Jul 08,2023 06:25

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్తర భారతావనిలో దిగ్భ్రాంతికరమైన, జుగుప్సాకరమైన దారుణాలు నిత్యకృత్యంగా మారాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేకించి దళితులను, గిరిజనులను, మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని సంఘ్ పరివార్‌ గూండాలు అత్యంత దారుణాలకు ఒడిగడుతున్నారు. రెండు రోజుల కిందట మధ్యప్రదేశ్‌లో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. కష్టపడి పనిచేసినందుకు కూలి డబ్బులు అడిగిన నేరానికి ఒక ఆదివాసీ యువకుడి ముఖంపై ప్రవేశ్‌ శుక్లా అనే సంఘ్ పరివార్‌ దుండగుడు మూత్రం పోసి అవమానించాడు. సిద్ధికి జిల్లాకు చెందిన పెత్తందారు, బిజెపి ఎమ్మెల్యే కేదార్‌నాథ్‌ శుక్లాకు ఈ ప్రవేశ్‌ శుక్లా ముఖ్య అనుచరుడు. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తంకావడంతోనే జాతీయ భద్రత చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాల కింద దుండగుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ గుజరాత్‌ మారణకాండ, అత్యాచారాల కేసుల్లో దోషులను శిక్ష పూర్తికాకుండానే విడుదల చేసి సన్మానాలు చేసిన దుర్మార్గుల పాలనలో ఈ దుండగులకు శిక్ష పడుంతుందన్న గ్యారెంటీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుందనే ప్రవేశ్‌ శుక్లాపై కేసు నమోదు చేశారే తప్ప.. బడుగులపై దాష్టీకాలను అడ్డుకోవాలనే చిత్తశుద్ధితో కాదన్నది జగమెరిగిన సత్యం. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ గురువారం బాధిత గిరిజన యువకుడి కాళ్లు కడిగి నాటకాన్ని మరింత రక్తికట్టించింది కూడా ఇందుకే. జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం..దేశంలో షెడ్యూల్డ్‌ తెగలపై అత్యధిక అఘాయిత్యాలు జరుగుతున్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌. ఇదే రాష్ట్రంలో నెలరోజుల కిందట అంటరానితనం అమానుషం అని బోధించాల్సిన ఉపాధ్యాయుడే పాఠశాలలోని కుండలో నీళ్లు తాగిన దళిత బాలుడిని చితకబాది హత్య చేశాడు. సంఘ్ పరివార్‌ క్రూరత్వాన్ని చాటే ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. అక్రమ కేసుల బనాయింపుతో మధ్యప్రదేశ్‌ జైళ్లలో మగ్గుతున్నవారిలో 58 శాతం మంది దళితులే. పెత్తందారీ దుండగులు ఎంతటి తీవ్రమైన నేరాలకు పాల్పడినా..శిక్షలు పడిన దాఖలాలు చాలా అరుదనే చెప్పాలి. మధ్యప్రదేశ్‌ ఒక్కటే కాదు..ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ ఇలా బిజెపి పాలిత ప్రతి రాష్ట్రంలోనూ పెత్తందారీ సామాజిక తరగతులదే రాజ్యం. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటీవల కాలంలో దళితులపై పెత్తందార్ల దాడులు పెరిగిపోతున్నాయి. కేంద్రం తీసుకొస్తున్న వినాశకర సంస్కరణలకు జీ హూజూర్‌ అంటున్న ఇక్కడి వైసిపి ప్రభుత్వం దళితులు, గిరిజనులపై దాడుల విషయంలోనూ అదే తీరును అనుసరిస్తుండటం సిగ్గుచేటు.
భారత రాజ్యాంగాన్ని, దాని విలువలను కాపాడుతూ సబ్‌ కా సాత్‌..సబ్‌ కా వికాస్‌ అంటూ అందరి బాగోగులకు కోసం బిజెపి ప్రభుత్వం పరితపిస్తోందంటూ విదేశీ పర్యటనల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్పలు చెబుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎన్ని అఘాయిత్యాలు జరిగిపోతున్నా..నోరు మెదపరు. చట్టసభల్లో నిలదీసి అడిగినా..మౌనముద్ర వీడరు. 2017లో రామ్‌నాథ్‌ కోవింద్‌ను, 2022లో ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసి దళితులకు, గిరిజనులకు పట్టాభిషేకం చేశామంటూ ఎన్నికల్లో ప్రచార జిమ్మిక్కులకు పాల్పడుతున్న బిజెపి క్షేత్రస్థాయిలో అదే దళితులు, గిరిజనులపై క్రూర దాడులకు తెగబడుతోంది. పార్లమెంటు నూతన భవనాన్ని ఘనంగా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనుస్మృతి సామాజిక దొంతరలో గిరిజనులు అట్టుడుగునున్నందునే ఆ కార్యక్రమానికి దేశ ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా అవమానించారన్న విమర్శలు కాదనలేనివి.
సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర మౌలిక లక్షణాలతో సమ సమాజ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి..ఆ స్థానంలో మనువాద ఉన్మాద స్మృతిని తీసుకురావాలని బిజెపి ఒక పథకం ప్రకారం యత్నిస్తోంది. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు, కేంద్ర సంస్థలు, శాస్త్ర, పరిశోధనా సంస్థల్లో పాలక మండళ్లను సంఘ్ పరివారంతో నింపేశారు. శాస్త్ర పరిశోధనలకు అందజేసే అవార్డులను నిలిపేశారు. విజ్ఞాన శాస్త్రాలను నిషేధించేందుకూ వెనుకాడబోరు. ఇప్పటికే డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యాంశం నుంచి తొలగించారు. సంఘ్ పరివారాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తూ దళిత, ఆదివాసీ యువతపై కేంద్రీకరించి వారిలో బూజుపట్టిన మనువాద భావాలను నింపుతున్నారు. అణగారిన ప్రజల మధ్య చిచ్చు రాజేసి వారిపై వారినే ఉసిగొల్పే అత్యంత దారుణమైన కుట్రలను సంఫ్‌ు పరివార్‌ కొనసాగిస్తోంది. మణిపూర్‌లో హింసాకాండకు కూడా ఈ విచ్ఛిన్నకర ఎజెండాయే కారణం. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి ఇటు జాతి వనరులను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టే వినాశకర విధానాలను అవలంబిస్తున్న బిజెపిని, దాని విధానాలకు జీహుజూర్‌ అంటున్న పార్టీలకు తగిన శాస్తి చేస్తేనే దేశ ప్రజలకు మనుగడ.