Feb 05,2023 06:26

ఈ నెల 16న శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో త్రిపుర ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఒక్కసారి మినహా 1978 నుంచి 2018 వరకూ అవిచ్ఛిన్నంగా పాలించిన వామపక్ష కూటమి గత ఎన్నికల్లోనే అధికారం కోల్పోయింది. గతంలో 1988లో కేంద్ర కాంగ్రెస్‌ చేసినదాన్ని మించి 2018 ఎన్నికల్లోనూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్బంధకాండ అందుకు కారణమైంది. కేంద్రం కుటిల రాజకీయాలు, రాజకీయ కక్ష సాధింపు, అన్నిటికీ మించి అధికార దుర్వినియోగం అన్నీ కలసి ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వం దిగిపోవడానికి కారణమైనాయి. విప్లవకుమార్‌ దేవ్‌ అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి సిపిఎం కార్యకర్తలపై కార్యాలయాలపై దాడులు నిత్యకృత్యమైనాయి. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో హద్దూ ఆపూలేని దౌర్జన్యాలు, హత్యాకాండ తాండవించింది. ఈ నిరంకుశత్వం చివరకు బిజెపినీ అంతర్గతంగా దెబ్బతీసింది. విప్లవ దేవ్‌ ఏకపక్ష పోకడలు ఆ పార్టీలోనూ విమర్శకు గురైనాయి. 2022 మే లో విప్లవ దేవ్‌ను మార్చి ఆ స్థానంలో మాణిక్‌ సాహా ను ప్రతిష్టించడం ద్వారా కేంద్ర నాయకత్వం ప్రజల్లో వ్యతిరేకతను చల్లార్చేందుకు విఫలయత్నం చేసింది. అదేమీ జరక్కపోగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనడానికి ఢిల్లీ నేతలు దిగివచ్చి ప్రచారం నెత్తిన వేసుకున్నారు. ఈ చిన్న రాష్ట్రంలో సభలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, అధ్యక్షుడు నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పదేపదే పర్యటించాల్సి వస్తున్నది. అయినా అనుమానంగానే వుండటంతో అలవాటైన హింసాకాండను మరింత ఉధృతం చేయడం అధికార పార్టీ అభద్రతకు అద్దం పడుతున్నది. టికెట్ల పంపిణీ, అభ్యర్థుల ఎంపిక కూడా సమస్యగానే తయారైంది. గతంలో అధికారానికి రావడానికి ప్రత్యేకంగా సహాయపడిన ఇండీజినియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపిఎఫ్‌టి-దేశీయ గిరిజన సంఘటన) పొత్తు కొనసాగించడమే గాక విలీనం చేసుకోవడానికీ తంటాలు పడింది. కానీ చివరకు వారి స్థానాలలో వారే పోటీ చేస్తున్నారు. అప్పట్లో వేర్పాటువాదంతో తిప్రలాండ్‌ పేరిట గిరిజన ప్రాంతాల విభజన కోసం ఈ పార్టీ ఉద్యమాలు నడిపి ఉద్రిక్తతకు కారణమైంది. ఈశాన్య ప్రాంతాల నేపథ్యం, విభజన సమస్యలు తెలిసినా బిజెపి నాయకత్వం కేవలం ఎన్నికల గెలుపుకోసం ఆ పార్టీని అక్కున చేర్చుకున్నది. ఇప్పుడు అదే తిప్రల్యాండ్‌ నినాదాన్ని కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చిన మాజీ అధ్యక్షుడు ప్రద్యోత్‌ విక్రమ్‌ మాణిక్యదేవ్‌ వర్మ ఏర్పాటు చేసిన తిప్రామోతా పార్టీ తరపున ఈ నినాదం నెత్తికెత్తుకున్నారు. కేంద్రం పైకి నిరాకరించినప్పటికీ గతంలో ఐపిటిఎఫ్‌తో మైత్రి కారణంగా గట్టిగా వ్యతిరేకించడంలేదు. పైగా మాజీ ముఖ్యమంత్రి విప్లవకుమార్‌ దేవ్‌ ఈ కోర్కెలు బిజెపితో కలవకుండా సాధ్యం కావని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

