- 'దేశ రక్షణ భేరి'లో సిపిఎం నాయకుల పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో కార్మికుల భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడిందని సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం నిర్వహించిన దేశ రక్షణ భేరి సభలో శనివారం నాయకులు ప్రసంగించారు. లేబర్ కోడ్స్ పేరుతో నాలుగు చట్టాలను తీసుకొచ్చి కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులు లేకుండా మోడీ ప్రభుత్వం చేసిందని కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ ఉద్యోగాలు లేకుండా చట్టం తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర విభజన హక్కుల కోసం కేంద్రంపై ఐక్య పోరాటం చేద్దామని చెబుతున్నా.. జగన్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పట్టించుకోవడం లేదన్నారు.

మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ? : కె సుబ్బరావమ్మ
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. మహిళలను గౌరవించాలి, రక్షించాలనే మోడీ మరోపక్క గుజరాత్ బిల్కిస్‌బానో దోషులను స్వాతంత్య్ర దినోత్సవం రోజు జైలు నుంచి విడుదల చేశారని విమర్శించారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో అనేక ప్రజావ్యతిరేక బిల్లులను ఆమోదించుకుంటున్న మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. చంటిబిడ్డలు తాగే పాలపై కూడా జిఎస్‌టి వేసి ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా మహిళలపై దాడులు పెరిగాయని, వీటిని అరికట్టేందుకు జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను బలపరుస్తున్న జగన్ : మధు
పార్టీ సీనియర్ నాయకులు పి మధు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీని జగన్ బలపరిచి రైతు వ్యతిరేక చట్టాలను అమలు పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ, అంబానీలకు జగన్ దాసోహమయ్యారని విమర్శించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పరిశ్రమల పేరుతో రైతుల భూములను జగన్ ప్రభుత్వం కాజేస్తుందని విమర్శించారు. కార్మికుల కనీస వేతనాలు, రైతుల బలవంతపు భూసేకరణ అంశాలను టిడిపి, జనసే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక బిల్లులైన జిఎస్‌టి, విద్యుత్ చట్ట సవరణపై తెలంగాణ సిఎం కేంద్రానికి వ్యతిరేకంగా కేేంద్ర ప్రభుత్వంపై పోరాడుతుంటే జగన్‌కు మాత్రం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపిని భుజాన వేసుకుంటున్న టిడిపి, వైసిపి : బాబూరావు
సభకు అధ్యక్షత వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన బిజెపిని టిడిపి, వైసిపి భుజాన వేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీకి రాష్ట్రంలో వచ్చాయని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసిపి, టిడిపి సంపూర్ణ మద్దతు బిజెపికి తెలిపాయని పేర్కొన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేసింది వైసిపి అయితే తెరవెనుక, అండదండాలు అందించింది బిజెపి అని పేర్కొన్నారు. అమరావతికి అండగా ఉంటామని బిజెపి దొంగ నాటకాలు ఆడుతోందని విమర్శించారు.

నిర్వాసితులను పట్టించుకోవడంలేదు : నాగమణి
ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగమణి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులకు నిలువ నీడ లేకుండా వదిలేశాయని పేర్కొన్నారు. నష్టపరిహారం చెల్లించలేదని, కనీస వసతలు కల్పించలేదని అన్నారు. నాగమణి గిరిజన భాషలో ప్రసంగించడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
తరలివచ్చిన కామ్రేడ్లు
దేశ రక్షణ భేరి పేరుతో సిపిఎం నిర్వహించిన బహిరంగ సభకు కామ్రేడ్లు తరలివచ్చారు. సుదీర్ఘకాలం తరువాత విజయవాడలో బహిరంగ సభ జరిగింది. ఎండను సైతం లెక్కచేయకుండా నాయకుల ఉపన్యాసాలను చివరి వరకు ఆలకించారు. వేదికపై చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.










