Aug 18,2022 06:26

అమృతోత్సవాల గురించి, జాతీయ జెండా ఎగరేయడం గురించి, దేశభక్తి గురించి, నైతిక విలువల గురించి...పిల్లలకు, జాతి జనులకు నేతలు ఒకవైపు ఉద్భోదిస్తున్నారు. మరోవైపు కొందరు ప్రజా ప్రతినిధులు అసెంబ్లీల్లోనే నగ వీడియోలు చూడడం, నగ వీడియా కాల్స్‌, మహిళలతో అసభ్యంగా మాట్లాడుతున్న అనైతిక ఆడియోలు, 'గోలి మారో' లాంటి దౌర్జన్య ప్రేలాపనలు నేతల ద్వంద్వనీతికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. దుశ్శాసన స్వభావానికి ప్రతిబింబాలుగా వున్నాయి. తప్పు చేయడమే కాదు. ఆ తప్పును సమర్థించుకోవడం, ఆ సమర్థనకు కులాన్ని, బలప్రదర్శనను ఆయుధాలుగా మార్చుకోవడం ఆందోళనకర పరిణామాలు. ఈ పరిస్థితులకు కారణాలు ఏమిటో పరిశీలించాలి. ఎక్కడ దారి తప్పామో, మరలా తిరిగి ఎక్కడ మొదలుపెట్టాలో నిర్ణయించుకోవాలి. అందుకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం ఒక సందర్భం కావాలి.
గోరంట్ల మాధవ్‌ వీడియోపై ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా? లేదా? అది నకిలీనా, కాదా అనేవి ప్రధాన సమస్యలు కాదు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఎలా వుండాలనేది ప్రధానాంశం. ఉన్నత స్థాయి పదవుల్లో వుండి సమాజ ప్రతిష్టను, మహిళల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ప్రవర్తించడం సమర్థనీయమా? అనేది ముఖ్యాంశం. సభ్య సమాజంలో జీవించే ప్రతి ఒక్కరు ఆ నాటి సమాజపు ఉనికిలో వున్న కనీస విలువలను, పద్ధతులను పాటించడం నైతికం. చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఈ నైతిక ధర్మాన్ని ఆచరించడంలో ఆదర్శనీయంగా వుండాలి. 'యథా రాజా తథా ప్రజా' అనే మాట తరతరాల అనుభవం నుండి వచ్చిందందుకే. ప్రజాప్రతినిధులు అనుభవిస్తున్న హోదా, వారు తీసుకుంటున్న వేతనాలు, సౌకర్యాలన్నీ ప్రజల నుండి పొందుతున్నవే. అందుకే 'చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వుండాలి' అని రాజ్యంగ నిర్మాతలు భావించారు. అందుకు అవసరమైన విధి విధానాలను, నైతిక సూత్రాలను రూపొందించారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత వ్యక్తులుగా ప్రజాప్రతినిధులది. ఆ వ్యక్తులు చట్టసభలకు ఎంపిక కావడానికి కారణమైన ఆయా రాజకీయ పార్టీలది. గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో అటు వ్యక్తి, ఇటు పార్టీ ఈ నైతిక ధర్మాన్ని పాటించకపోగా, కులాల మధ్య కుంపటి రాజేసి ఎన్నికల లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఈ రకమైన పరిస్థితి మాధవ్‌తోనే మొదలు కాలేదు, ఇంతటితోనే ఇది అంతం కాదు. కర్నాటక అసెంబ్లీలో ఇద్దరు ఎంఎల్‌ఏలు సెల్‌ఫోన్‌లో నగ వీడియోలు చూస్తూ మీడియాకు దొరికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి గవర్నరు రాజ్‌భవన్‌ లో నెరపిన రాసలీలలు, వివిధ రాష్ట్రాల్లో అనైతిక సంబంధాలు కొనసాగిస్తూ పట్టుపడుతున్న ప్రజాప్రతినిధుల బాగోతాలు, సహాయం కోరి వచ్చిన మహిళలతో అసభ్యంగా ఫోన్లలో మాట్లాడిన ఆడియోలు, చట్టసభల్లో మహిళలను అవమానిస్తూ మాట్లాడిన సంఘటనలు, వెకిలి చేష్టలు...చట్టసభల విలువలను దిగజారుస్తున్నాయి.
ప్రజాసేవ చేసి, ప్రజల అభిమానాన్ని, పార్టీ విశ్వాసాన్ని పొంది చట్టసభలకు ఎంపికయ్యే దశ నుండి దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల కేసుల్లో నిందితులుగా వున్నవారు, ఎన్నికలకు ఒకటి, రెండు రోజుల ముందు నోట్ల కట్టలతో దిగి పార్టీ అభ్యర్థిత్వాన్ని పొందుతున్న అవినీతిపరులు చట్టసభలకు ఎన్నికవుతున్న దశకు పాలక పార్టీలు ప్రజాస్వామ్యాన్ని దిగజార్చాయి. ఈ క్రమం వల్లే చట్టసభల్లో క్రిమినల్‌ కేసులు వున్నవారు, కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక ప్రకారం 2009లో ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యుల్లో 162 మందిపై క్రిమినల్‌ కేసులు వుండగా...2014లో 185 మందిపై నేరపూరిత కేసులున్నాయి. 2019లో ఆ సంఖ్య 233కు పెరిగింది. ప్రస్తుత పార్లమెంట్‌ సభ్యుల్లో మహిళలపై దాడి, అత్యాచారం లాంటి తీవ్రమైన కేసులు ముగ్గురిపై వుండగా అందులో ఒకరు ఈ గోరంట్ల మాధవ్‌ కావడం గమనించాల్సిన అంశం. కేంద్ర మంత్రివర్గం లోని 56 మందిలో 22 మందిపై అంటే మొత్తం మంత్రివర్గంలో 39 శాతం మందిపౖౖె క్రిమినల్‌ కేసులు వున్నాయి. గత 2014 మంత్రివర్గంలో 31 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు వుండగా 2019 నాటికి మరో ఎనిమిది శాతం పెరిగింది. పార్లమెంట్‌ సభ్యుల్లో 2009లో 58 శాతం మంది కోటీశ్వరులు కాగా, 2014లో 82 శాతం, ప్రస్తుత పార్లమెంట్‌ సభ్యుల్లో 88 శాతం మంది కోటీశ్వరులే. బిజెపి నుండి ఎన్నికైన వారిలో 88శాతం మంది కోటీశ్వరులు వున్నారు. కేంద్ర మంత్రుల్లో 51 మంది కోటీశ్వరులు.
వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ సంఖ్యలు మరింత ఎక్కువగా పెరిగిపోతున్నాయి. జాతీయోద్యమ వారసత్వ ప్రభావం సుమారు రెండు దశాబ్దాల పాటు కొనసాగడం, కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం వల్ల నాటి నేతల్లో, పార్టీల్లో నీతి, నిజాయితీ, నిరాడంబరత, మానవత లాంటి విలువలకు ప్రాధాన్యత వుండేది. అందుకే కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో నేతలు నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయడం వుండేది. దేశ ఆర్థిక వ్యవస్థలో, ప్రజాసేవ కార్యక్రమాల్లో ప్రభుత్వ రంగం ప్రధాన పాత్ర పోషించిన కాలంలో అవినీతి ఉన్నా రాజకీయాల్లో కొన్ని విలువలు వుండేవి.
1991 తరువాత అనుసరిస్తున్న సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థతో పాటు, రాజకీయ వ్యవస్థలో వినాశకర ప్రభావాలు పెరిగాయి. చట్టసభలు నామమాత్రపు స్థాయికి దిగజారుతున్నాయి. చట్టాల రూపకల్పనలో, ప్రజా సమస్యలు చర్చించడంలో, దేశ భవిష్యత్‌ గురించి ఆలోచించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కుదించుకు పోయింది. విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను దోచుకోవడానికి చట్టసభలకు ఎన్నిక కావడం ఒక మార్గంగా పాలక వర్గాలు ఎంచుకున్నాయి. రాజకీయాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. ఎదో ఒక రీతిలో ఎన్నిక కావడం, ఎన్నికైన తర్వాత అధికారం వున్న చోటికి చేరడం సహజమైన విషయాలుగా మారిపోతున్నాయి. ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికైన బిజెపి యేతర ప్రభుత్వాలు నేడు బిజెపి ప్రభుత్వాలుగా మారడం ఇందులో భాగమే. అధికారం అండగా వుంటే తమ అవినీతి, అక్రమాలను ప్రశ్నించేవారు వుండరనే విశ్వాసం ప్రజా ప్రతినిధుల్లో పెరిగిపోతున్నది. అవినీతి, అక్రమాలను నిష్పక్షపాతంగా విచారించాల్సిన ఇ.డి, సిబిఐ లాంటి రాజ్యంగబద్ద సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో... ప్రతిపక్షాలను దెబ్బ తీసే పదునైన ఆయుధాలుగా మారిపోయాయి.
చట్టసభల్లో విలువల పతనాన్ని ఆర్థిక విధానాలతో పాటు, బిజెపి మతతత్వ రాజకీయాలు మరింత వేగం చేశాయి. మతం చాటున కార్పొరేట్‌ అనుకూల విధానాలు వేగంగా అమలు చేయడానికి అవినీతి, అక్రమ ప్రవర్తన కలిగిన వారు ఎంత ఎక్కువ మంది చట్టసభల్లో వుంటే అంత అనుకూలత పెరుగుతుందని భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అందుకే పాలక పార్టీలన్నింటిలో ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతం, పట్టణాల్లో 67 శాతం మంది పౌష్టికాహారం అందని వారు వున్నా, ప్రపంచ ఆకలి సూచీలో 101 స్థానానికి దేశం దిగజారినా, ప్రపంచ ఆనంద సూచీలో 139వ స్థానంలో వున్నా, పత్రికా స్వేచ్ఛలో 142వ స్థానంలో వున్నా, గత 25 సంవత్సరాల్లో నాలుగున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, పది సంవత్సరాల్లో ఒక కోటి ఏభై లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని ఒదిలేసినా ఇలాంటి ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం పట్టడం లేదు.
ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను అనేక విషయాల్లో మరింత మెరుగు పరుచుకోవలసి వుంది. అయితే వున్నదాన్ని కాపాడుకుంటూనే మెరుగు పరుచుకోడానికి ఉద్యమించాలి. చట్టసభల విలువల పతనానికి కారణమైన ఆర్థిక, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం నేటి తక్షణ కర్తవ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థకు చీడపీడలాగా పట్టిన అవినీతి, అనైతిక ప్రజాప్రతినిధులను ప్రజాక్షేత్రం నుండి వేరు చేయాలి. అందుకోసం ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి పోరాడాలి. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, రాజ్యంగ మౌలిక లక్ష్యాలు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కరు...దేశ భవిష్యత్తును మార్చే విధానాల కోసం కదలాలి.

bupal

 

 

 

 

వ్యాసకర్త :  సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి. రాంభూపాల్‌