
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన క్రమం ద్వారా శ్రమలో వైవిధ్యాన్ని సృష్టించడం అనేది ఒక వ్యూహాత్మక లక్ష్యంగా పెట్టుబడిదారీ విధానం ఆవిర్భావం నాటి నుండీ కొనసాగుతోంది. పెట్టుబడి కేంద్రీకరించబడుతూ తన బలాన్ని పెంచుకుంటు న్నప్పుడే, అది గతితార్కికంగా అందుకు విరుద్ధమైన దిశలో శ్రమలో వైవిధ్యాన్ని అంతకంతకూ పెంచుతూ పోతుంది. అందుచేత, పెట్టుబడిదే పైచేయిగా ఉన్న సమయంలో శ్రమలో వైవిధ్యం పెరిగిపోవడం, మరింత ఎక్కువగా చీలికలు కావడం ఒక బలమైన ధోరణిగా వ్యక్తమౌతుంది. కొన్ని సందర్భాలలో ఈ తేడాలనే ప్రత్యేక అస్తిత్వాలుగా ఆధునికానంతరవాదం గుర్తిస్తుంది. తద్వారా 'వర్గం' అనేది అదృశ్య మైందని, ఆ భావన ప్రస్తుత పరిస్థితులకు వర్తించదని ప్రచారం చేసుకుంటుంది. వర్గ శక్తుల బలాబలాల పొందికలో కార్మికవర్గం బలహీనపడిన ఒకానొక సందర్భాన్ని ప్రస్తావిస్తూ అది పెట్టుబడిదారీ ఉత్పత్తి క్రమంలో శ్రమలో ఏర్పడే వైవిధ్యం కారణంగా జరిగే ఒక అనివార్యమైన పరిణామం అని, 'వర్గం' అనేది అంతరించి పోవలసిందేనని సిద్ధాంతీకరిస్తుంది.
ఒక్కోసారి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి ఈ నిరాశాపూరిత ధోరణి ఎంతవరకూ పోతుందంటే, సమాజం శ్రమ ప్రాతిపదికన రూపొందుతుందనే సూత్రం సైతం ఇంకెంతమాత్రమూ వర్తించదని వాదిస్తూ, ఆ మౌలిక సూత్రాన్నే తిరస్కరించడం జరుగుతుంది. ఇదెక్కడిదాకా పోతుంది? మానవ సమూహాల సమిష్టి సంబంధాలను నిర్ధారించడంలో ఉత్పత్తి సంబంధాలు ఇంకెంతమాత్రమూ ముఖ్యమైన నిర్ణాయక పాత్రను పోషించవని, ఇతర అస్థిత్వాలే ప్రధానమని వాదించే వరకూ పోతుంది. వర్గ చైతన్యంతో వ్యవహరించే బదులు, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే తాత్కాలిక స్వభావం కలిగిన భావోద్వేగ అంశాలు, వివాదాలు బట్టి శత్రువులెవరో, మిత్రులెవరో నిర్ణయించుకునే పరిస్థితి వస్తుంది (తిరుపతిలో అన్యమత ప్రచారం రైటా? తప్పా? గోవును చంపడాన్ని సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా? గుజరాత్ నరమేధం గురించి అంతర్జాతీయంగా జరిగిన ప్రచారం వలన దేశ ప్రతిష్ట దెబ్బ తిన్నదా? లేదా? వంటివి ఉదాహరణలుగా భావించవచ్చు-అను) ఉత్పత్తి విధానం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే క్రమంలో రానురాను మరింత ఎక్కువగా పెట్టుబడిని ఉపయోగిస్తున్నదని, ఆ క్రమంలో శ్రమజీవుల పాత్ర తగ్గిపోతూ వస్తోందని, అందుచేత, పేదవారి శ్రమను దోచుకోవడం ద్వారా పెట్టుబడి పోగుబడడం అనేది తగ్గిపోతోందని, శ్రమ దోపిడీతో రానురాను పెట్టుబడి పోగుబడే క్రమానికి సంబంధం తగ్గిపోతోందని చెప్పే వాదన దీనికి తోడవుతోంది. ఈ వాదన బట్టి ఒక వర్గంగా రూపొందడానికి, శ్రమ దోపిడీ అనేది కేంద్ర అంశంగా ఇంకెంతమాత్రమూ ఉండబోదు. అనిశ్చిత పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసే కార్మికులు తక్కిన సంఘటిత కార్మికులకన్నా ఎక్కువ ప్రాధాన్యత కలిగిన వర్గం అని మరికొంతమంది వాదిస్తారు. సంఘటిత కార్మికులు ప్రభుత్వాన్ని, దాని వివిధ విభాగాలను (లేబర్ డిపార్టుమెంట్, లేబర్ కోర్టు, ట్రిబ్యునల్స్ వగైరాలు) ఉపయోగించుకోగలిగినట్లు 'అనిశ్చిత' కార్మికులు ఉపయోగించుకోలేరని వారు చెప్తూ, ఆ ప్రాతిపదికన వారిని వేరే వర్గంగా చూడాలని, లేదా అధిక ప్రాధాన్యత కలిగిన వర్గంగా పరిగణించాలని అంటారు. ఆ విధంగా కార్మిక వర్గంలోనే ఒక భాగాన్ని ఇంకొక భాగానికి వ్యతిరేకంగా నిలబెట్టి మొత్తం కార్మిక వర్గాన్ని ముందుకు కదల్లేని స్థితిలోకి నెడతారు.
