
ఇటాలో కాల్వినో అనే రచయిత 1957లో 'ద బారన్ ఇన్ ద ట్రీస్' అనే నవల రాశాడు. ఈ నవల లోని హీరో భూమిపై కాకుండా చెట్లపై నివాసం వుండాలనుకుంటాడు. ఈ నవల స్ఫూర్తితో స్టెఫానో బోరీ అనే ఆర్కిటెక్ట్ ఇటలీ లోని మిలాన్ నగరంలో 80,112 మీటర్ల ఎత్తులో...'బాస్కో వర్టికల్' పేరుతో రెండు టవర్లు నిర్మించాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ టవర్లలోని ప్రతి అంతస్తులో అడవిని తలపించేలా అనేక రకాల చెట్లు, మొక్కలు పెంచుతున్నారు. అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ అడవిలో దాదాపు 900 చెట్లు, 5 వేల మొక్కలు వున్నాయి. అంతేకాదు...దాదాపు 1600 రకాల పక్షులు, రకరకాల సీతాకోక చిలుకలకు నివాసంగా మారింది. వేసవిలోనూ ఈ టవర్స్ లోని గదులు చల్లగా వుంటాయి. ఎటుచూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా, పక్షుల కిలకిలారావాలతో ఉల్లాసంగా వుంటుంది. పర్యావరణ కాలుష్యానికి దూరంగా, స్వచ్ఛమైన గాలికి దగ్గరగా జీవిస్తున్నారు. ఈ టవర్స్‌లో నివసించేవారికి ఏసీ వాడకం కూడా తగ్గిపోయిందట. కొలంబియాలో ఎడిఫిసియో శాంటాలయా, చైనాలో క్యూయీ సిటీ ఫారెస్ట్ గార్డెన్‌లు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నిర్మించినవే. నేటి కాంక్రీట్ జంగిల్స్ మధ్య అవధులు లేని ఆకాశహర్మ్యాల నడుమ ఒక ట్రెండ్... మిద్దె తోట (టెర్రస్ గార్డెన్). పట్టణీకరణ పచ్చని ప్రకృతిని మింగేస్తున్న క్రమంలో మళ్లీ ప్రకృతితో మమేకం కావడానికి మిద్దె తోటలు ఒక ప్రేరణగా నిలిచాయి.
వాస్తవానికి మిద్దె తోటలు పెంచడమనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన విషయమేమీ కాదు. క్రీస్తుపూర్వం మెసపొటేమియా నాగరికత నాటికే ఈ పద్ధతి ఉందిట. భవనం అందంగా కనిపించడం కోసం రోమన్లు ముందు వైపు ఇంటి పైకప్పు ప్రత్యేకంగా కట్టించి, దాని మీద మొక్కలు పెంచి... పూల తీగెలు కిందికి వేలాడేలా చేసేవారట. రోమ్, ఈజిప్టు లాంటి చోట్ల పురావస్తు తవ్వకాల్లో బయటపడిన పలు భవనాల్లో ఇలాంటి పైకప్పు తోటలు కనిపించినట్లు చరిత్ర చెబుతోంది. పురాతన ప్రపంచానికి చెందిన ఏడు వింతల్లో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ కూడా ఎత్తైన భవనాల మీద పెంచిన తోటలే. 'ప్రకృతితో కలిసి నడిచే ప్రతి అడుగులో...మనం కోరుకున్నదానికంటే చాలా ఎక్కువే పొందుతాం' అనేది ఒక సామెత. 'ప్రకృతిని మనం రక్షిస్తే... మనల్ని ప్రకృతి రక్షిస్తుంది' అంటారు. మట్టి లేనిదే మానవ మనుగడ లేదు. మట్టి నుంచి దూరమై సిమెంట్ రోడ్లపైన నడుస్తూ, కాంక్రీట్ జంగిల్ మధ్య నివసిస్తూ స్వచ్ఛమైన ప్రకృతి శోభను ఆస్వాదించలేకపోతున్న మనిషికి మిద్దె తోటలు ఒకింత ఊరటనిచ్చాయి. మళ్లీ మట్టితో అనుబంధాన్ని పెంచుతున్నాయి. పట్టణాలలో గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గిస్తాయి. పక్షులు, తేనెటీగలు, ఇతర పరాగ సంపర్కాలకు ఆవాసాలుగా మారడంతో పాటు జీవవైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సేంద్రియ పద్ధతిలో పెరటితోట, మిద్దె తోటల్లో ఆకుకూరలు, కాయగూరలు, పూలు, పండ్లు సైతం పండిస్తున్నారు.
ఇప్పుడు మిద్దె తోట అనేది ఆరోగ్యంలో భాగమైంది. 'మిద్దెతోట ఆరోగ్యానికి పూలబాట' అంటున్నారు మిద్దెతోటలను సాగు చేస్తున్నవారు. ఎండలు తగ్గి, వర్షాలు పడుతున్నాయి. మిద్దె తోట సాగుకు అనువైన సమయం ఇది. రసాయనాలతో పండించిన కూరగాయలు తినడం కన్నా సహజసిద్ధంగా పండించుకుని తినడంలో గల సంతృప్తి, ఆరోగ్యం వర్ణనాతీతం. రసాయనిక ఎరువుల వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోగల్గుతున్నారు. అదీగాక మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు...మిద్దె తోటల వల్ల భవనాల పైకప్పు జీవిత కాలం కూడా పెరుగుతుందని, ఎంతటి వేసవిలోనైనా ఇంటి లోపల చల్లగా వుంటుందని నిపుణులు చెబుతున్నారు. మిద్దెతోటల పెంపకంతో శరీరానికి మంచి వ్యాయామం, ఆర్థిక వెసులుబాటు... అన్నిటికంటే ముఖ్యంగా మానసిక సంతృప్తి పొందగల్గుతున్నారు. పట్టణీకరణ యొక్క ప్రతికూల ప్రభావాలను, మిద్దెతోటలు సానుకూలపరుస్తూ... ప్రకృతితో మమేకం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది. 'వృక్షో రక్షతి రక్షిత:' అన్నారు. మనిషి ప్రకృతితో మమేకమై వృద్ధి చెందగల పచ్చని ప్రదేశాలుగా మిద్దెతోటలను మార్చుకుందాం.