Jul 20,2023 06:35

అధికార, ప్రతిపక్ష పార్టీలు మంగళవారం నాడు విడివిడిగా జరిపిన సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బిజెపి దుష్ట పాలనను అంతమొందించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కాగా, ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా తొమ్మిదేళ్లుగా మరచిపోయిన ఎన్‌డిఎ పార్టీలతో పాలక బిజెపి హడావిడిగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. కేవలం ఎన్నికల దృష్టితోనే కాకుండా దేశ భవిష్యత్తుకు కూడా ఈ రెండు సమావేశాలు ఎంతో కీలకమైనవి! ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు దేశ ప్రజలకు కొత్తేమీకాదు. బెంగళూరు తరహా సమావేశం ఇంతకుముందు పాట్నాలో జరిగింది. దాని కొనసాగింపుగానే తాజా సమావేశం జరిగింది. రానున్న రోజుల్లోనూ మరికొన్ని సమావేశాలు ఉంటాయని, వాటిలోనే తమ కార్యాచరణను వెల్లడిస్తామని ప్రతిపక్ష నేతలు ప్రకటించారు. అయితే, గత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాలన్నింటిని కట్టగట్టి ఓడించడానికి తానొక్కడినే చాలంటూ ఛాతీ విరుచుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకస్మికంగా ఎన్‌డిఎ పల్లవిని ఎత్తుకోవడమే అనూహ్యం! నిజానికి గుజరాత్‌లో మినహా గత మూడేళ్లలో వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరీ ముఖ్యంగా హిమాచల్‌, కర్ణాటక ఫలితాలు బిజెపికి వణుకు పుటించాయి. ఆ తరువాత 26 ప్రతిపక్ష పార్టీలు ఏకం కావడం బిజెపి నేతలను బెంబేలెత్తిస్తున్నాయనడానికి ఈ హఠాత్తు సమావేశమే ఒక నిదర్శనం. హిందుత్వ నినాదంతో దేశ ప్రజలను చీల్చాలన్న ఎత్తుగడ ఎల్లకాలం సాగదని స్పష్టమౌతోంది. ప్రతిపక్షాల సమావేశానికి 26 పార్టీలు హాజరుకాగా, తాము నిర్వహించిన సమావేశానికి 38 పార్టీలు హాజరయ్యాయని బిజెపి గొప్పగా చెప్పుకుంటోంది. నిజానికి ఈ 38 పార్టీలలో రెండింటికి మాత్రమే పార్లమెంటులో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాతినిధ్యం ఉంది. 24 పార్టీలకు ప్రాతినిధ్యం లేదు. మిగిలిన వాటికి ఎన్నికల సంఘం గుర్తింపే లేదు. ఆ పార్టీల్లో కూడా చాలావరకు ఇడి, సిబిఐ, ఐటి, ఎన్‌ఐఎ దాడులకు భయపడి వచ్చి చేరినవే!
ప్రతిపక్షాల సమావేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి వంటి అంశాలు చర్చకు వచ్చాయి. తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో ప్రజల హక్కులపైనా, జీవనోపాధిపైనా, స్వేచ్ఛపైనా, సౌభ్రాతృత్వంపైనా జరిగిన భయానక దాడిని విపక్ష నేతలు చర్చించారు. వీటిని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయెన్స్‌ (ఐఎన్‌డిఐఎ-ఇండియా)ను ప్రకటించారు. ఈ దిశలో మరింత విస్తృత కార్యాచరణను రూపొందించడమే లక్ష్యంగా త్వరలో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు. భేటీ అనంతరం నాయకులు చేసిన ప్రకటనలు కూడా ఈ స్ఫూర్తినే కనపరిచాయి. ప్రధాని పదవి పట్ల కాంగ్రెస్‌కు ఎటువంటి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించడం, మిగిలిన పార్టీల నాయకులు కూడా ఇదే వైఖరి అవలంభించడం ఆహ్వానించదగిన పరిణామం. ప్రతిపక్షాల మధ్య వ్యక్తమైన ఇటువంటి ఐక్యతే గతంలో ఒకసారి బిజెపి ప్రభుత్వాన్ని అధికారం నుండి దించగలిగింది. ఎన్నికల సమరంలో రాష్ట్రాల పరిధిలో ఎక్కడికక్కడ సహకరించుకోవడం ద్వారా బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్న ఏకాభిప్రాయానికి విపక్ష పార్టీలు వచ్చాయి. బిజెపి నిర్వహించిన ఎన్‌డిఎ సమావేశం దీనికి భిన్నంగా నరేంద్రమోడీ చుట్టూ తిరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ఊసే ఈ సమావేశంలో కనిపించలేదు. మోడీ ఉపన్యాసం ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడానికే పరిమితమైంది. తొమ్మిదేళ్ళ కాలంలో ఎన్‌డిఎ లోని వివిధ పార్టీలను నిట్టనిలువునా ఎందుకు చీల్చారో, ఇన్నేళ్ల పాటు ఒక్కసారి కూడా సమావేశం ఎందుకు నిర్వహించలేదో అన్న అంశాలపై కూడా ఆయన మిత్రపక్షాలకు వివరణ ఇవ్వలేదు. అయినా, ఆ సమావేశానికి చిన్నా చితక పార్టీలు హాజరయ్యాయంటే, ఒకటో, రెండో సీట్లు గెలవొచ్చనే ఆశ! రానున్న రోజుల్లో ఆ నమ్మకం కూడా పోదన్న గ్యారంటీ లేదు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సమావేశానికి రాష్ట్రం నుండి జనసేన వెళ్లడం ఆ పార్టీతో పాటు, రాష్ట్రానికీ హాని కలిగించే చర్యే. ఈ పరిణామం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్షం టిడిపిలు బిజెపికి వంత పాడుతూనే ఉన్నాయి. కామన్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో మరోసారి మతోన్మాద ఎజెండాను దేశం మీద రుద్దాలని బిజెపి ప్రయత్నిస్తున్న ప్రస్తుత సమయంలోనైనా ఆ పార్టీలు తమ వైఖరేమిటో స్పష్టం చేయాలి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బిజెపిని బలపరుస్తూ తాము లౌకిక వాదులమని చెప్పుకునే అర్హత ఏ పార్టీకి ఉండదు.