Feb 09,2023 15:06

అమరావతి : పార్టీలో అంతర్గత సమస్యలపై వైసిపి అధిష్టానం సీరియస్‌గా ఫోకస్‌ చేసింది. నాయకుల మధ్య విభేదాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. అందులో భాగంగా మైలవరం పంచాయతీని తెగొట్టేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. గత కొద్ది రోజులుగా రసవత్తరంగా సాగుతున్న వసంతా వర్సెస్‌ జోగి రమేష్‌ ఎపిసోడ్‌ పై సీఎం జగన్‌ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ తో గురువారం సీఎం జగన్‌ భేటీ కానున్నారు. గత కొన్ని రోజులుగా వసంత వర్సెస్‌ జోగి అన్నట్లుగా మైలవరంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వసంతను బహిరంగంగానే జోగి అనుచరులు దుర్భాషలాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి జోగి రమేష్‌ని కారులో తీసుకువెళ్లారు సీఎం జగన్‌. మైలవరం పంచాయతీ పై సీఎం జగన్‌ జోగి రమేష్‌ తో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం వసంత కృష్ణ తో కూడా భేటీ కానున్నారు. సీఎం జగన్‌ తో అపాయింట్‌మెంట్‌ కారణంగా గురువారం వసంత కృష్ణ నిర్వహించాలనుకున్న ప్రెస్‌ మీట్‌ ని కూడా రద్దు చేసుకున్నారు.