Aug 31,2023 06:51
  • గృహ నిర్బంధంలో అధ్యక్షుడు

లిబ్రెవిల్లె : సెంట్రల్‌ ఆఫ్రికా దేశమైన గాబన్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మిలటరీ రద్దు చేసింది. ప్రభుత్వ సంస్థలు కూడా రద్దయ్యాయని సైనిక అధికారులు బుధవారం తెలిపారు. తాము అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నామని, అధ్యక్షుడు అలీ బాంగోను గృహ నిర్బంధంలో వుంచినట్లు ప్రకటించారు. సీనియర్‌ సైనిక అధికారుల బృందం ఈ మేరకు టివిలో ఒక ప్రకటన చేసింది. వివాదాస్పదమైన ఎన్నికల్లో బాంగో తిరిగి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారని ప్రకటన వెలువడిన వెంటనే తాము అధికారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, సెనెట్‌, నేషనల్‌ అసెంబ్లీ, రాజ్యాంగ కోర్టు, ఆర్థిక, సామాజిక, పర్యావరణ మండలి, గబనీస్‌ సెంటర్‌ ఫర్‌ ఎలక్షన్స్‌లతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలు రద్దయ్యాయి. తదుపరి నోటీసులు జారీ చేసేవరకు అన్ని సరిహద్దులను మూసివేస్తున్నట్లు తెలిపారు. శనివారం జరిగిన ఎన్నికల్లో పాలక గాబనీస్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన బాంబో తిరిగి ఎన్నికయ్యారని గాబన్‌ జాతీయ ఎన్నికల సంస్థ ప్రకటించింది. అయితే ఆ ఎన్నిక విశ్వసనీయం కాదని సైనికాధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా, రాజధాని లిబ్రెవిల్లెలో తుపాకీ కాల్పులు వినిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. కాగా మిలటరీ చేసిన ప్రకటనపై గాబన్‌ అధ్యక్షుడు, ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.