Oct 30,2022 07:12

కోటిలింగం ఇంటర్వ్యూలో కూచున్నాడు. కొత్త కాదు. భయం లేదు. ఏదో ఫార్మాలిటి. లోపల అడిగిన అడ్డదిడ్డమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేసి అంతకు ముందు ఫోనులో వాళ్ళు చేసిన ఇంటర్వ్యూకు, దీనికి సంబంధం లేదన్న విషయం గ్రహించి కొన్ని రోజులు వేచి చూడడం తరువాత వదిలేయడం.

ఐతే ఈసారి తనకు ప్రత్యేకమైన ఆహ్వానం లాంటిది ఉందని కోటిలింగం కోటి ఆశలు. ఇదంతా తన చిన్నాన్న ఈ మేనేజరుకు తన ముందే ఫోను చేసి, అనుమానం వస్తుందేమో అని మైక్రోఫోను ఆన్‌ చేసి మరీ మాట్లాడినప్పుడు, కోటిలింగం మంచోడు, ముఖ్యంగా మనోడు. కాస్త సహాయం చేయి, కాస్తంటే కాస్త కాదు ఉద్యోగం మనోడికే రావాలి అని నొక్కి మరీ చెప్పాడు. అందుకే ధైర్యం.

అలాంటి ''మనోడు'' అన్న ఫోనులు ఇంకెంతమంది చేసుంటారో, ఐనా చిన్నాన్న చెప్పాడంటే అంతే, తిరుగుండదు. ఇంతకుముందు ఎన్ని చూడలేదు తను. ఆయన మనోడు అన్నాడంటే చాలంతే అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు.

ఇంతకీ ఈ మనోడు అన్న కాన్సెప్ట్‌ ఇప్పుడెందుకొచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. ఇంగ్లీషోడి అగ్రపీఠాన మనోడైన రిషి సునాక్‌ కూచోడమే. ఎప్పుడో ఎలెక్స్‌ హేలీ ఏడుతరాలు నవలలో రాసినట్టు పూర్వం మన సంతతికి చెందిన వాళ్ళు అదీ వేరే దేశాల్లో ఉన్న మన సంతతి వాడు మనల్ని పాలించిన ఆంగ్ల గడ్డపై అధికారం చేస్తున్నాడంటే నిజంగా మనకే గౌరవం. ఎవరూ కాదనరు. మనోడు అక్కడ ప్రైమ్‌ మినిస్టరయ్యాడు. పాకిస్తాను పై మ్యాచు గెలిచిన ఈ సందర్భంలో, దీపావళి చేసుకున్న ఈ సమయంలో మరీ మరీ ముఖ్యం. అదే మ్యాచు ఓడిపోయి వుంటే కోహ్లీ మనోడు కాకుండా పరాయోడైపోయేవాడు.

క్రికెట్‌ మ్యాచులకు ఎంతో వ్యయం చేసేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పిచ్‌ పై వర్షం పడితే జాగ్రత్తగా టార్పాలిన్‌ లాంటి వాటితో అది తడవకుండా మూసే నేటి నవనాగరికతలో తానేమి తింటున్నాడో తెలియని రైతు మనకింత తినడానికి పండిస్తున్నాడే ఆ రైతును మనోడు అనుకున్నవాళ్ళు ఎంతమంది అన్న ప్రశ్న వేసుకుంటే మనకే సిగ్గవుతుంది.

ఇక రాజకీయాల్లో ఈ మనోడు రంగులు మారుస్తుంటాడు. సడన్‌గా ఎవరివాడు అన్న సందేహాన్ని కలిగిస్తుంటాడు. ఈ మనోడు ఎవరివాడో తెలుస్తూనే ఉంటుంది. అన్ని ప్రాంతాల వాళ్ళూ మా వాళ్ళే అనేసి తనోళ్ళని బాగా చూసుకునే మనోడు కూడా ఉంటాడు. ఈలోకంలో ఎవ్వడూ మనోడు కాదు అని చెప్పేటోడూ ఉంటాడు. పైకి తత్వం బోధిస్తున్నట్టే ఉంటాడు కాని తనోడు ఒక్కడు కాదు ఇద్దరు అని వాళ్ళని భుజాల మీద మోసి ప్రపంచానికే తలమానికంగా తయారు చేశాం చూడండి మనోడిని అంటాడు. అలాగే ప్రపంచ ఆకలి సూచీలో మనమెక్కడ ఉన్నాము. మనోళ్ళు అనబడే బీదవాళ్ళు తిండిలేక రోజూ ఎంతమంది చనిపోతున్నారు. ఇవన్నీ కూడా మనోడెవరో నిర్ణయించే విషయాలు. మన కులపోడు, మన మతమోడు మనోడు కాదు, మనోడు మన వర్గమా కాదా అన్నదే ప్రధానం. కార్మికుడికి ఇంకో కార్మికుడే మనోడు, రైతుకు ఇంకో రైతే మనోడు. ప్రజలకు మంచి చేయాలనుకునే మనోడికి అలాంటివాడే మనోడు. మనోడు నిర్వచనాన్ని అందుకే మార్చొద్దని మనవి.

అతను మనోడెట్లా అవుతాడు అని ప్రశ్న కనుక వేస్తే నీవు మన జాతీయుడవు కాదు అన్న సర్టిఫికెట్‌ వెంటనే ఇస్తారు. మన పుస్తకం పైన ప్రమాణం చేసినోడు అసలు సినలైన మనోడు అని కితాబిస్తారు. అదే పుస్తకం పైన ప్రమాణం చేసిన నీవు, రైతులను ఎండలో వర్షంలో చలిలో ఎన్నిరోజులు వుంచావు, ఎందరిని బలి తీసుకున్నావు, ఎన్ని ప్రభుత్వ సంస్థల్ని మింగేశావు, ఇంకా మింగుతున్నావు, కరోనా సమయంలో రక్తంతో రోడ్లకు అలంకరణ చేశావే...ఆ కరోనా బాధితుడు, రైతు, కార్మికుడు, ప్రభుత్వ రంగ ఉద్యోగి నీవాడు కాదా? వాళ్ళను ఎందుకు మనోళ్ళు అనుకోవు. అసలు నీవు నిజంగా మనోడివా అన్న అనుమానం తెప్పిస్తున్నాడు ఇంకో రకం మనోడు.

ఇంతకీ ఆ మనోడు డాలరుతో, తన కరెన్సీతో పోలిస్తే మన రూపాయ విలువను పెంచుతాడా, ఐతే నిజంగా మనోడే. మనోడు ఎక్కడ ఉన్నా మనోడే, పైన శిఖరంపైకి ఎక్కాక మనోడు అని అందరూ అంటారు. అంతకు ముందు కూడా మనోడు అనేటోడే నిజంగా మనోడు.
- జంధ్యాల రఘుబాబు
సెల్‌ : 9849753298