
ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : ఆదివాసీ, గిరిజన సంఘాల సంయుక్తంగా ఆగసు 3న మన్యం బంద్‌కు పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా ఆదివాసి జేఏసీ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో జేఏసీ కన్వీనర్ వంతు బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజన సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా ఆగస్టు 3న బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మణిపూర్‌లో ఇటీవల జరిగిన మారణ హౌమం ఆపాలని, బీరెన్ సింగ్ ప్రభుత్వం రద్దు చేయాలని, అటవీ హక్కుల చట్టం యధావిధిగా అమలు చేయాలని, గిరిజన సాగులో ఉన్న కొండపోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలు పరిష్కరించాలని, జీవో నెంబర్ 3 అమలు పటిష్టంగా అమలు చేయాలని తదితర అంశాలపై మన్యం బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్‌కు సహకరించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జెఏసీ నాయకులు గంప నాగరాజు, ఈ.శ్రీను, తెడ్ల.రాంబాబు, ఈరే.రాజబాబు, బి.రామకృష్ణ, వజ్రపు అప్పారావు, తాము సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.