్కుపోయింది? బుగ్గన ప్రకటనలో ప్రధాన ధర్మాసనం అనే మాట వాడాల్సిన అవసరమేమిటి? శాసన రాజధాని (ఇప్పటికి న్యాయ రాజధాని కూడా) అని పేర్కొన్న అమరావతిలో (లేదా గుంటూరు జిల్లాలలో) ఇప్పుడు ఒక సెషన్ అనడం దేనికి సంకేతం? పైగా హైకోర్టులో సదుపాయాలు పెంచుతామని కూడా సుప్రీం కోర్టు జడ్జిలకు హామీ ఇచ్చారు కదా! సచివాలయం ఎక్కడుంటే అదే రాజధాని అని బిజెపి జీవీఎల్ చెప్పిన దానికి ముఖ్యమంత్రి తరలిపోతారని వైసీపీ చెబుతున్నదానికి ఏదైనా సంబంధం వుందా? అమరావతిలో యథాతథ స్థితి వుండాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది గనక వున్నవాటిని తాకకుండా విశాఖలో కొత్త ఏర్పాటు చేసుకుంటున్నారా? ఇప్పటికే ఆదేశాలు వచ్చాయనీ, నివాసాలు కార్యాలయాల కోసం స్థలాలు భవనాలు సిద్ధమవుతున్నాయని వచ్చే వార్తలు అవేనా? ఈ ప్రశ్నలు వేటికీ వైసీపీ నేతలు స్పష్టమైన సమాధానాలివ్వరు. విశాఖ వెళ్లడం ఖాయం అని మాత్రం చెబుతుంటారు. ఇటీవలి కాలంలో టిడిపి, జనసేన, బిజెపి కూడా నెమ్మదిగా విశాఖలో కార్యకలాపాలు పెంచాయి. దాన్ని ఆర్థిక రాజధాని చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు. ఈ పార్టీల మధ్య వాదోపవాదాలలో అమరావతి గురించిన అంశాలు తగ్గి ఇతర వివాదాలు పెరిగాయి. ఈ మధ్యనే జనసేన విశాఖపై రెఫరెండంకు వెళదామా అని అడిగినప్పుడు మాది అదే విధానమని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. అయితే కేంద్రం దాగుడుమూతలను వీరెవరూ ప్రశ్నించలేదు. ఎన్నికల సమయంలో అన్ని ప్రాంతాలనూ సంతృప్తిపర్చాలి గనక వ్యూహాత్మకంగానే దీన్ని అమరావతి జెఎసికీ, కోర్టులో కేసులకూ పరిమితం చేశారా అనే సందేహం ప్రజలలో నెలకొంది. ముఖ్యమంత్రి ఎక్కడ ఎన్ని రోజులు వుంటారనేది ఒకటైతే అమరావతిలో అసంపూర్ణంగా వదిలేసిన పనులు, ప్రతిష్టంభన తొలిగించి నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది. న్యాయస్థానాలు కూడా ఇందుకు అనుగుణమైన ఆదేశాలిస్తాయని ఆశిద్దాం. కేంద్రం కూడా దాటవేతలు, దాగుడుమూతలు విరమించి సూటిగా సహకారమందించాల్సి వుంటుంది.
- అప్రజాస్వామికత తప్పు
మొదటే చెప్పినట్టు తక్షణం రానున్న ఎంఎల్‌సి ఎన్నికలలో ప్రజల కోసం పోరాడి విజయం సాధిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల నాయకులను ఓడించేందుకు వైసీపీ పెద్ద ఎత్తున రంగంలోకి దిగడం కొత్త పరిణామం. సవ్యంగా పోరాడితే పర్వాలేదు గాని ఓటర్ల నమోదు నుంచి ఉపాధ్యాయులలో అధికారుల ప్రచారం వరకూ అనేక అవకతవకలకు పాల్పడడం దారుణం. చివరకు విద్యాశాఖ ఆర్జెడిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్ష నేతలు యాత్రలపై ఆంక్షలు, అరెస్టులు, కేసులు అవాంఛనీయం. అనపర్తిలో టిడిపి అధినేత చంద్రబాబు పట్ల, మాజీ మంత్రి జవహర్‌పె పోలీసులుౖ వ్యవహరించిన తీరు అప్రజాస్వామికతకు పరాకాష్టగా వుంది. దళిత సంఘాలు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వంటివి సహించలేని విషయం ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల్లోకి వెళ్లి తమ భావాలు చెప్పుకోవాలి. ప్రభుత్వ తప్పిదాలపై పోరాడాలి. ఎంత మెజార్టీ వున్నా ఇది కూడా సహించలేకపోవడం పెద్ద తప్పిదం. రాజధాని విషయంలోనూ ఇదే ఏకపక్ష ధోరణి. ఇప్పటికైనా వైసీపీ సర్కారు తీరు మారాలి.
తెలకపల్లి రవి