
ఈ నెల రెండవ తేదీన కన్నుమూసిన కె.రామలక్ష్మి తొలి తరం పాత్రికేయురాలు, రచయిత్రి. ఆనాటి మద్రాసు (చెన్నై) నగరంలో తెలుగు సాహిత్య ప్రతినిధిగానే గాక స్నేహశీలిగా విస్త్రుత పరిచయాలతో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రముఖ రచయిత, పరిశోధకుడు ఆరుద్ర సతీమణిగా ఆయన అపార కృషికి అండదండలందించారు. కాకినాడ జిల్లా కోట నందూర్‌లో 1930 డిసెంబర్ 31న పుట్టిన రామలక్ష్మి బి.ఎ పట్టభద్రురాలు. అప్పటికే ఆంధ్ర ఆంగ్ల భాషలలో ఆమెకు మంచి పట్టుండేది. ఖాసా సుబ్బారావు సంపాదకత్వంలోని స్వతంత్ర పత్రిక ఆంగ్ల విభాగంలో ఆమె పనిచేశారు. తెలుగులో గోరా శాస్త్రి చూస్తుండేవారు. అప్పట్లోనే ఆమె సమీక్షలు రాసేవారు. సి.నారాయణరెడ్డి కొత్తలో రాసిన 'నవ్విన పువ్వు' కావ్యాన్ని సమీక్షిస్తూ 'ఈ కవి నవ్వని పువ్వు' అని రాయడం చాలా మంది చెప్పుకునేవారు. గేయం రాయాలి నేను గేయం రాయాలి అని వర్ణిస్తూ ఒక కవిత రాస్తే ఆమె తన సమీక్షలో అదేదో రాసేస్తే అయిపోతుంది కదా అని చమత్కరించడాన్ని ఆయనే నవ్వుకునేవారు. ఆ రోజులలో కృష్ణశాస్త్రి, శ్రీరంగం నారాయణబాబు, శ్రీశ్రీ వంటి వారితో బాగా సన్నిహితంగా మెలిగేవారు. 1954లో శ్రీశ్రీ, టాకీపులి హెచ్.ఎం రెడ్డి సాక్షి సంతకాలతో ఆమెకూ ఆరుద్రకూ పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు.
1954లోనే ఆమె తొలి కథా సంపుటి 'విడదీసే రైలుబళ్లు' ప్రచురించారు. ఆ రోజులలోనే ఆరుద్రకు సన్నిహితుడైన ప్రసిద్ధ రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి సూచనతో నవలా రచనవైపు మళ్లారు. ఈ గాజులు తొడిగించుకునే కథలు ఎన్ని రాసినా ఒకటే, కొత్త పంథా వైపు మరలడానికి ప్రయత్నించు అని ఆయన అన్నారని ఆమే చెప్పుకున్నారు. ఆ క్రమంలో రూపొందిన పార్వతీ కృష్ణమూర్తి కథలు సాహిత్యాభిమానుల అమితాదరణ పొందాయి. ఈ జంట తెలుగు సాహిత్యంలో నిలిచిపోతుంది చూడండని ఆయన మెచ్చుకున్నందుకు చాలా సంతోషించారట. ఆ సలహా తన ఆలోచనా ధోరణిని మార్చిందని కూడా చెప్పుకున్నారు. ఆంధ్రపత్రికలో రామలక్ష్మి ప్రశ్నలు జవాబుల శీర్షిక చాలా ప్రసిద్ధి. మాలతీ చందూర్ ఆంధ్రప్రభలో ప్రమదావనం పేరిట ఇచ్చే జవాబుల కన్నా రామలక్ష్మి ఆధునికంగా స్పందించేవారు. చెన్నైలో చివరి వరకూ వారు స్నేహంగా వున్నారు. స్త్రీల సమస్యల గురించి లేదా తర్వాతి కాలంలో స్త్రీవాదం గురించి చర్చలు మొదలవడం కన్నా బాగా ముందే రామలక్ష్మి జీవితంలోనూ సాహిత్యంలోనూ మహిళల గొంతు వినిపించారు.
