- 'ఉక్కు ' పోరాటానికి సంపూర్ణ మద్దతు
- ఎల్‌ఐసిఎఒఐ జాతీయ మహాసభలో 19 తీర్మానాలు ఆమోదం
- సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దిలీప్
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : దేశంలో రూ.45 లక్షల కోట్ల సంపద కలిగిన ఎల్‌ఐసి క్లెయిమ్‌ల పరిష్కారంలో 99 శాతం వృద్ధిలో ఉండడంతో కోట్లాది మంది ప్రజానీకం నమ్మకంతో ఉన్నారని, ఆ నమ్మకాన్ని చెల్లాచెదురు చేసేందుకు మోడీ ప్రభుత్వం నిరంతరం కుయుక్తులు పన్నుతోందని ఎల్‌ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసిఎఒఐ ) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిజి.దిలీప్ అన్నారు. ఎల్‌ఐసి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎల్‌ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసిఎఒఐ) ఆరో జాతీయ మహాసభ సందర్భంగా మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బిజెపి సర్కారు దేశంలో ప్రభుత్వ రంగం ఆస్తులను ధ్వంసం చేస్తోందన్నారు. ఎల్‌ఐసి పాలసీదారులు, ఉద్యోగులు, ఏజెంట్లను సంప్రదించకుండానే ఎల్‌ఐసిని ఐపిఒకి పెట్టడాన్ని బీమా రంగాన్ని దెబ్బతీయాలనే దుష్ట ఆలోచనగా పేర్కొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖలో జరిగిన తమ సంఘం జాతీయ మహాసభలో ఇన్సూరెన్స్ రంగం, ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ కోసం 19 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిపారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ప్రయివేటీకరించడానికి చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకుని తీరాలని, స్టీల్ కార్మికులకు ఎల్‌ఐసి ఉద్యోగులు, ఏజెంట్ల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని పేర్కొంటూ తొలి తీర్మానం చేశామన్నారు. ఎల్‌ఐసి ఏజెంట్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఐపిఒ విధానాన్ని, బీమా సుగమ్ పథకాన్ని రద్దు చేయాలని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, బ్యాంకుల ప్రయివేటీకరణను తక్షణం ఆపాలని తీర్మానాలు చేశామని చెప్పారు. సంఘం సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి పిఎల్.నరసింహారావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎల్‌ఐసిలో ఉద్యోగాల భర్తీకి కేంద్రం చెల్లుచీటీ ఇచ్చిందన్నారు. 30 లక్షల మంది ఏజెంట్లు ఎల్‌ఐసిలో పనిచేస్తున్నారని, వీరి వృత్తిని దెబ్బతీసే చర్యలు, విధానాలను మోడీ ప్రభుత్వం తీవ్రం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తూ ఉధృత పోరాటాలకు మహాసభలో పిలుపునిచ్చామన్నారు. ఎల్‌ఐసిపై కేంద్ర ప్రభుత్వ కుట్రలను రానున్న కాలంలో ఐక్యంగా తిప్పికొడతామని చెప్పారు. ఎల్‌ఐసి రిసెప్షన్ కమిటీ చైర్మన్ ఎల్.మంజునాథ్ మాట్లాడుతూ బీమా సుగమ్‌తో ఎల్‌ఐసి కనుమరుగుకానుందని తెలిపారు. 'బీమా సుగమ్' పేర ప్రయివేట్ సంస్థలకు కేంద్రం తలుపులు బార్లా తెరిచిందన్నారు. సమావేశంలో మాజీ ఎంపి ఎవి బెల్లార్‌మిని, ఎల్‌ఐసి ఎఒఐ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ డాక్టర్ ఎ.సంపత్, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కెఎం.కుమార్ మంగళం పాల్గొన్నారు.










