Jun 18,2023 06:34

తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ మహత్తర పురోగమనానికీ ఆటుపోట్లకూ పునర్నిర్మాణాలకూ సారథ్యం వహించిన పెద్దలలో ప్రముఖ స్థానం వహించిన నేత మోటూరు హనుమంతరావు. ఎం.హెచ్‌ అనే రెండక్షరాలతో నిలిచిపోయిన ఆ మనిషి ఉద్యమాల మార్గదర్శి, అక్షరాల రూపశిల్పి. ఆశయాలనూ ఆచరణనూ మేళవించిన అరుదైన అనుభవం ఆయనది. రాజీ పడని సిద్ధాంతబలం, కట్టు తప్పని పట్టుదల, ప్రమాణాలకు ప్రతిరూపమైన ప్రయాణం మోటూరుది. ప్రచార పటాటోపం లేని ప్రతిభ, ప్రజాసేవ ఆయన స్వంతం. సమాజంలో పదవుల కోసం పాకులాట, సంపదలకై వెంపర్లాట, అసహన దూషణలూ నీతిమాలిన మీడియా ధోరణులు ప్రబలుతున్న ఈ రోజున మోటూరు విలక్షణమైన ఆదర్శంగా గోచరిస్తారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం, సంపాదక కృషి, పార్లమెంటరీ ప్రస్థానం, నిరాడంబరత్వం, నిబద్ధత మార్గదర్శకమవుతాయి. దశాబ్దాల పాటు ఆయన నాయకత్వంలో నడచిన నాటి నాయక శ్రేణికీ, తదుపరి తరంలో తనతో సన్నిహితంగా మసలిన మాలాంటివారికీ కూడా ఆయన జ్ఞాపకం ఒక చెరగని ఉత్తేజం. అంత సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు ఉద్యమ నాయకత్వంతో పాటు కమ్యూనిస్టు పత్రికల నిర్వహణతోనూ అంతగా పెనవేసుకుపోవడం మోటూరుకే చెల్లింది.

  • నిర్బంధాలు, నిషేధాల మధ్యనే..

అక్టోబరు విప్లవంతో పుట్టానని సగర్వంగా చెప్పుకునే మోటూరు గుంటూరు ఎ.సి కాలేజీలో చదువుతున్నప్పుడే కమ్యూనిస్టు అయ్యారు. అది బ్రిటిష్‌ పాలనలో ఆ పార్టీపై నిషేధం వున్న కాలం. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌, బాట్లీవాలా వంటి వారు వచ్చినపుడు ఆయన గది ఆశ్రయమైంది. చిన్న వయసులోనే వున్న కొద్ది పొలం అమ్మి గుంటూరులో 'సిటీ స్టూడెంట్స్‌ ఎంపోరియం' పేరిట పుస్తకాల షాపు పెడితే దానిపైనా సిఐడిలు దాడిచేశారు. అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. ఉత్తరోత్తరా మోటూరు ఉదయంగా మహిళా ఉద్యమ పతాకమెగరేసిన ఉదయలక్ష్మిని సంస్కరణ వివాహం చేసుకోవడం, కమ్యూనిస్టు పార్టీలో సభ్యులవడం 1937 లోనే జరిగాయి. లావు బాలగంగాధరరావు వంటి వారు సమకాలీనులైతే సుందరయ్య బయిట నుంచి వచ్చి వెళ్లేవారు. మాకినేని బసవపున్నయ్య నుంచి మోటూరు గుంటూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బాధ్యత తీసుకున్నారు. 1942 వరకూ పార్టీపై నిషేధం, నిర్బంధం మధ్యనే ఉద్యమాన్ని పెంపొందించేందుకు కృషిచేశారు. క్షేత్రస్థాయి ఉద్యమ నిర్మాణం, నాయకత్వంతో పాటు పత్రికా రచన, కళా సాహిత్యంలోనూ ఎం.హెచ్‌ పట్టు పెంచుకున్నారు. అప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. మొగల్‌రాజపురంలో కాట్రగడ్డ వారి పొగాకు బేరన్లలో నిర్మించుకున్న ప్రజాశక్తి నగర్‌ అందుకు సహాయ సామగ్రి అందించే ఆశ్రయమైంది. 1947లో వచ్చిన ప్రకాశం ఆర్డినెన్సు కమ్యూనిస్టులపై దారుణమైన వేటగా మారింది. ప్రజాశక్తి నగర్‌ ధ్వంసం చేయబడింది. అప్పటికే మోటూరు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుగా ఎన్నికైనారు. 'ప్రజాశక్తి' స్థానంలో మాసపత్రికగా 'జనత' తీసుకుని రావడానికి సన్నాహాలు జరిగాయి. 1977లో ప్రజాశక్తిలో చేరాక నేను పాత పత్రికలు తిరగేస్తుంటే జనత తొలి సంపాదకీయంలో ఎం.హెచ్‌ భాష కనపడింది. ఆయనను వెళ్లి అడిగితే తనే రాసిన సంగతి గుర్తుకు వచ్చింది. అయితే ఇంతలోనే ఆయను అరెస్టు చేయడంతో గంగినేని వెంకటేశ్వరరావు, బొమ్మారెడ్డి గారు ఆ పత్రికను కొనసాగించారు. మొదటి నుంచి ఈ విధంగా పత్రికలతో ఎం.హెచ్‌ పాత్ర కనిపిస్తుంది. భయంకరమైన కడలూరు జైలు జీవితం గడిపారు. జైలులోనే పోలీసు కాల్పులు జరిపితే అనుమర్లపూడి సీతారామరావు బలికావడం, ఈయనకు కొద్దిలో గుండు తప్పిపోవడం జరిగాయి. ఇంకా చాలామందికి గాయాలు తగిలాయి. అనంతపురం తొలి పాత్రికేయులలో ఒకరైన రామకృష్ణ కు అప్పుడే ఒక కన్నుపోయింది. ఆయన కూడా చాలాకాలం ప్రజాశక్తి విలేకరిగా పనిచేశారు.

