Jun 18,2022 06:32

కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అగ్ర నాయకుల్లో కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు ఒకరు. పద్దెనిమిది సంవత్సరాల పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆంధ్ర రాష్ట్రంలో విప్లవోద్యమ నిర్మాణంలో కీలకపాత్ర వహించిన ఆయన వర్ధంతి నేడు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన స్మృతులు ఎంతో ఉత్తేజాన్నిస్తాయి. ఆయన ఒక ఆదర్శ కమ్యూనిస్టు. అవిశ్రాంత విప్లవోద్యమంలో ఆయన జీవితం ఓ భాగం. రెండు తరాల కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన సారథి. ప్రజల్ని తన ఉపన్యాసాలతోనూ అంతే సమానంగా తన రచనలతోనూ ఉత్తేజపరిచిన గొప్ప నేత. కార్యకర్తలతో అత్యంత స్నేహపూరితంగా, ప్రేమ ఆప్యాయతలతో వ్యవహరిస్తూ వారిని పార్టీ పనిలో ఇముడ్చుకోవడంలో ...సమస్యలను సావధానంగా విని పరిష్కరించి వారిని పనిలో పెట్టుకోవడంలో...గొప్ప నిర్మాణ దక్షత కనబరిచేవారు.
మోటూరు హనుమంతరావు 1917లో గుంటూరు జిల్లా లోని వెల్లటూరుకు చెందిన సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. రేపల్లె హైస్కూల్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ తర్వాత జాతీయోద్యమ పిలుపుల్లో చురుగ్గా పాల్గొంటూనే సోషలిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ తదనంతరం కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. కా|| పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య వంటి అగ్రశ్రేణి నాయకులతో కలసి మొదట గుంటూరు జిల్లాలో ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో బలమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో ఎం.హెచ్‌ కీలక పాత్ర వహించారు.
ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన రాష్ట్ర నాయకులుగా బాధ్యత నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయగా చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బలమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయన పాత్ర కీలకమైనది. తెలంగాణ సాయుధ పోరాటానికి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగం, పేదలు నిర్వహించిన పోరాటాల్లోనూ, భూమి హక్కుకై లంక గ్రామాల ప్రజలు సాగించిన పోరాటాల్లోనూ ఎం.హెచ్‌ స్వయంగా పాల్గొన్నారు. 1964లో మితవాద రాజకీయాల నుంచి విడగొట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో విప్లవ పార్టీగా సిపిఐ(యం) పార్టీని నిర్మించడంలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పాత్ర అమోఘమైనది. ఈలోగా 1968లో అతివాద విచ్ఛిన్నం జరిగింది. తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంతంలో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అనేక జిల్లాల్లో జిల్లా కమిటీలు మొత్తంగానే అతివాదం వైపు కొట్టుకుపోయాయి. ప్రధానంగా యువత ఈ పెడ ధోరణికి లోనైంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కామ్రేడ్‌ ఎం.హెచ్‌ గొప్ప నిర్మాణ దక్షతను కనపర్చారు. ఊరు, వాడ తిరిగి చెదిరిపోయిన శ్రేణులన్నింటినీ సమీకరించుకుని మార్క్సిస్టు పార్టీ నిర్మాణాన్ని బలపర్చుకోవడానికి ఆయన అవిశ్రాంత కృషి చేశారు. విద్యార్ధి, యువజన సంఘాల ద్వారా కార్యకర్తలను సమీకరించి రాజకీయ తర్ఫీదునిచ్చి ఇముడ్చుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలంగా నిర్మించుకోవడంలో నాటి నాయకత్వం... ప్రత్యేకించి ఎం.హెచ్‌ చేసిన కృషి ఈనాటి ఉద్యమానికి పునాదిగా ఉన్నది.
ఎం.హెచ్‌ గొప్ప ఉపన్యాసకులు. రాజకీయాలను ప్రజా సమస్యలతో జోడించి ప్రజలకు అర్ధమయ్యే భాషలో వివరిస్తూ ప్రజల్ని ఉత్తేజపర్చడంలో ఆయనకు ఆయనే సాటి. పార్టీ బలహీనంగా ఉన్న ఆ రోజుల్లో కూడా ఆయన సభలకు జనం భారీగా వచ్చి ఉపన్యాసం వినేవారు. ఆయన మాటలు తూటాల్లా పేలి పాలకుల విధానాల్లోని డొల్లతనాన్ని ప్రజల ముందు ఉంచేవి. అదే సమయంలో ఎం.హెచ్‌ గొప్ప ప్రజా రచయిత. మొదట విశాలాంధ్రకు, ప్రజాశక్తి వారపత్రికకు, ఆ తర్వాత దినపత్రికకు దీర్ఘకాలం సంపాదకుడుగా పనిచేశారు. ఆయన కలం చాలా పదునైనది. విషయాలను ఎలాంటి గందరగోళం లేకుండా సూటిగా ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడంలో ఆయన దిట్ట. ఎంత కఠినమైన విషయాన్నైనా సులభమైన భాషలో ప్రజల్ని ఆలోచింపచేసేలా ఆయన రచనలు ఉండేవి. ప్రజల గుండెల్లో మండుతున్న విషయాలన్నింటిపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నలు సంధించడంలో, పాలకులను దోషులుగా నిలపడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సంపాదకీయాలు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకునేవి. కొందరు ఆయన సంపాదకీయాలు చదవడం కోసమే ప్రజాశక్తి పత్రిక తీసుకునేవారంటే అతిశయోక్తి కాదు. అతివాద, మితవాద ధోరణులపై ఆయన రాసిన సైద్ధాంతిక వ్యాసాలు ఇప్పటికీ విలువైనవే. 