Dec 23,2022 10:02
  • కటింగ్‌ సొమ్ము ముందే వసూలు
  • తేమ విషయంలో కొత్త పద్ధతి
  • రవాణ ఛార్జీలు మధ్యవర్తులకే
  • దగా పడుతున్న ధాన్యం రైతు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ధాన్యం రైతు ముప్పేటా దోపిడీకి గురవుతున్నాడు. మిల్లర్లు, వ్యాపారులు, మధ్యవర్తులు, తిమ్మిని బమ్మిని చేసి రైతులను మోసగిస్తున్నారు. మిల్లర్ల, దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) ద్వారా రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా, తేమ శాతం, రవాణ ఛార్జీల విషయంలో రైతు రొక్కానికి చిల్లులు పెడుతున్నారు మిల్లర్లు, మధ్యవర్తులు. ధాన్యంలో తేమ శాతాన్ని మిల్లర్లు కొత్త పద్ధతుల్లో తమ దోపిడీకి ఉపయోగపెట్టుకుంటున్నారు. ధాన్యంలో 16 శాతం తేమ ఉన్నా రైతుకు పూర్తి ఎంఎస్‌పి చెల్లించాలన్నది ప్రభుత్వ నిబంధన. ఆ పైన 22 శాతం వరకు ఒక్కో పాయింట్‌కు రూ.21 తగ్గించి తీసుకోవాలి. ఇక్కడే మిల్లర్లు మతలబు చేస్తున్నారు. కల్లాల వద్ద, ఆర్‌బికెలలో ప్రభుత్వ సిబ్బంది యంత్రాలతో పరిశీలించినప్పుడు తేమ శాతం 16 శాతమే చూపిస్తోంది. అదే ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తీసితెళితే అక్కడి ప్రైవేటు మిషన్లు 18 శాతం తేమను చూపెడుతున్నాయి. ఒక్కోసారి 22 శాతం తేమను కూడా చూపిస్తున్నాయి. ప్రభుత్వ ఆర్‌బికెలో జనరేట్‌ అయిన రికార్డులను మిల్లర్లు ప్రామాణికంగా తీసుకోకుండా తమ యంత్రాలలో చూపించిన తేమ శాతాన్నే ప్రామాణికంగా చేసుకుంటున్నారు. మిల్లర్ల వద్ద ఉన్న యంత్రాల్లో ఎక్కువ తేమ శాతం చూపించేలా ట్యాంపర్‌ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు.
 

                                                                         తోలకానికి ముందే..

మిల్లర్లు ధాన్యంలో తేమ శాతాన్ని పెంచి ఎంఎస్‌పికి కోతలు పెట్టడం ఒక రకం దోపిడీ కాగా, కటింగ్‌ చేసిన సొమ్మును ముందు రైతులు చెల్లిస్తేనే ధాన్యం తీసుకుంటామనడం మరో రకం దోపిడీ. ఉదాహరణకు తేమ 18 శాతం నమోదైనుకుందాం. అనుమతించిన 16 పాయింట్లకు రెండు పాయింట్లు అదనంగా తేమ ఉంది కాబట్టి ఒక్కో పాయింట్‌కు ఒక కిలో ధాన్యం లేదా రూ.21 కట్‌ చేస్తున్నారు. 75 కిలోల బస్తాకు రూ.42 కట్‌ చేస్తున్నారు. గ్రేడ్‌ 'ఎ' రకం 75 కిలోల బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పి రూ.1,545లో రూ.42 తగ్గిపోతుంది. రైతు 30 బస్తాలు అమ్మితే రూ.1,260 తగ్గుతుంది. ఆ మొత్తాన్నీ రైతు ముందే మిల్లరుకు కట్టాలి. అప్పుడే ధాన్యం తీసుకుంటున్నారు. ఒక వేళ తేమ 22 శాతం ఉంటే బస్తాకు రూ.84 మిల్లరుకు రైతు ముందే కట్టి ధాన్యం తోలాలి. 30 బస్తాలు తోలితే రూ.2,520 ముందే మిల్లర్‌కు చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతు అకౌంట్‌లోకి ధాన్యం తోలిన మూడు వారాలకు సొమ్ము పడుతుంది. అప్పుడు పూర్తి ఎంఎస్‌పినే రైతు ఖాతాలో పడుతోంది. ముందుగా మిల్లర్లకు కట్టిన సొమ్ము అనధికారిక కప్పం అన్నమాట. కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరం. కౌలు గుర్తింపు కార్డులు (సిసిఆర్‌సి) లేని వారే అత్యధికంగా ఉన్నారు. యజమానులు ఇ-కెవైసి చేయించుకున్నారు కనుక ధాన్యాన్ని కౌలు రైతులు అమ్మినా, ప్రభుత్వం నుంచి పడే రొక్కం యజమానుల అకౌంట్‌లో జమ అవుతోంది. యజమాని దయదలిచినప్పుడు కౌల్దారు చేతికి డబ్బులు అందుతాయి. కానీ కటింగ్‌ అమౌంట్‌ మాత్రం కౌలు రైతు ముందే మిల్లరుకు చెల్లించి ధాన్యం తోలాలి.
 

                                                                        దళారులకు ట్రాన్స్‌పోర్ట్‌

రైతులు కల్లాల వద్ద నుంచి మిల్లర్ల వద్దకు ధాన్యం తోలడానికి గోనె సంచులు, హమాలీ, రవాణా ఛార్జీల నిమిత్తం కింటాలుకు రూ.57 వంతున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఛార్జీలు రైతుల అకౌంట్‌లో వేస్తామని సర్కారు చెబుతున్నా అది జరగట్లేదు. రైతుల వద్ద నుంచి మధ్యవర్తులు ధాన్యాన్ని మిల్లర్లకు చేరవేస్తున్నారు. ముందే వాళ్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. దాంతో రవాణా సంబంధిత ఛార్జీలు మధ్యవర్తుల ఖాతాల్లో పడుతున్నాయి. రైతులు మాత్రం ఆ చార్జీలను తమ జేబుల్లోనుంచి ముందే పెట్టుకుంటున్నారు. రైతులు 30 క్వింటాళ్ల ధాన్యం ఇస్తే రూ.1,710 ప్రభుత్వం నుంచి మధ్యవర్తులకు పోతున్నాయి.