  • చట్టసభలు..జైలు శిక్షలు ..పత్రికలు..

నిషేధం ఎత్తివేత తర్వాత 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా జరిగిన తొలి ఎన్నికలలో ఎం.హెచ్‌ రేపల్లె నుంచి మంత్రి చంద్రమౌళిని ఓడించి శాసనసభకు ఎన్నికైనారు. కమ్యూనిస్టుల నాటి విజయపరంపరలో ఈ గెలుపు కూడా ఒక సంచలనం. 1953లో ఎం.హెచ్‌ విశాలాంధ్ర సంపాదకుడయ్యారు. సైద్ధాంతిక విభేదాల తర్వాత తనుగా ఆ బాధ్యతలకు రాజీనామా చేశారు. 1962, 1966లో ఆయనను రెండుసార్లు అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. 1964లో సిపిఎం రాష్ట్ర తొలి కార్యదర్శిగా ఎన్నికైన ఆయన తీవ్రవాద ఉద్యమ చీలిక కూడా చూశారు. ఎడాపెడా విచ్ఛిన్నాలనే పదం ఆయన నోట నిరంతరం వినిపించడానికి కారణమదే. ఈ రెండు సందర్భాలలోనూ ఉద్యమ పునర్నిర్మాణానికి కీలక బాధ్యత వహించారు. మొదట జనశక్తి తర్వాత ప్రజాశక్తి వారపత్రిక పున: ప్రారంభంలో సంపాదకుడుగా పేరు లేకపోయినా అన్ని కీలక విషయాలపైనా దిశానిర్దేశం చేసే రచనలందిస్తూనే వచ్చారు. 1974 నుంచి పెరిగిన కాంగ్రెస్‌ నిర్బంధానికి పరాకాష్టగా 1975 ఎమర్జన్సీ కూడా ఉద్యమానికి తీవ్ర సవాలు విసిరింది. అజ్ఞాతవాసంలో వుంటూనే ఎం.హెచ్‌ నాయకత్వం అందించారు. ఎమర్జన్సీ సెన్సార్‌షిప్‌లో కూడా సంజరు గాంధీ జాతరను అపహస్యం చేస్తూ 'అంజి' పేరిట ఆయన రాసిన 'రాజు వెడలె' సంచలనం తెచ్చింది. ఎమర్జన్సీ తర్వాత 1977 ఎన్నికలు, 1978లో శాసనసభ ఎన్నికలు అన్నిటా ఎం.హెచ్‌ ముందుండి పనిచేశారు. 1978లో శాసనమండలికి ఎన్నికైనారు. రాష్ట్రానికి తిరగివచ్చిన సుందరయ్య 1982లో రాష్ట్ర కార్యదర్శి అయ్యేవరకూ ఎం.హెచ్‌ 18 ఏళ్లపాటు బాధ్యతల్లో వున్నారు. 1953 నుంచి చివరి వరకూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడుగా వున్న ఆయన 1998లో పొలిట్‌బ్యూరో సభ్యులయ్యారు. ఈ విధంగా ఎం.హెచ్‌ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో విధాన నిర్ణయంలో ఆద్యంతం ఒక ముఖ్య పాత్రధారి. 1986 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యులుగా వున్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు అనారోగ్యం వెంటాడినా జాగ్రత్తలు తీసుకుని మళ్లీ బాధ్యతల్లోకి రావడం ఆయన దీక్షా దక్షతలకు నిదర్శనం.