నయా ఉదారవాద వ్యవస్థలో శ్రమలో వైవిధ్యం
పెట్టుబడి-కార్మికులు మధ్య సంబంధాలను నిర్వచించే చట్టాలు, పారిశ్రామిక వివాదాలను ఆ చట్టాల పరిధిలో పరిష్కరించుకోవడం, బేరసారాల పద్ధతులను నిర్దేశించుకోవడం వంటివి ఎల్లకాలమూ మార్పు లేకుండా శాశ్వతంగా కొనసాగేవి కావు. పరస్పరమూ ఘర్షణలో ఉండే వర్గాల బలాబలాలకు అతీతంగా, పవిత్రమైన, అనుల్లంఘనీయమైన సూత్రాలుగా అవి ఉండవు. ఆ సూత్రాలకు ఎటువంటి నైతిక ప్రాతిపదికా ఉండదు. రెండో ప్రపంచ యుద్ధం అనంతర కాలంలో అమెరికాలో, ఇతర సంపన్న పశ్చిమ దేశాల్లో పెట్టుబడి పోగుబడిన క్రమంలో రూపొందిన పారిశ్రామిక సంబంధాలు ప్రధానంగా 'విస్తృత శ్రామిక వర్గాన్ని' సృష్టించే క్రమంలో ఏర్పడ్డాయి. వర్గ ఘర్షణలను నివారించే క్రమానికి ఈ తరహా పారిశ్రామిక సంబంధాలు తోడ్పడతాయన్నది ఆ కాలంలో ప్రచారం బలంగా జరిగింది. 'అగ్రగామి దళాన్ని' తన వర్గం నుంచి వేరుచేయడానికి ఉద్దేశించబడిన విధానం అది. కార్మిక వర్గాన్ని ముక్కముక్కలుగా, వారు పని చేసే యంత్రాలతోబాటు ఉపయోగపడే స్పేర్ పార్టుల మాదిరిగా విడగొట్టి, కార్మిక వర్గపు స్వతంత్ర శక్తిని దెబ్బ తీయడం ఆ విధానపు ఉద్దేశ్యం.
మరోవైపు సోవియట్ యూనియన్ ఉనికిలో ఉండడం, కార్మికవర్గం ఒక ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఆవిర్భవించడం వలన సంపన్న దేశాలలోని పెట్టుబడిదారీ వర్గం సంక్షేమ చర్యలను చేపట్టక తప్పలేదు. స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థలో ఉత్పత్తికి, వినియోగానికి మధ్య ఒక సమతూకాన్ని సాధించడం అసాధ్యం. కాని సంక్షేమ విధానాలు అటువంటి సమతూకాన్ని సాధించడానికి తోడ్పడతాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిని దాటిపోకుండా పరస్పరం కార్మికవర్గం, పెట్టుబడిదారులు సంఘర్షించుకునేలా, బలాబలాల తూకాన్ని నెలకొల్పడానికి సోషల్ డెమాక్రటిక్ సంక్షేమ రాజ్యాలు తోడ్పడతాయి. అందుకే పెట్టుబడిదారీ వర్గం ఆ తరహా విధానాలవైపు మొగ్గు చూపింది. సోవియట్ యూనియన్ పతనం, సోషలిస్టు శిబిరం బలహీనపడడంతో, పెట్టుబడిదారీ వర్గానికి ఒక సైద్ధాంతిక ప్రతీఘాత విప్లవాన్ని చేపట్టడానికి కావలసిన సాకు దొరికింది. వర్గ ఐక్యత, సమిష్టి అదుపు మీద ఆధారపడిన అస్తిత్వాన్ని దెబ్బ తీయడమే దాని లక్ష్యం. మనుగడ కొనసాగించడానికి, ప్రయోజనాలు పొందడానికి జరిగే పోటీలో ఎవరు నెగ్గుకు రాగలుగుతారో వారికే ఆ ప్రయోజనాలు దొరుకుతాయన్న వాదనను తెచ్చి అటువంటి పోటీ ప్రపంచంలో మనుగడ సాగించడం