
సిపిఎం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి అర్జున్‌ముండా
పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల సానుకూల స్పందన
పోలవరంలో ఆదివాసీ చట్టాలు అమలులో లోపాలున్నాయని మంత్రి అంగీకారం
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో :పోలవరం నిర్వాసితుల సమస్యల పరిశీలనకు డిసెంబర్లో స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి చట్టాలను అమలు జరపడానికి కావాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటానని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ముండా సిపిఎం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించేందుకు సిసిఎం ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించడంతోపాటు అంశాలవారీ చర్చించారు. ఈ బృందంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్, ఆర్ అరుణ్‌కుమార్, సిపిఎం అల్లూరి సీతారామారాజు జిల్లా కార్యదర్శి బి కిరణ్, ఏలూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు డి రమేష్, ప్రదీప్‌కుమార్ తదితరులు ఉన్నారు. వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను ప్రతినిధివర్గం మంత్రికి వివరించారు. అనంతరం చర్చల వివరాలను మీడియా సమావేశంలో బి వెంకట్ వివరించారు.
ప్రాజెక్టు నిర్మాణమంటే కాంట్రాక్టర్లకు, ధనికులకు డబ్బులు ఇవ్వడంగా తయారైందని, నిర్వాసితుల హక్కులు చట్టాలన్నీ పోలవరం ప్రాజెక్టు విషయంలో పూర్తిగా తుంగలో తొక్కారని తెలిపారు. లక్ష కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకుండానే గిరిజనులను నీటిలో ముంచి ప్రాజెక్టు నిర్మాణం సాగిస్తున్నారని మంత్రికి వివరించినట్లు తెలిపారు. 2022లో వచ్చిన వరదల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో రూపొందించిన తప్పుడు కాంటూరు లెక్కలు పున:పరిశీలించాలని కోరామన్నారు. 2013 భూసేకరణ చట్టం, అటవీ హక్కుల చట్టం, 5వ షెడ్యూలులో ఉన్న గిరిజన హక్కులు అమలు కావడం లేదనే విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చినట్లు వివరించారు. అటవీ భూములకు నష్టపరిహారం ఇవ్వడం లేదని నిర్వాసితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, పోడుభూముల చట్టం అమలు చేయకపోవడంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు వివరించారు. ముంపు ప్రాంతాలు కాబట్టి పోడు భూములకు పదేళ్లుగా పట్టాలు ఇవ్వడం లేదని, పట్టాలు లేవని పరిహారమూ ఇవ్వడం లేదని మంత్రికి తెలిపామన్నారు. అలాగే ఉపాధిహామీ పథకం అమలు చేయడం లేదని, 2017 కటాఫ్ డేట్ పెట్టడం వల్ల 18 ఏళ్లు నిండినటువంటి వారికి నష్టపరిహారమూ ఇవ్వడం లేదని తెలిపారు. దీనికి స్పందించిన మంత్రి పోడు భూములపై చర్చించి సమస్యను పరిష్కారం చేయాలని అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారని పేర్కొన్నారు. అలాగే నిర్వాసితుల కమిటీల్లో నిర్వాసితులు కూడా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల గురించి ముంపు ప్రాంత ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో స్వయంగా పాల్గన్న బి కిరణ్, టి నాగమణి మంత్రికి వివరించారు. గిరిజన నాయకులు చెప్పే ప్రతి విషయాన్నీ అనువాదం చేయించుకుని మంత్రి ఆసక్తిగా విన్నారని వెంకట్ వివరించారు. గిరిజనులకు జరుగుతున్న నష్టంపై సానుకూలంగా స్పందించారని, ప్రాజెక్టుల కోసం త్యాగాలు చేస్తున్న గిరిజనులకు జరిగే అన్యాయాలపై మంత్రి కూడా ఏకీభావం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. తన పరిధిలో సాధ్యమైనంత న్యాయం చేస్తానని, ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు పంపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.