  • సైద్ధాంతిక రాజకీయ దాడి

నిజం చెప్పాలంటే బిజెపి ఇంతగా కేంద్రీకరణ చేయడం వెనక లోతైన కారణాలున్నాయి. సైద్ధాంతికంగా, రాజకీయంగా తమకు అతి ప్రధాన ప్రత్యర్థులుగా వున్న సిపిఎం, వామపక్షాలను దెబ్బతీయాలన్నదే గతంలోనూ ఇప్పుడూ దాని ఏకైక సూత్రం. మాకు ఒక కార్పొరేటర్‌ కూడా లేని త్రిపురలో అన్నేళ్ల పాటు పాలించిన వామపక్షాలను ఓడించామని వారు ప్రతిసారీ ప్రతిచోటా టముకు వేసుకుంటారు. అందుకు అనుసరించిన అప్రజాస్వామిక పోకడలను గురించి చెప్పరు.
నిజానికి ఇది కేంద్రాన్ని పాలించే పార్టీగా బిజెపి బాధ్యతా రాహిత్యం కూడా. నిరంతర అశాంతితో రాజకీయ అస్థిరతతో అతలాకుతలమవుతున్న ఈశాన్య భారతంలో ఒకే ఒక సుస్థిర ద్వీపంగా ప్రత్యామ్నాయ దీపంగా వెలుగొందిన రాష్ట్రం త్రిపుర. బాగా వెనకబడిన గిరిజన ప్రధానమైన ఆ రాష్ట్రంలో ప్రజానుకూల విధానాలతో విజయపరంపరతో పురోగమించింది. దేశానికే ఆదర్శమైన నిరాడంబర ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నేత మాణిక్‌ సర్కార్‌. ఆ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బలోపేతం చేసి సున్నితమైన ఈశాన్య సరిహద్దులో శాంతిసామరస్యాలకు దోహదం చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. నరేంద్రమోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన కొత్తలోనైతే మీ ఒక్క రాష్ట్రమే ఎలా శాంతియుతంగా వుండగలుగుతున్నదని మాణిక్‌ సర్కార్‌ను వాకబు చేశారు కూడా! కాని కేంద్రంలోని బిజెపి, దాని ప్రత్యక్ష పరోక్ష రాజకీయ నేస్తాలు త్రిపురను ఎలాగైనా వశం చేసుకోవాలని రకరకాల విచ్ఛిన్న శక్తులకు పాలుపోసి పెంచుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మరోసారి విజయం సాధించడం ఈ తరహా కుట్రలు కుత్సితాలు పెరగడానికి దారితీసింది, ఈ విచ్ఛిన్నకర ప్రయత్నాలు రాజకీయ కుట్రలూ రెండు స్థాయిల్లో సాగాయి. మొదటిది సంప్రదాయికంగా ఈశాన్య భారతంలో సమస్యగా వున్న గిరిజన గిరిజనేతర ఐక్యతకు చిచ్చుపెట్టడం. రెండు బిజెపి వెనక వుండి తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఎగదోసి వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీయడం. వామపక్షాలను దించే ఏకైక లక్ష్యంతో రాజధాని అగర్తలాలో తిప్రీలాండ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై ఆందోళన పేరిట జరిగిన అరాచకం అందులో భాగమే. వాస్తవానికి 1980లో నృపేన్‌ చక్రవర్తి నాయకత్వంలో రెండవసారి వామపక్ష సంఘటన అధికారం చేపట్టినప్పుడే త్రిపుర ఉపజాతి సమితి, ఆమ్రబెంగాలి అనే దురభిమాన సంస్థ, హింసాత్మక శక్తి ఆనంద్‌మార్గ్‌ దారుణ కల్లోలం సృష్టించాయి. భారీ ప్రాణ ధన నష్టం జరిగింది. అప్పటినుంచి వామపక్ష ప్రభుత్వం మరింత అప్రమత్తతతో గిరిజన గిరిజనేతర ఐక్యతను కాపాడుకుంటూ వస్తున్నది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గిరిజన స్వయం పాలక మండళ్లను దేశంలోనే ఆదర్శంగా ఏర్పాటు చేసింది. ఈశాన్య భారతంలో త్రిపుర ఒక భిన్నమైన ఉదాహరణగా నిలవడానికి ఇదే కారణం. ఈ ప్రశాంతతనే భగం చేయడానికి సిద్ధం కావడం ప్రధాన పాలకపార్టీల దివాళాకోరు తనం.
బెంగాల్‌లో రెండవసారి విజయం సాధించడం టిఎంసి పార్టీకి అధినేత మమతా బెనర్జీకి విస్తరణ దాహం పెంచింది. బిజెపి మాతృసంస్థ ఆరెస్సెస్‌ ప్రత్యేకంగా కొందరిని ఈ రాష్ట్రానికి కేటాయించి పంపించింది.తమకు అలవాటైన సైనిక విద్యల శిక్షణ నిస్తూ వారు స్థానికంగా వున్న మతసామరస్య వాతావరణం దెబ్బ తినడానికి ఉద్రిక్తత పెరగడానికి కారకులవుతున్నారు. అధికారంలోకి వచ్చాక మరీ చెలరేగిపోయారు. ఇటీవలనే మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ హైదరాబాద్‌ పర్యటన సందర్భంలో రాబోయే ఎన్నికల పరిస్థితిని గురించి ఈ వ్యాసకర్త ప్రశ్నించినపుడు ఎన్నికలలో ప్రజలను ఓటు వేయనిస్తే గెలుస్తామని ఒక్క ముక్కలో జవాబిచ్చారు. అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలకూ త్రిపుర పరిస్థితికి పోలికే లేదు. అందుకే డెబ్బై ఏళ్లు పైబడిన వయసులోనూ మాణిక్‌ సర్కార్‌ స్వయంగా దాడులకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తూ బాధిత కార్యకర్తల కుటుంబాలకూ సిపిఎం మద్దతుదారులకు భరోసా కల్పించేందుకు కృషి చేయవలసి వచ్చింది.