ఆ యా వ్యక్తుల బాధ్యతే ఔతుంది తప్ప ప్రభుత్వాలకు ఏ బాధ్యతా ఉండబోదు అని ఈ ప్రతీఘాత సిద్ధాంతం ప్రచారం చేసింది. సామర్ధ్యం ఉన్న వ్యక్తులే పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు అన్న వాదనకు రెండో పార్శ్వంలో ఆ పోటీలో అత్యధికులు ఓడిపోక తప్పదు అన్న చేదు వాస్తవం ఉంది. దేనికీ భరోసా ఇవ్వని సమాజంలో, అవకాశాలు, తీసుకోవలసిన రిస్క్‌లు అసమానంగా ఉండడం జరుగుతుంది. ఈ పోటీ ప్రపంచం సమాజాన్ని వినియోగదారులు, ఉత్పత్తిదారులుగా విభజించింది. పెట్టుబడిదారులు, కార్మికులు అనే విభజన వెనక్కి పోయింది. వర్గంతో సంబంధం లేకుండా పోటీ ప్రపంచంలో ఎవరు నెగ్గుకు రాగలిగితే వారిదే విజయం అన్న విశ్వాసం ముందుకొచ్చింది.
పెట్టుబడిదారులకు అవసరమైనంత మంది కార్మికులు మార్కెట్ లో లభ్యం కాని పరిస్థితుల్లో గాని, ఉత్పత్తి క్రమంలో కీలక స్థానాల్లో ఉండి ఆ ఉత్పత్తి క్రమాన్ని దెబ్బ తీయగలిగే శక్తి కలిగిఉన్న కార్మికులు గాని తమ బేరసారాల శక్తిని బలంగా నిలుపుకోగలుగుతారు. అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలలోని కార్మిక శక్తిని చౌకగా పొందగలిగే అవకాశాన్ని పెట్టుబడిదారీ వర్గానికి ప్రపంచీకరణ క్రమం కల్పించింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి కార్యకలాపాలను వేరు వేరు చోట్ల నిర్వహించగలిగేలా, విడి విడి భాగాలుగా ఉత్పత్తి చేయగలిగేలా తోడ్పడింది. ఈ కొత్త టెక్నాలజీని మేధోపర హక్కుల రూపంలో బహుళజాతి కంపెనీలు చేజిక్కించుకోగలిగాయి. వెనుకబడిన దేశాలనుండి చౌకగా కార్మిక శక్తి సరఫరా కావడం, ఆ దేశాల నుండి సహజ వనరులను చౌకగా పొందగలగడం అనే రెండు అంశాలూ నయా ఉదారవాద వ్యవస్థలో పెట్టుబడి బలం పెంచుకుని తన ఆధిపత్యాన్ని విస్తరింపజేసుకోడానికి దోహదం చేశాయి.
ప్రతిఘటన, వర్గంగా రూపొందడం
కార్మికవర్గం చితికిపోవడం, మళ్ళీ కోలుకుని సంఘటితం కావడం-ఇదే పెట్టుబడిదారీ విధాన చరిత్ర అంతటా మనకు కానవస్తుంది. పెట్టుబడిదారీ వర్గం ఎల్లప్పుడూ సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులను ప్రవేశపెట్టి, కొత్త నిర్వహణా పద్ధతులను తీసుకువచ్చి పరిస్థితిని తన అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. ఆ క్రమంలో కార్మికవర్గం చితికిపోతూ వుంటుంది. కాని చరిత్ర ఎన్నడూ అక్కడే ఆగిపోలేదు. పెట్టుబడిదారీ వర్గం మీద సాగించే వర్గ పోరాటంలో కార్మికవర్గం తిరిగి కోలుకుని మళ్ళీ ఒక వర్గంగా నిలదొక్కుకుంటూ వచ్చింది.
