Nov 20,2022 06:50

దేశంలో బాలల దినోత్సవం నవంబర్‌ 14న వచ్చింది. ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్‌ 20న జరుగుతోంది. ఇదీ అలాగే వెళ్ళిపోతుంది. చిన్నారులు మాత్రం పుస్తకాల సంచి భుజానికి తగిలించుకోవాల్సిన వయసులో... అమ్మనాన్నల చెయ్యి పట్టుకొని...గుడ్డల మూట సంకకు తగిలించుకొని...బిక్క మొహంతో తడబడే అడుగులతో ఊరుకాని ఊరుకు... ఇల్లుకాని ఇంటికి వెళుతుంటారు. పుస్తకాలు, స్నేహితులు, పాఠశాల పరిసరాలు, ఆటపాటలను పక్కకు నెట్టి... కలం పట్టుకోవాల్సిన చేతులతో కలుపు మొక్కలు తీస్తుంటారు. లేదంటే...ఏ కాకా హోటల్లోనో టీ కప్పులు అందిస్తూ... కలలను కన్నీళ్లు చేసుకొని, మోయలేని ఆశల బరువులను లేత భుజాలపై మోస్తుంటారు. పాత రోజుల్లో బళ్లోకెళ్లే వయసొచ్చినా... బాల్యానికి చేటుండేది కాదు, ఆటపాటలకు లోటుండేది కాదు. 'కాలం నడుస్తున్నా పని చిక్కని చేతిలో/ పొట్ట కూడదీకుని/ ఆశల మూటల్ని బరువుగా మోస్తూ/ వలస బండి గడగడా కదిలిపోతుంది...' అంటాడో కవి. ఆ పిల్లాడికి తెలీదు...తాను వున్న ఊరిని, సొంత ఇంటిని వదిలేసి... వలసొచ్చానని. కాలం అంచుల మీద నిలబడి.. అలసిన వలస పక్షులు వీరు.
బాలకార్మిక చట్టం (1986) 14 ఏళ్ల లోపు బాలలతో పని చేయించరాదని నిర్దేశించింది. అయినా, దేశంలో ఎక్కడ చూసినా ముక్కుపచ్చలారకుండానే రెక్కలమ్ముకొనే అభాగ్యులు కోకొల్లలు. తాజాగా.. పనులు లేక, తినడానికి తిండి కరువై... కర్నూలు పశ్చిమ పల్లెలు వలస బాట పట్టాయి. పండుటాకులు, పసిపిల్లలను ఇంటి వద్ద వదిలి... కడుపు నింపుకొనే పనుల కోసం దారులు వెతుక్కుంటున్నారు. కూలి పనుల కోసం నగరాలకు, ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వలస వెళ్తారు. వారితో పాటు పిల్లలు కూడా బడిమాని తల్లిదండ్రుల వెంట నడుస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే నవంబర్‌లో 7,577 మంది విద్యార్థులు పాఠశాలలకు రావడం లేదని గుర్తించారు. ఇందులో ఆరు నుంచి 14 ఏళ్ల వయస్సు కలిగిన బాలబాలికలు ఉన్నారు. తల్లిదండ్రులతోపాటే 4-10వ తరగతి వరకు చదివే విద్యార్థులు వలస బండెక్కుతున్నారు. 'గాల్లో వేలాడే బతుకు దీపాలు/ ఎప్పుడారిపోతాయో తెలువదు' అంటాడో కవి. ఒక దైన్యం నుంచి మరొక దైన్యానికి నిరంతర పయనం వారిది. మరోవైపు భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నామని ప్రధాని మోడీ 'టెక్‌ సమ్మిట్‌'లో తన సందేశాన్ని వినిపించారు. కానీ నేటికీ దేశంలోని సగానికిపైగా పల్లెలకు 2జీ సౌకర్యం కూడా లేదు. వాస్తవాలిలా వుంటే...2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, ఆ దిశగా ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయని బాలల హక్కులను పర్యవేక్షిస్తున్న సంస్థలు చెబుతున్నాయి.
'బాలలు ఇంటికి ఆభరణాలు. భవిష్యత్‌ యుగానికి యజమానులు. గొప్ప తత్వవేత్తలు సహితం బాలల్లో బ్రహ్మాండం దర్శిస్తారు' అంటాడు బాలల తత్వవేత్త గిజూభాయి. అలాంటి బాలలు నేడు దైన్యంతో హైన్యంగా తమ అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాలతో ఊదరకొడుతున్నా...అవి అక్కరకు రావడంలేదు. ఉచితంగా లభ్యమయ్యే విద్యను, వ్యవసాయ భూములను, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. పేదలంతా ఎట్లా బతుకుతారో మాకవసరం లేదు. వాళ్లని పోషించాల్సిన బాధ్యతా మాకు లేదు... అని దబాయించే సంస్కృతీపరుల పక్షాన ప్రభుత్వాలు నిలుస్తున్నాయి. దీంతో... బతుకుదెరువు కోసం కుటుంబాలకు కుటుంబాలే వలస బాట పడుతున్నాయి. కళ్ళల్లో ఆశల్ని మొలిపించుకొని, గుండెలపై వలస ముద్రల్ని పొడిపించుకొని... ముళ్ళ దారుల్ని, మైలురాళ్ళను, మానవ నైజాలను వెక్కిరిస్తూ, ధిక్కరిస్తూ, దిగులు గుట్టల్ని మోసుకెళ్తున్న ఆ వలస పక్షులు తిరిగి సొంత గూటికి చేరాలి. మళ్లీ మళ్లీ ఇల్లు కదిలే పరిస్థితి రాకుండా వుండాలి. 'చదువు మనిషిని పూర్తి మానవుడిగా తీర్చిదిద్దుతుంది. చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది. రాత కచ్చితమైన మానవునిగా తీర్చిదిద్దుతుంది' అని 16వ శతాబ్దినాటి బ్రిటిష్‌ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్‌ బేకన్‌ అన్నాడు. సమాజంలో మనిషి తలరాతను మార్చేది చదువు మాత్రమే! ఆ చదువుకు బాల్యంలోనే బలమైన పునాదులు పడాలి. అప్పుడే చిన్నారులు దేశానికి భాగ్యవిధాతలు కాగలుగుతారు.