1991లో రష్యాలో సోషలిజం కూలిపోయింది. సోషలిజం అనే సిద్ధాంతానికే కాలం చెల్లిందని పాలక వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్న సందర్భంగా గోర్బచేవ్‌ ద్రోహాన్ని ఎండగడుతూ సోషలిజం సిద్ధాంతంలో పొరపాటు లేదని రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం చేసిన తప్పిదాల వల్లే సోషలిజం కూలిపోయిందని వివరిస్తూ ఎం.హెచ్‌ రాసిన వ్యాసాలు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. సోషలిజం అజేయం, సోషలిస్టు సమాజ నిర్మాణమే అన్ని రుగ్మతలకు పరిష్కారమంటూ ఆత్మవిశ్వాసంతో ప్రజా ఉద్యమాల్లో కార్యకర్తలు మమేకం కావడానికి ఆరోజుల్లో ఆయన రచనలు ఎంతగానో తోడ్పడ్డాయి.
ప్రజలతోనూ, కార్యకర్తలతోనూ ఎం.హెచ్‌ సుహృద్భావ సంబంధాలు కలిగి ఉండేవారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఉన్నా తాను పెద్ద నాయకుడ్ని అనే భావన ఎక్కడా కనబడేది కాదు. సాధారణ కార్యకర్త కూడా నేరుగా కలసి తాను ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనతో చర్చించే స్వేచ్ఛ ఉండేది. కార్యకర్తలంటే ఆయనకు ఉన్న ప్రేమ, ఆప్యాయత ఎటువంటిదో అది అనుభవించిన ఏ కార్యకర్త మర్చిపోలేరు. ప్రేమగా పలకరించడం, ఆప్యాయంగా యోగక్షేమాలు విచారించడం, ఓపిగ్గా సమస్యను వినడం, దాని పరిష్కారాన్ని వెతకడం, పార్టీ లేదా వ్యక్తిగా తాను చేయాల్సిందంతా చేయడం...ఆయన నుంచి నేర్చుకోవాల్సిందే. ప్రజా ప్రతినిధిగా ఉన్న కాలంలో కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజలతో కూడా చాలా మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. మధ్యతరగతి వారు, వర్తక వాణిజ్య వర్గాలు కూడా తమ సమస్యలపై ఆయన సహకారంతో ప్రభుత్వం వద్దకు వెళ్ళేవారు. కమ్యూనిస్టేతర ప్రజల్లో కూడా ఆయనకు ఉన్న గౌరవం అపారమైనది. ఎం.హెచ్‌ గారితో సైద్ధాంతికగా ఎవరికైనా సమస్య ఉండవచ్చు గానీ వ్యక్తిగతంగా ఆయన పట్ల వ్యతిరేకత ఉండదు. ఆదర్శవంతమైన ప్రజా నాయకుడిగా ఆయన అందరి మన్ననలను పొందారు. అందుకే పార్టీ నిర్మాణాన్ని మించిన ప్రతిష్ట పార్టీ పొందగలిగింది.
నేడు దేశంలో క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి నిరోధక శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. అత్యంత తిరోగమన విధానాలతో ప్రజలపై భారాలు మోపుతున్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటీకరణ, ద్రవ్యీకరణ పేరిట దేశాన్ని కార్పొరేట్‌ శక్తుల పరం చేస్తున్నారు. జాతీయత, హిందూత్వ పదాలను వాడుతూ తమ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఏకపక్షంగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో దేశంలో పేదరికం, దారిద్య్రం పెరుగుతూ ఉన్నాయి. గతంలో ఏనాడూ లేని గరిష్ట స్థాయిలో నిరుద్యోగం యువతను పీడిస్తున్నది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఆకలి చావులు సాధారణ విషయంగా నేడు పాలకవర్గాలు భావిస్తున్నాయి. కార్మిక చట్టాలు బలహీనపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఐక్యమై పాలక వర్గాల్ని నిలదీయాల్సిన అవసరం దేశంలో పెరుగుతున్నది. అయితే ఇదే సమయంలో మతం పేరిట విద్వేషాలు పెంచి ప్రజల్ని విభజించే రాజకీయాలకు సంఘపరివార్‌ శక్తులు తెగబడుతున్నాయి. లౌకికతత్వం ప్రమాదంలో పడింది. రాజ్యాంగం యొక్క మౌలిక విలువలు ధ్వంసమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కామ్రేడ్‌ ఎం.హెచ్‌ జీవితం మనకు ఆదర్శం కావాలి. నిర్బంధాలను ఎదుర్కొని వారు సాగించిన పోరాటాలను నేడు మననం చేసుకోవాలి. వారు పార్టీ నిర్మాణంలో పాటించిన కఠోర దీక్షను మనం అలవర్చుకోవాలి. పార్టీని విస్తరించేందుకు ఊరు, వాడ ప్రజల వద్దకు వెళ్ళాలి. సమస్యల్లో వారి వెంట ఉండాలి. వాటి పరిష్కారానికి ముందుండి పోరాడాలి. యువతను కదిలించి బలమైన పార్టీని నిర్మించాలి. కార్యకర్తలతో సాంకేతిక సంబంధాలు కాకుండా ఆత్మీయ సంబంధాలు అలవర్చుకోవాలి. కామ్రేడ్‌ ఎం.హెచ్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విప్లవోద్యమ నిర్మాణానికి పునరంకితం కావాలి. అదే మనం ఆయనకిచ్చే నివాళి.

ma gafur

 

 

 

 

వ్యాసకర్త : సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ. గఫూర్‌