Nov 03,2023 11:05

జెరూసలెం, గాజా :  ఇజ్రాయిల్‌ -  హమాస్‌ మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు 10వేల మందికి పైగా మరణించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల దన్ను చూసుకుని నెతన్యాహు గాజాలో నరమేధానికి పాల్పడుతున్నాడు. అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా దాడులు చేస్తున్నాడు. ఈ దాడుల్లో ఇంతవరకు 8,796 మంది పాలస్తీనీయులు మరణించారు. వీరిలో 3,648మంది చిన్నారులు, 2,290మంది మహిళలు వున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయిల్‌ వైపు మరణాలు 1400దాటాయని ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇజ్రాయిల్‌, ఈజిప్ట్‌, హమాస్‌ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బుధవారం 320మంది విదేశీ పౌరులు రఫా క్రాసింగ్‌ ద్వారా ఈజిప్ట్‌లోకి ప్రవేశించారు. క్షతగాత్రులైన గాజా ప్రజలు కూడా డజన్ల సంఖ్యలో వెళ్లారు. ఉత్తర సినారులోని ఆస్పత్రుల్లో గాయపడిన వారిని చేర్చి చికిత్స అందిస్తున్నామని, 117మంది విదేశీయులకు రఫా క్రాసింగ్‌ దగ్గర క్వారంటైన్‌ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారని ఈజిప్ట్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వీరిలోని 35మంది చిన్నారులకు అవసరమైన వ్యాక్సిన్లు కూడా వేశారు.

కేవలం మూడు వారాల వ్యవధిలోనే గాజాలో దాదాపు 3,200మంది చిన్నారులు మరణించడం పట్ల సేవ్‌ ది చిల్డ్రన్‌ సంస్థ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. 2019 నుంచి యుద్ధ ప్రాంతాల్లో ఏటా మరణిస్తున్నవారి సంఖ్యను ఇది అధిగమించిందని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్ధుల సంస్థ కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లాజారిని తెలిపారు.

కాల్పుల విరమణ జరగాలంటూ అంతర్జాతీయంగా విజ్ఞప్తులు అందుతున్నా వాటినే మాత్రం పట్టించుకోకుండా ఇజ్రాయిల్‌ సైన్యం బాంబుదాడులను కొనసాగిస్తోంది. పాలస్తీనా భూభాగంలోకి వెళ్లి మరీ యుద్ధం చేయాల్సిందిగా కమాండర్లను, సైనికులకు పంపిన లేఖలో ఐడిఎఫ్‌ చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ హెర్జి హలెవి కోరారు. ఈ యుద్ధం సుదీర్ఘంగా వుండబోతోందని అన్నారు. చివరిదాకా పోరాడాల్సిందేనన్నారు.