Aug 01,2023 22:05

ప్రజాశక్తి- విజయవాడ అర్బన్‌ : నారాయణ స్కూల్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి చెందిన ఇందుర్తి జయంత్‌ వెంకట హర్షిత్‌ (14) విజయవాడ సమీపానగల కానూరులోని నారాయణ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినికి 'నిన్ను ప్రేమిస్తున్నాను' అంటూ వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడు. ఈ విషయం అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన తల్లికి ఆ విద్యార్థిని తెలిపింది. ఈ నేపథ్యంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌, అధ్యాపక సిబ్బంది కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో హర్షిత్‌ తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం పాఠశాల భవనం పైఅంతస్తు నుండి దూకాడు. తీవ్రంగా గాయపడి ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం తీవ్రంగా మందలించడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.