  • ఎన్నికల దృశ్యం, సర్దుబాట్లు

2018 ఎన్నికల్లో ఇక్కడ వామపక్షాలు ఓడిపోయినా ఓటింగు శాతం కాపాడుకున్నాయి. సిపిఎం 14 స్థానాలు తెచ్చుకోగా...కాంగ్రెస్‌ 1, తృణమూల్‌ సున్నా దగ్గరే ఆగిపోయాయి. త్రిపురలో ఇప్పటికీ సిపిఎం పెద్దశక్తిగా వుంది. మాణిక్‌ సర్కార్‌ పట్ల ప్రజాభిమానం వుంది. నిరుద్యోగం, పనుల లేమి, ధరల పెరుగుదల అసలే వెనకబడిన రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నది. పైగా హత్యలు, దాడులు, విధ్వంసాలపై 700 పైగా కేసులు నమోదు కావడం పరిస్థితిని తెల్పుతుంది. బిజెపి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ట్రబుల్‌ ఇంజన్‌గా మారింది. బిజెపిని గద్దె దింపాలంటే ప్రతిపక్షాల మధ్య అవగాహన తప్పనిసరి అని కాంగ్రెస్‌ గుర్తించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడైన అజరు వర్మ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి చర్చలు జరిపి ఆ మేరకు అవగాహన ప్రకటించారు. ఫ్రంట్‌ 47 చోట్ల, కాంగ్రెస్‌ 13 చోట్ల పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి, అయితే కాంగ్రెస్‌ అభ్యర్థులు 17 చోట్ల పోటీ పెట్టడంతో సమస్య ఎదురైంది. వామపక్ష ఫ్రంట్‌లో సిపిఎం 43, భాగస్వాములుగా వున్న సిపిఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌లు తలొకటి చొప్పున పోటీ చేస్తున్నాయి. ఒక స్థానంలో పౌరహక్కుల కార్యకర్త, స్వతంత్ర అభ్యర్థికి మద్దతునిస్తున్నాయి. 24 మంది కొత్త అభ్యర్థులు వామపక్షాల తరపున రంగంలో వున్నారు. అయినా ఇరు పక్షాలూ చివరకు ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. బిజెపి ఇప్పుడుకూడా గిరిజన ప్రాంతాలలో విచ్ఛిన్నకర శక్తులపైన ఆశపెట్టుకున్నది. గతంలో అక్కడి 18 స్థానాల్లో బిజెపి 16 తెచ్చుకుంటే ఒకటి సిపిఎంకు దక్కింది. తర్వాత ఐపిటిఎఫ్‌ దూరమైనా ఈ ఏడాది మొదట్లో మృతి చెందిన ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.సి.దేవ్‌ వర్మకు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించి, మళ్లీ ఆ పార్టీని చేరువ చేసుకుంది. అప్పట్లో ఎనిమిది పోటీ చేసిన ఐపిటిఎఫ్‌కు ఇప్పుడు అయిదే కేటాయించింది. ఈ ఇరువురికీ కలసి 2018 ఎన్నికల్లో 33 చోట్ల యాభై శాతం పైన ఓట్లు పడ్డాయి గనక తమకు మేలు జరుగుతుందని బిజెపి వర్గాలు వాదిస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌తో అవగాహన వల్ల ఈ పరిస్థితి మారుతుందన్నది విశ్లేషకుల మాట.

  • వామపక్షాల ప్రణాళిక

అయిదేళ్ల ప్రజావ్యతిరేక పాలన కారణంగానూ బిజెపి వ్యతిరేక ఓట్ల చీలిక నివారణ ఫలితంగానూ తాము బిజెపిని ఓడిస్తామని వామపక్షాలు, కాంగ్రెస్‌ చెబుతున్నాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సహా సిపిఎం నాయకులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. వామపక్ష ఫ్రంట్‌ ప్రణాళిక కూడా విడుదల చేసింది. అయిదేళ్లలో 2.5 లక్షల మందికి ఉద్యోగాలు, సిపిఎస్‌ రద్దు, కుటుంబానికి యాభై యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, భూమి లేని పేదలకు భూవసతి కల్పిస్తామనీ, కొత్తగా విద్యాసంస్థల ప్రైవేటీకరణ ఆపుతామనీ వాగ్దానం చేసింది. బిజెపి హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకుంటామనీ. రాజ్యాంగ సవరణకోసం పోరాడ్డం ద్వారా గిరిజన స్వయంపాలక మండళ్లకు అత్యధిక అధికారాలు సాధిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ, మీడియాకు రక్షణ, లౌకిక విలువలకు నిబద్దత కూడా ప్రణాళిక ప్రముఖంగా ప్రస్తావించింది. త్రిపురలో బిజెపి ప్రభుత్వం పెంచిన విద్వేషం, విధ్వంసకాండలకు స్వస్తి చెప్పడానికే తాము అవగాహనకు వచ్చామని సిపిఎం కార్యదర్శి జితేంద్ర చౌదరి, పిసిసి అధ్యక్షుడు వీర్‌జిత్‌ సిన్హా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇరుగు పొరుగు ఇళ్లలో వారికి విభేదాలున్నా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఉభయులకూ ముప్పు గనక తాము అవగాహన కుదర్చుకున్నామని ఉభయ పార్టీల నేతలు ప్రకటించారు. సోమవారం ఉపసంహరణలకు చివరి రోజు గనక ఆ తర్వాతనే తుది చిత్రం అర్థమవుతుంది. ఏమైనా హోరాహోరీ పోటీ అనివార్యం. మార్చి రెండున ఫలితాలు వెలువడతాయి.

ravi

 

 

 

తెలకపల్లి రవి