- కనీసం రూ.15 లక్షల బీమా హామీ
- ప్రీమియం సొమ్ము మొత్తం వాపస్
- సింగిల్ ప్రీమియంను ఎంచుకోవచ్చు
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) కొత్తగా జీవన్ కిరణ్ పేరుతో టర్మ్ పాలసీని ఆవిష్కరించింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు, జీవిత బీమా పాలసీ అని ఆ సంస్థ వెల్లడించింది. మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత మొత్తం ప్రీమియం వెనక్కు ఇవ్వనున్నట్లు తెలిపింది. జీవన్ కిరణ్ (ప్లాన్ 870) ఇతర వివరాలు.. 18-65 ఏళ్ల లోపు వారు ఈ ప్లాన్ తీసుకోవడానికి అర్హులు. పాలసీ కాలంలో ఏం జరిగిన పాలసీదారు కుటుంబసభ్యులకు బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. సాధారణ టర్మ్ పాలసీల్లో ప్రీమియం మొత్తం వెనక్కు చెల్లించడం ఉండదు.. కానీ ఈ ప్లాన్ కింద పాలసీ కాలంలో బీమా హామీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ప్రీమియం సొమ్ము వాపస్ చేస్తుంది. కనీస పాలసీ మెచ్యూరిటీ గడువు 28 ఏళ్లు కాగా, గరిష్టంగా 80 ఏళ్ల టెన్యూర్ ఉంటుంది. 10 ఏళ్ల నుంచి 40 ఏళ్ల టర్మ్‌తో ఈ ప్లాన్ లభిస్తుంది. కనీసం రూ.15 లక్షల బీమా హామీతో ఈ పాలసీ కొనవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తం పాలసీ అయినా తీసుకోవచ్చు. కనీస ప్రీమియం రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ప్రీమియం రూ.30 వేలుగా నిర్ణయించింది. ఏడాదికోసారి గానీ, రెండు సార్లు గానీ ప్రీమియం మొత్తం చెల్లించవచ్చు. ఈ ప్లాన్‌లో పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ అనంతరం ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అధిక ప్రీమియంలు, రైడర్లకు చెల్లించిన మొత్తాలు, పన్నులను ఇందులోంచి మినహాయిస్తారు. మెచ్యూరిటీ తేదీ తర్వాత బీమా కవరేజీ రద్దవుతుంది. ఒకవేళ పాలసీ టర్మ్ ప్రారంభమయ్యాక కవరేజీ సమయంలో పాలసీదారుడు మరణిస్తే.. హామీ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఇది ఒకేసారి గానీ, ఐదేళ్ల పాటు లేదా ఆరు నెలలకోసారి, మూడు నెలలకోసారి, నెలకోసారి గానీ విడతల వారీగా గానీ చెల్లిస్తుంది. ఈ విషయమై పాలసీదారు ప్రత్యేకంగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియంపై ఏడు రెట్ల బెనిఫిట్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంపై 125 శాతం బెనిఫిట్ అందుతుంది. ఆత్మహత్య మినహా ప్రమాదవశాత్తు మరణంతోపాటు అన్ని రకాల మరణాలకూ ఈ ప్లాన్ కవరేజీ లభిస్తుంది. ఈ పాలసీని దగ్గరలోని ఏజెంట్‌ను లేదా ఎల్‌ఐసి వెబ్‌సైట్‌లోనూ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.