  • వర్గ చైతన్య ఖడ్గదారి

తెలుగు నుడికారం, కమ్యూనిస్టు భావజాలం, రాజకీయ నైశిత్యం, వ్యంగ్యం మేళవించి కొత్త వరవడి తీసుకొచ్చారు. శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కవితాత్మకంగా తెలుగు భాషను పోరాట భాషగా మార్చింది. ఎం.హెచ్‌ కలం తెలుగు భాషలో రాజకీయ వర్గచైతన్యపరమైన భావజాలానికి సరికొత్త పద సంపద సమకూర్చింది. మార్క్సిస్టు మేధావులు, పండితులు అనేక మంది వుండొచ్చు. కాని ఆ భాషను శక్తివంతంగా సిద్ధాంత రాజకీయ ప్రచారానికి వాడుకోగలిగిన వారిలో మాకినేని బసవపున్నయ్యనూ మోటూరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గ్రామీణ జీవనం నుంచి, సంప్రదాయ ప్రయోగాల నుంచి, ఇంగ్లీషు వాడుకల నుంచి కలగలిపిన శక్తివంతమైన భాష అది. అనుభవం నుంచి పుట్టింది గనక అందులో కృత్రిమత్వం వుండదు. అద్దాల కొంపలో కూచుని రాళ్లు రువ్వడం, తెల్లజెండాలెత్తడం, కాసుకు కక్కుర్తి పడటం, చచ్చిన చేప వాలున పడి కొట్టుకుపోతే బతికిన చేప ఎదురీదడం, సలాం కొట్టడం, దివాళాకోరుతనం, నికరంగా నిలబడటం సూత్రబద్దంగా నిలవడం, కంకణధారిగా పనిచేయడం ఇలాంటి పద ప్రయోగాలన్నీ ఆయనే ప్రాచుర్యంలోకి తెచ్చారు. తీరు తెన్ను అనే వాడుకను తీరుతెన్నులు చేసిందీ ఆయనే. కమ్యూనిస్టు పత్రికలను తీర్చిదిద్దిన వారిలో మద్దుకూరి చంద్రం తర్వాత ఆయననే చెప్పుకోవాలి. చివరి దాకా అదే కృషి కొనసాగించడం ఎం.హెచ్‌ ప్రత్యేకత. ఉద్యమ పరంగానూ పత్రికపరంగానూ ఇన్ని అనుభవాలు వున్నాయి గనకే చివరి దశలో వెంటబడి మరీ ఆయనతో అనేక జ్ఞాపకాలు రాయించడం మాకు చాలా సంతృప్తి కలిగించే విషయం. ఆయన మాట, రాత, వస్త్రధారణ, పలకరింపు, ఆదరణ విలక్షణమైనవి.

  • ప్రజాశక్తి పురోగమనంలో...

