
ఆత్మవిశ్వాసం మనిషిలో అద్భుతమైన ఉత్తేజాన్ని నింపుతుంది. అపజయాలు ఎదురైనా...ఎదురుదెబ్బలు తగిలినా-ఆత్మవిశ్వాసమున్న వారు, తమపై తమకు నమ్మకమున్నవారు తొణకరు, బెణకరు. అపజయాలను తట్టుకుని, అడ్డంకులను దాటుకుని ముందుకు సాగిపోతూనే వుంటారు. మనిషికి జీవితం పోరాటాన్ని నేర్పుతుంది. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుని వరకూ నిత్యం జీవితంతో పోరాటం చేస్తూనే వుంటాడు మనిషి. 'ఏదీ తనంత తానై నీ దరికి రాదు/ శోధించి సాధించాలి... అదియే ధీరగుణం' అంటాడు మహాకవి శ్రీశ్రీ. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినప్పుడే అనుకున్నది సాధించగలుగుతారు. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ కీలకం. ఈ దశలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే వుంటుంది. అప్పుడే వారు తమ జీవితాలను అందమైన దృశ్యకావ్యంగా మలచుకోగలుగుతారు. 'జీవితం నవనీతం పాత్ర మీద/ చెదరిపడనీకు రాయినీ రప్పనీ/ పగులుతుంది స్వప్నం/ రగులుతుందీ దు:ఖం/ అందుకే/ బ్రతుకు ఉలిపిరి కాగితం చందం' అంటాడు తిలక్. ఆత్మస్థైర్యంతో సమస్యలను ఎదుర్కోగలిగే మనోవికాసాన్ని పిల్లలకు అందించడంలో నేటి విద్యావ్యవస్థ విఫలమైంది.
కార్పొరేట్ చదువుల పుణ్యమాని విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ర్యాంకులు, జీపిఎ అంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎవరు నిర్దేశించుకున్న లక్ష్యాలను వారు చేరుకోడానికి ప్రత్యేక శ్రద్ధ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ కార్పొరేట్ చదువులు విద్యార్థులకు కత్తి మీద సాములా తయారయ్యాయి. తాము పెట్టుకున్న ఆశలను పిల్లలు నెరవేరుస్తారో లేదోననే తల్లిదండ్రుల అత్యాశ... పిల్లల పాలిట యమపాశంగా మారుతోందని, ర్యాంకుల కోసం కాలేజీ యాజమాన్యాల అతి క్రమశిక్షణ విద్యార్థుల్లో విరక్తి భావాన్ని కలిగిస్తున్నాయని విద్యారంగ నిపుణుల అభిప్రాయం. దానికి తాజా నిదర్శనమే... రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల తర్వాత 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. తిలాపాలం తలా పిడికెడు అన్నట్టుగా... రాష్ట్రంలో నూతనంగా ఎన్‌ఎస్‌ఈపి అమలు పేరుతో 292 హైస్కూళ్లలో, 131 కేజీబివిల్లో ఆగమేఘాల మీద ఇంటర్మీడియెట్ ప్రారంభించారు. ప్రారంభించిన వాటిలో తరగతి గదుల్లేక, పుస్తకాలు లేక విద్యార్ధులు అవస్థలు పడ్డారు. చివరికి పాఠాలు చెప్పే టీచర్లను సైతం నియమించకుండా...హైస్కూల్ టీచర్లతోనే పాఠాలు చెప్పించడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణం. 'విద్యాసంస్థల విధివిధానాలు సరిగ్గా లేవని, దీంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, వారి కుటుంబ సభ్యులకు పుట్టెడు దు:ఖాన్ని మిగులుస్తున్నారని సాక్షాత్తూ...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి విద్యార్ధీ ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని మెరుగు పర్చుకుంటూ...సవాళ్లను అధిగమించాలి. కఠోర శ్రమతో తమ లక్ష్యాలను చేరుకోవాలి. క్షణికావేశంతో... సమస్యలను ఎదుర్కోలేని మానసిక బలహీనతకు లోనైతే... జీవితం అంధకారమౌతుంది. ఆత్మహత్య ప్రతిదీ విషాదమే. ఒక్క క్షణం ఆలోచిస్తే... చనిపోయి సాధించేదేమీ లేదని అర్థమవుతుంది. సమస్యకు పరిష్కారం తెగించి పోరాడటంలోనే వుందని విదితమవుతుంది. 'పట్టుదల, తెగింపు వుంటే, జీవితాన్ని పూలబాటగా మార్చుకోగలరు' అంటాడు ప్రముఖ రచయిత బుచ్చిబాబు. విద్యార్థులు పరీక్షలను ఒక సవాలుగా స్వీకరించాలి. విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి. అందమైన భవిష్యత్తుకు చదువు ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మెట్లను విజయవంతంగా అధిరోహించేందుకు కృషి చేస్తేనే విజయం వరిస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులు, స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు... తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య ర్యాంకులు సాధించే పద్ధతిలో కాకుండా, వారు ఇష్టపడి చదివే వాతావరణాన్ని కల్పించాలి. ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలు విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతున్నాయని, వారి కుటుంబాల్లో చీకట్లను నింపుతున్నాయనే వాస్తవాన్ని గుర్తించాలి. 'ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో/ ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో/ ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో/ ...ఆ స్వేచ్ఛా స్వర్గానికి/ తండ్రీ...నా దేశాన్ని మేల్కొలుపు' అంటాడు విశ్వకవీంద్రుడు. అలా స్వేచ్ఛగా జ్ఞానం వెల్లివిరిసిన చోటనే విద్యాకుసుమాలు నిర్భయంగా... స్వేచ్ఛగా తలెత్తి తిరుగుతాయి.