ఫోర్డ్ ఉత్పత్తి విధానంలో (పనిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ఒక చోటు నుండి మరో చోటుకు తయారౌతున్న సరుకు వేగంగా రవాణా అవుతుంది. చివరికొచ్చేసరికి మొత్తం సరుకు తయారీ పూర్తవుతుంది-అను.) శ్రామికవర్గపు స్వయంప్రతిపత్తిని పెట్టుబడిదారీ వర్గం దెబ్బ తీయడడానికి ప్రయత్నించింది. కాని ఒకపనికి, మరొకపనికి అనివార్యంగా సంబంధం ఉండడంతో, కార్మికవర్గం ముక్కలుగా అయిపోయిన వివిధ పనులను చేసేవారి నడుమ ఐక్యత సాధించి ఎదురుదెబ్బ తీయగలిగింది. ప్రస్తుతం నయా ఉదారవాద వ్యవస్థలో పని చిన్న చిన్న ముక్కలుగా చెదిరిపోవడం, ప్రతీదీ సరుకుగా పరిగణించబడడం అనేది కార్మికవర్గ ఐక్యతను బాగా దెబ్బ తీసిందనడంలో సందేహం లేదు. అదే సమయంలో పెట్టుబడికి, కార్మికులకు నడుమ జరిగే ఘర్షణ యొక్క పరిధిని అది విస్తారంగా పెంచింది. ఉత్పత్తి క్రమం ముక్కలు ముక్కలు కావడం చాలా ఎక్కువగా పెరిగింది. చివరికి అది కార్మికులు ఇంటి వద్ద నుండే పని చేసే స్ధాయికి చేరింది. ఇంకోవైపు మన జీవితాలు అంతకంతకూ వినిమయ ధోరణితో నిండిపోతున్నాయి. సేవారంగం ద్వారా మిగులు పోగుబడే అవకాశాలు బాగా పెరిగాయి. ఈ సేవారంగాల్లో పని చేసే కార్మికులు, (రోగుల, చిన్నపిల్లల, వృద్ధుల బాగోగులను చూసే) సంరక్షణ ఉద్యోగులు, ఇంటిపనివారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉత్పత్తి క్రమంలో వచ్చే మిగులులో ఒక భాగాన్ని పొందడంతోబాటు వీరు తమ శ్రమ ద్వారా మరింత మిగులును అందిస్తున్నారు. ఉత్పత్తి జరిగే స్థలం, పునరుత్పత్తి జరిగే స్థలం (కుటుంబం) బాగా సన్నిహితంగా అయిపోతున్నాయి. మిగులు ఉత్పత్తి, ఆ మిగులు పంపిణీ ఫ్యాక్టరీ గోడల మధ్యనే జరిగే పరిస్థితులు మారాయి. మన జీవితాలను ఆ క్రమం అన్ని వైపుల నుండీ ఆవరిస్తోంది. వర్గంగా రూపొందడానికి, వర్గ పోరాటాలు జరగడానికి గల అవకాశాలు మరింత విస్తృతమౌతున్నాయి. అవి ఉత్పత్తి క్రమం లోనే వేళ్ళూనుకుని ఉన్నాయి.
వర్గంగా రూపొందడమనేది ఎన్నడూ ముందుగానే నిర్ణయం అయిపోయి వుండదు. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా జరిగే పోరాట క్రమంలో, పరస్పరం తమ పోరాట అనుభవాలను పంచుకునే క్రమంలో అది రూపొందుతూ వస్తుంది. శ్రామిక ప్రజానీకంలోని వివిధ భాగాల వారు- ఫ్యాక్టరీలలో పనివారు, చిన్న చిన్న వర్క్‌షాప్ లలో పని చేసేవారు, స్వయం ఉపాధితో జీవించే చిన్న ఉత్పత్తిదారులు, సంక్షేమ ఉద్యోగులు, గిగ్ వర్కర్లు (డోర్ డెలివరీ చేసేవారు, ఓలా, ఊబర్ సర్వీసుల వర్కర్లు- వీరిని గిగ్ వర్కర్లు అంటాం-అను) వివిధ సేవలను అందించేవారు (ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వగైరా) అప్రెంటిస్ వర్కర్లు, కాజువల్ వర్కర్లు, ఏ రికార్డుల్లోనూ నమోదు కాని వలస కార్మికులు, అనేక ఇతర తరహాల వర్కర్లు-వీరంతా చాలా వైవిధ్యభరితంగా ఈ నయా ఉదారవాద వ్యవస్థలో సాగుతున్న ఉత్పత్తి-అదనపు విలువను స్వాధీనం చేసుకోవడం అనే ప్రక్రియలో ఇమిడిఉన్నారు. ఎవరికి వారు వేరు వేరు విధాలలో పెట్టుబడిదారీ వర్గ దోపిడీని ఎదుర్కొంటున్నారు.