1981లో ప్రజాశక్తి దినపత్రికగా మారినప్పుడు మళ్లీ అప్పటి నుంచి ఇరవయ్యేళ్లు 2001 దాకా నిర్విఘ్నంగా సంపాదక బాధ్యతలు నిర్వహించిన ఎం.హెచ్‌ అనారోగ్య కారణాల వల్ల వైదొలగారు. కమ్యూనిస్టు పత్రికలకు భవిష్యత్తు లేదనే అంచనాలు అధిగమిస్తూ పలు ఎడిషన్లతో విస్తరించిన ప్రజాశక్తి పెరుగుదలలో నేను, వి.కృష్ణయ్య, కొరటాల తదితరులతో పాటు పనిచేయడం ఒక మంచి అనుభవం. నిజానికి మా కమ్యూనిస్టు కుటుంబంలో నాన్న నరసింహయ్య, అమ్మ లక్ష్మమ్మలతో పాటు బాల్యం నుంచి ఆయన గళాన్ని, కలాన్ని అనుసరిస్తూ వచ్చిన నాకు ఆయనతో సహ సంపాదకుడుగా కొన్నేళ్లు పనిచేయడం, ప్రత్యక్షంగా దీర్ఘకాలం ఆయన సూచనలు అందుకోవడం గొప్ప అవకాశం. ఇప్పటికీ ఏ కీలక సందర్భం వచ్చినా ఎం.హెచ్‌ ఎలా స్పందించేవారు, ఎలా ఏమి రాసేవారు తప్పక స్ఫురిస్తుంది. నా 'వెయ్యేళ్ల చరిత్ర'ను ఎం.హెచ్‌కు అంకితం చేస్తూ గతాన్ని, వర్తమానాన్ని కూడా వర్గ దృష్టితో చూడటమెలాగో నేర్పించిన వ్యక్తిగా ఆయనకు జోహారులర్పించానందుకే. నాలాంటి నా ముందటి రెండు మూడు తరాల కార్యకర్తలందరికీ ఆయన చెరగని స్ఫూర్తి. కొత్త ఆలోచనలను ఆహ్వానిస్తూ యువతను కలుపుకుని పోతూ మౌలిక విలువలను నిలబెట్టడంలో ఆయన పట్టువిడుపులు అనుసరణీయం. వాస్తవానికి ఎం.హెచ్‌ జీవితం మలి దశలో మతోన్మాదం పెరుగుదల, సోవియట్‌ విచ్ఛిన్నం, సమాజంలో స్వార్థపూరిత అవకాశవాదం వెర్రితలలు వేయడం సరళీకరణ వంటివన్నీ ఎదుర్కొన్నారు. ఇన్ని బాధ్యతలలోనూ సమస్యలలోనూ కార్యకర్తల పట్ల, తోటి నాయకుల పట్ల, సిబ్బంది పట్ల ఎం.హెచ్‌ చూపిన ప్రేమాభిమానాలు చెరగని ముద్ర వేశాయి. ఆయన కుటుంబం మొత్తం ఆ విధంగానే ఉద్యమంతో నిలబడటం కూడా ఇందులో భాగమే, ఉదయం గారైతే అందరికీ అమ్మే. ఉద్యమంలో తప్పనిసరైన సమిష్టి తత్వానికి పరస్పరత్వానికి వారి ప్రేమాభిమానాలు తార్కాణాలు.
2001 జూన్‌ 18న ఆయన మరణానంతర కాలంలో మోడీ రాకడ, కరోనా సవాలు వంటివీ చూశాము. ఇన్నిటి మధ్యనా ప్రజాశక్తి ముందుకు పోవడం, రాష్ట్ర విభజన తర్వాత నవతెలంగాణ పత్రిక ఏర్పాటు...ఇవన్నీ ఎం.హెచ్‌, ఇతర పెద్దలు వేసిన పునాదిపై వెలసినవే. తర్వాతి కాలంలో ఉద్యమానికి, పత్రికకూ కూడా నాయకత్వం వహించిన బాధ్యులు, నాయకులు ఆ మార్గాన ముందుకు సాగుతున్నందుకే...ఈ రోజున కలుషిత వివాదాస్పద రాజకీయ వాతావరణంలోనూ ప్రజాశక్తి విభిన్న వరవడితో ప్రత్యేకత నిలబెట్టుకోగలుగుతున్నది. మీడియాలో చొరబడిన అనారోగ్యకర ధోరణులను, సాంకేతిక ఆర్థిక సవాళ్లనూ తట్టుకుని విశిష్టత చాటుకుంటున్నది. ఎం.హెచ్‌, ఆయనతో పాటు దీర్ఘకాలం పనిచేసిన బొమ్మారెడ్డి పేర్ల మీద బహూకరించే అవార్డులు అందుకు ప్రతీకలుగా వుంటాయి.

తెలకపల్లి రవి