
మంచు కురిసే వేళలో ప్రకృతి ప్రియులను ఉల్లాసపరిచే పొగమంచు సోయగాలు కనులకు విందు.. మనసుకు ఆహ్లాదం. ముత్యాలు రాలినట్లుగా పడే మంచు తుంపర్లు... గజగజ వణికించే చలి... వేడివేడిగా పొగలుగక్కుతున్న కాఫీ... మనసును ఉల్లాసపరుస్తుంది. ఈ అద్భుతమైన వాతావరణం కారణంగా ప్రతి ఒక్కరూ మెత్తగా హత్తుకునే గాలిలోని ఏదో ఒక అద్భుతాన్ని అనుభవిస్తారు. తక్కువ ఉష్ణోగ్రతలు, గాలిలో కలిసి చల్లగా తాకే మంచు, మంచు కురుస్తున్న వాతావరణంతో శీతాకాలం ప్రకృతి మత్తుగా... నిద్రపోతున్నట్టుగా వుంటుంది. సూర్యుడు సైతం చురుకుగా వుండడు. కప్పేస్తున్న మంచుగాలులను చీల్చుకొని అప్పుడప్పుడు బయటకు తొంగిచూస్తుంటాడు. అందుకే అంటాడో కవి... 'శీతాకాలం సూర్యుడిలాగా... కొంచెం కొంచెం చూస్తావే' అని. రోజులు చల్లగా వుంటాయి. అందుకేనేమో ఎక్కువమంది శీతాకాలాన్ని ఇష్టపడతారు. 'ఎంతో రసికుడు దేవుడు... ఎన్ని పువ్వు లెన్ని రంగు లెన్ని సొగసులిచ్చాడు... అన్నిటిలో నిన్నే చూడమన్నాడు' అంటాడో సినీ కవి. ఈ కాలంలో ప్రకృతి కూడా కొత్త సొబగులతో... సరికొత్త అందంతో వెండివెలుగులతో నిండి వుంటుంది. ఈ కాలాన్ని ఇష్టపడే పువ్వులు, చెట్లు చాలానే వుంటాయి. మంచుతో కప్పబడి కూడా కనువిందు చేస్తుంటాయి.
ఈ కాలంలో హిమాలయ పర్వత ప్రాంతాలే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేస్తుంది. మంచు కప్పిన హిమాలయాలు పోతపోసిన వెండికొండల్లా అందమైన చిత్రం గీసినట్లు కనిపిస్తుంటాయి. ఆ దృశ్యాన్ని మంచువానలో తడుస్తూ... భూలోక స్వర్గాన్ని ఆస్వాదిస్తూ... కనులారా చూసి, మనసారా తరించమని ప్రకృతి ఆహ్వానిస్తుంటుంది. ఈ సమయంలో మన ఏజెన్సీ ప్రాంతంలోని వంజంగి, లంబసింగి, చింతపల్లి, పాడేరు, అరకు ప్రాంతాలు పర్యాటకులతో పోటెత్తుతాయి. సూర్యోదయ వేళ మంచు అందాలను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే పర్యాటకులు తరలివస్తారు. ఈ సమయంలో పొగమంచులో బందీ అయిన ప్రకృతి మరింత అందంగా... రమణీయంగా దర్శనమిస్తుంది. పదునెక్కే ఉషోదయ కిరణాలు... చురుక్కుమనిపించే శీతలగాలులు... ప్రియురాలి పంటిగాటులోని మధురిమలా గమ్మత్తుగా వుంటాయి. అలాగే ప్రకృతిలోనైనా, జీవితాల్లోనైనా వైరుధ్యాలు నిరంతరంగాను... సమాంతరంగానూ సాగిపోతుంటాయి. ఇంత చలిలోనూ క్రిస్మస్ జరుపుకొని, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న ఉత్సాహం ఒకవైపు, పెరుగుతున్న చలిగాలుల తీవ్రత మరోవైపు సాగుతూనే వుంటాయి.
'జ్వలన శిఖిశిఖా సముదయమ్ము నెత్తి, బెబ్బులినివోలె దూకు' చలిని, మంటలతో ఎదుర్కొంటుండగా 'చూపులకు నక్కి వెన్నుపోటు పొడిచె చలి ప్రజాతతిన్' అంటారు బులుసు వెంకటేశ్వర్లు. చలికి తట్టుకోలేక నెగళ్లు వెలిగించినప్పుడు మంటకు ఎదురుగా ఉన్న శరీరభాగం వెచ్చబడుతుంది. అయితే, చలి వెనుక నుంచి దాడి చేస్తుంది. అలాగే, వాతావరణ మార్పులతో భారత్‌లో ఇప్పటికే తీవ్ర ఎండలు, కుండపోత వానలు అధికమయ్యాయి. చలి సైతం పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో వడగాడ్పుల ప్రతాపం మరింత విజంభిస్తుందని ప్రపంచబ్యాంకు నివేదిక తాజాగా హెచ్చరించింది. కాలుష్యంతో పర్యావరణం దెబ్బ తిని... కాలచక్రం గతులు తప్పుతోంది. మంచు కాలంలో విపరీతంగా మంచుకురవడం.. వర్షాకాలంలో అధిక వర్షాలు పడటం.. ఎండాకాలంలో ఎక్కువ ఎండలు కాయటం దీని ప్రభావమే. అందులో భాగంగానే ప్రస్తుతం అధిక చలి, ఎక్కువ మంచు. ఇది ఎంత ఆహ్లాదకరంగా వుంటుందో, ఎంత ఉల్లాసాన్నిస్తుందో... అంతే ప్రమాదకరమైనది కూడా. అమెరికాలో మంచు విపరీతంగా కురియడం, చలిగాలులు ఉధృతం కావడంతో 12 రాష్ట్రాల్లో అత్యయిక స్థితిని ప్రకటించారు. రుతువుల వర్ణనలు చూడటానికి, వినడానికి ఎంత బావుంటాయో... అనుభవం మాత్రం కొన్ని సందర్భాల్లో అంతకంటే దుర్భరంగా వుంటుంది. 'ప్రక్కలు వంచు, వంచి ముని పండ్లను పండ్లను రాచు... క్రమంగా తలను కాళ్ల సందులోకి దూర్చేలా చేస్తుంది' అంటూ వల్లభరాయ కవి క్రీడాభిరామంలో చెప్పిన సత్యం... వృద్ధులకే కాదు... చలి, మంచు అంటే వణికిపోయేవారికీ అనుభవమే. ఏ కాలంలో అయినా మంచి చెడులు వుంటాయి. సమయా సమయాలను బట్టి ఆయా కాలాలను ఆస్వాదించాలి... ఆనందించాలి. అదే సమయంలో ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు, తమ శరీరానికి చలి, మంచు పడనివారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త!!