శ్రీశ్రీ ఆరుద్రల బంధుత్వం, సాహిత్య సాన్నిహిత్యం రీత్యా ఆ కుటుంబానికి చాలా దగ్గరగా వుండేవారు. అయితే వ్యక్తిగత అలవాట్లే గాక రాజకీయ సిద్ధాంతాల రీత్యా కూడా రామలక్ష్మి ఆయనతో విభేదించారు. ఆమె అభ్యుదయ సాహిత్య శిబిరంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి కాదు. శ్రీశ్రీతో వివాదపడేవారు. అయితే కుటుంబాల పరంగా ఎందరికో మరీ ముఖ్యంగా మహిళలకు దగ్గరగా వుండేవారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత తల్లి సంధ్యతో స్నేహం కారణంగా ఆమెను చిన్నప్పటి నుంచి చూశారు. ఆరుద్ర 'గూఢచారి 116' చిత్రంలో తనకు పాట రాస్తే జయలలిత ఎంత సంతోషించిందని చెబుతుంటారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిó, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, అలనాటి అనేకమంది దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు వారి స్నేహితులే. సుందరయ్య గారి గురించి చాలా గౌరవంగా చెప్పేవారు. భానుమతి, బాపు రమణ, ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం వంటి వారి గురించీ అనేక విషయాలు చెప్పేవారు. సినిమా రంగంలో స్త్రీల పరిస్థితి ఆమెను ఆవేదనకు గురిచేసింది. ప్రసిద్ధ కవులు, రచయితలు, ప్రచురణకర్తల భార్యల దుస్థితిని బాహాటంగా విమర్శించేవారు. ఆత్రేయ భార్య వంటలు చేసి బతకడం వంటి పరిస్థితి జీర్ణించుకోలేకపోయారు. మలి దశలో రాసిన 'వెలిసిపోయిన దాంపత్యాలు' నవలలో ఈ తరహా జీవితాలను చిత్రించారు. 70, 80 దశకాల లోని రచయిత్రులలో ఒకరుగా వున్న రామలక్ష్మి ఆ అంశాలను ప్రస్తావించారు.
ఆరుద్ర సినిమాలకు పాటలు, మాటలు రాస్తే రామలక్ష్మి కథలు సమకూర్చారు. వాటిలో విశ్వనాథ్ తీసిన 'జీవన జ్యోతి', దాసరి నారాయణరావు 'గోరింటాకు' ముఖ్యమైనవి. 'జీవన జ్యోతి' చిత్రానికి 1975లో నంది పురస్కారం అందుకున్నారు. దాసరి కథా విభాగంలో సహకరించేవారు. వాణిశ్రీ ఆమెకు బాగా సన్నిహితం. గోరింటాకు కథలో కీలక కథాంశం రంగనాయకమ్మ రాసిన 'ఇదే నా న్యాయం' అన్న కథను పోలి వుండటంతో కోర్టు వివాదం నడిచింది. శోభన్ బాబు ఆమెను బాగా అభిమానించేవారు. ఎవరినైనా ముక్కుసూటిగా విమర్శించే రామలక్ష్మి ధోరణి కొందరికి రుచించేది కాదు. అయితే అభివృద్ధి నిరోధకంగా, పాలకులకు వంతపాడటం చేసిన వ్యక్తి కాదామె. శ్రీశ్రీతో జరిగిన వాదవివాదాలలో ఆమెను ఆయన తాటకేశ్వరి అని పేర్కొన్నారు. ఆ తర్వాత శ్రీశ్రీని ఇకపై ఏమీ అనబోనని ఆమె ఆరుద్రకు మాట ఇచ్చారట. అయితే తన రెండవ కుమార్తె రౌద్రి కవిత్వానికి ఆయనతో ముందుమాట రాయించుకోవడానికి స్వయంగా కలిసి అడగటానికి ఆమే వెళ్లారు. ఆయనా చాలా అభిమానంగా రాశారు! రామలక్ష్మి సెన్సార్‌బోర్డు సభ్యురాలుగా దీర్ఘకాలం పనిచేశారు. ఆ విధంగా ఎందరో నిర్మాతలకు సాయపడ్డారు. కరుణానిధి రాసిన కన్నగి నవల హక్కులు తీసుకుని అనువాదం చేశారు. సాహిత్యం లోతుపాతులు, గుణదోషాలు చక్కగా అంచనా వేసేవారు.