ఈ శ్రామిక ప్రజానీకాన్ని సమూలంగా పునస్సంఘటిత పరిచి ఒక ఉమ్మడి గొంతుకతో వారంతా నినదించే క్రమం జరగాలి. వారి వారి నడుమనున్న వైవిధ్యాల ప్రత్యేకతల గురించి గొప్పలు చెప్పుకునే పరిస్థితి మారి, వారంతా విడివిడిగా అనుభవిస్తున్న పెట్టుబడిదారీ దోపిడీ తాలూకు అనుభవాల లోని ఉమ్మడి స్వభావాన్ని ఒక దగ్గరకు తేవాలి. ఈ క్రమం ఆచరణ రూపం తీసుకోడానికి ఒక మధ్యవర్తిత్వం అవసరం. అటువంటి మధ్యవర్తిత్వం ద్వారా ఆ శ్రామికులు తమ ఉమ్మడి శత్రువును గుర్తించగలుగుతారు. వారి వారి విడి విడి అనుభవాలలోని ఉమ్మడి స్వభావాన్ని (దోపిడీని) గ్రహించగలుగుతారు.
ఇటువంటి ఒక ఉమ్మడి తత్వాన్ని సాధించడానికి అవసరమైన భౌతిక పరిస్థితులు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉన్నాయి. శ్రమ అంతకంతకూ అమూర్తం (అబ్‌స్ట్రాక్ట్) అయిపోతోంది. అమూర్త శ్రమ అంటే పనిలో నిర్దిష్టత రాను రాను తగ్గిపోతూ వుండడం. ఈ క్రమం పెట్టుబడిదారీ మార్కెట్‌లో రాను రానూ జరుగుతూ వున్నదే. సరుకు కన్నా దాని మారకపు విలువే ఎక్కువ ప్రాధాన్యత పొందుతోంది. దానిని డబ్బు రూపంలో కొలుస్తున్నాం. అంతిమంగా ఎన్ని గంటల పనికి ఎంత డబ్బు ముట్టింది అన్నదే కొలబద్ద అయిపోతున్నది (నచ్చిన పని చేయడం, నాణ్యత కల పని చేయడం, అర్హతలకు తగ్గ పని వంటి భావనల ప్రాధాన్యత తగ్గిపోతున్నది-అను). ఈ ఉమ్మడి కొలబద్దే, విడివిడిగా చెదరగొట్టబడ్డ శ్రామికులనందరినీ ఒకదగ్గరకు చేర్చగల సాధనంగా తోడ్పడుతుంది. వేరు వేరు స్వభావాలు కల పనులు చేసే వారు, వేరు వేరు పని పరిస్థితులలో పని చేసేవారు, తమ నడుమ ఉన్న పరస్పర సంబంధాన్ని, తామంతా అనుభవిస్తున్న దోపిడీ యొక్క ఉమ్మడి స్వభావాన్ని పోరాటాల ద్వారానే ఈ ''సరుకుల మీద వ్యామోహంతో కొట్టుమిట్టాడే'' ప్రపంచంలో గ్రహించగలుగుతారు. సాటి పనివారితో కలిసి పని చేయగానే కార్మికుడు తామంతా ఒక వర్గం అనే భావనకు వచ్చేయడు. తనపై సాగుతున్న దోపిడీ ఏమిటో గ్రహించి, పెట్టుబడిదారీ వర్గంతో తలపడడం మొదలవగానే అతనిలో వర్గ చైతన్యం రగుల్తుంది. ఈ తలపడడం అనేది కేవలం జీత భత్యాలకు సంబంధించిన ఘర్షణగా మాత్రమే పరిమితం కాదు. పని పరిస్థితుల గురించి, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల గురించి, సమాజంలో బతకడానికి కావలసిన కనీస సదుపాయాల కల్పన గురించి, కొన్ని సేవలను (తాగునీరు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వగైరా) కొనుగోలు చేయనవసరం లేకుండా ఉచితంగా పొందగలిగే హక్కు గురించి, ప్రస్తుతం ఉన్న హక్కులను కాపాడుకోవడం గురించి, కొత్త హక్కులను పొందడం గురించి-ఇలా వివిధ కోణాలలో పెట్టుబడిదారీ వర్గంతో తలపడతారు. ఈ అన్ని కోణాలలోనూ జరిగే పోరాటాల అనుభవాలు విడివిడిగా చీల్చబడిన కార్మికులలో ఉమ్మడి అవగాహనను, తామందరమూ ఉమ్మడిగా దోపిడీ చేయబడుతున్నామనే స్పృహనూ కల్పిస్తాయి. ఈ క్రమంలోనే వారంతా మళ్ళీ ఒక వర్గంగా రూపొందుతారు. ఒక శక్తిగా రూపొందుతారు.
(స్వేచ్ఛానుసరణ)