నాటి మద్రాసులో ఆరుద్ర, రామలక్ష్మి మద్రాసు పరిచయం గల తెలుగువారికి, సాహిత్య సినీ జీవులకు పెద్ద దిక్కుగా వుండేవారు. ఆమె ఆయనను అబ్బారు అంటే ఆయన రామా అనేవారు. చివరి వరకూ వారు అలాగే అన్యోన్యంగా జీవించారు. 1985లో ఆయన షష్టిపూర్తికి ప్రజాశక్తి 'ప్రజాకళలు ప్రగతివాదులు' పుస్తకం ప్రచురించింది. ఆ కాపీలు తీసుకుని మద్రాసు వెళ్లి రాణీ సీతల్ హాలులో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాను. ఈ అబ్బాయి అమ్మాయి అని సినారె వారిని సంబోధిస్తే హాలు కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఆయనకు డయాలిసిస్ అవసరమైన సమయంలో హైదరాబాదులో వుండి చికిత్స జరిపించారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ప్రజాశక్తి ప్రచురించిన సందర్భంగా నేను అప్పుడప్పుడు కలిసేవాణ్ని, ఆరుద్ర విజయవాడ వచ్చినప్పుడల్లా బొమ్మారెడ్డిగారితో పాటు వెళ్తుండేవాణ్ని. తను కమ్యూనిస్టు కాకున్నా రామలక్ష్మి గారు ఎంతో ఆదరంగా చూసేవారు. తర్వాతి కాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలను ప్రచురించింది. ఆమె వాటిని మరోసారి సరిచూసి అందంగా తీసుకొచ్చారు.
2018లో ఈ రచయితకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలపై తన అభిప్రాయాలు అనుభవాలు చెప్పారు. ప్రస్థానంకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తను అభ్యుదయ భావాలకు వ్యతిరేకిని కానని స్పష్టం చేశారు. నిజానికి యూట్యూబ్‌లో ఆమె ఇంటర్వ్యూ ప్రసారమయ్యే వరకూ ఆమె హైదరాబాదులో వుంటున్నట్టు దాదాపు ఎవరికీ తెలియదు, అందులో ఒక పదం అనుకున్నట్టు ఎడిట్ కాకపోవడంపై విమర్శలు వచ్చాయి గాని ఆమె ఆ వయసులో అంత దృఢంగా స్పష్టంగా అభిప్రాయాలు చెప్పడం సంచలనం సృష్టించింది. యూ ట్యూబ్‌లో సైతం బాగా ట్రెండింగ్‌లోకి వచ్చి తమిళనాడు లోనూ వైరల్ అయింది. ఇప్పటికీ అది నడుస్తూనే వుంటుంది. అయితే తర్వాత మళ్లీ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఇటీవల ఆరో ముద్రణ పొందిన శ్రీశ్రీ జయభేరి ఆరుద్రకు అంకితమిచ్చాను. ఈ విషయం రామలక్ష్మి గారికి చెప్పి మొదటి ముద్రణ కాపీ అందజేస్తే ధన్యవాదాలు చెప్పారు. వెంటనే చదివేసి బాగా రాశావయ్యా అన్నారు. చివరి వరకూ బాగా పుస్తకాలు పత్రికలు చదువుతుండేవారు. ఎవరిమీద ఆధారపడకుండా వంటరిగా సహాయకురాలి తోడుతో జీవితం గడిపారు. ఆరుద్ర ఆఖరి కోర్కె ప్రకారం ఆయన మరణానంతరం ఎలాంటి హడావుడి లేకుండా అంత్యక్రియలు పూర్తి చేసిన రామలక్షి తనూ అలాగే ఎవరికీ కనిపించకుండా సెలవు తీసుకున్నారు. పెద్ద కుమార్తె కవిత ఆరు మాసాల పాటు దగ్గరుండి సపర్యలు చేస్తూ తుది వీడ్కోలు పలికారు. ప్రపంచానికి చెప్పడం తమ బాధ్యత గనక చెప్పానని ఆమెను పరామర్శించినపుడు చెప్పారు. ఆ తర్వాతే మీడియాకు తెలిసింది. రెండవ కుమార్తె, కవయిత్రి రౌద్రి అయిదారేళ్ల కిందటే క్యాన్సర్‌తో కన్నుమూశారు. మరో కుమార్తె విదేశాలలో వున్నారు.
ఆమెను కేవలం ఆరుద్ర సతీమణి అని మాత్రమే కొందరు రాయడం చాలామందికి మింగుడు పడకపోవడం సమర్థనీయమే. డెబ్బై ఏళ్లనాడే రచనలు చేసిన ఆధునిక మహిళగా, బహుముఖ ప్రతిభామూర్తిగా, ఆరుద్రకు తోడు నిలిచిన సహచరిగా రామలక్ష్మి గారు చిరకాలం గుర్తుంటారు.
తె.ర