
ఆకలి...ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను కాటేస్తున్న కాలసర్పం. పోషకాహార లోపం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి. ఇది కోట్లాది మంది పిల్లలపై ప్రభావం చూపుతోంది. జీవితాలను నిశ్శబ్దంగా హరించివేస్తున్న మహమ్మారి. 'దురంత దు:ఖకర ఆకలి బాధ వర్ణింప అశక్యమే' అన్నారు. 'ఆకలి కష్టము మిక్కిలి ఎక్కువ' అని చిలకమర్తి వారు చెప్పినా, 'ఆకొన్న కూడె అమతము' అంటూ సుమతీ శతకకర్త చాటినా-సారాంశమొకటే. ఆకలి రుచి ఎరుగదన్నట్లుగా...కడుపులో పేగులు నకనకలాడుతున్న వాడికి అంబలి పోసినా... అమృతంలా ఆవురావురుమంటూ ఆరగిస్తాడు. అది కడుపు నిండినా... శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను మాత్రం ఇవ్వలేదు. 'పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం... మానవత్వం, న్యాయం, సమానత్వం కోసం జరిగే పోరాటం' అంటారు ఐరాస పూర్వ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్. సైన్సు, సాంకేతికత విజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పటికీ... పోషకాహార లోపం సమాజ పురోగతికి ఆటంకంగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడవేస్తున్నది.
పోషకాహార లోపం అనేది కోట్లాది మంది వ్యక్తులను, అభివృద్ధి చెందుతున్న దేశాలలో, వారి ఎదుగుదలకు, అభివృద్ధికి, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తోన్న ప్రపంచ సంక్షోభం. ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది ప్రజలకు గతేడాది ఆహారం నిరంతరంగా లభించలేదని ఐరాస తెలిపింది. 78.3 కోట్ల మంది ప్రజలు ఆకలి బాధను ఎదుర్కొన్నారని, 14.8 కోట్ల మంది చిన్నారులు పోషకాహార లోపంతో ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2023లో అంతర్జాతీయ ఆహార భద్రత, పోషకాహారంపై ఐరాసకి చెందిన ఐదు సంస్థలు ఒక నివేదికను విడుదల చేశాయి. 2021లో ప్రపంచ జనాభాలో 42 శాతం మంది అంటే 310 కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభించలేదని ఆ నివేదిక పేర్కొంది. తాజా పరిశోధన ప్రకారం 2022లో తీవ్రంగా పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య సగటున 73.5 కోట్లుగా వుంది. '2022-స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్' రిపోర్ట్ ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది జనాభా తీవ్ర ఆకలి కోరలలో చిక్కుకున్నారు. ప్రతి సంవత్సరం 190 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో 46.2 కోట్ల మంది పిల్లలు. ఈ పోషకాహార సమస్య భారత్‌లోనూ ఆందోళనకర సమస్యగా మారింది. దీనిపై తక్షణ శ్రద్ధ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 'పోషకాహార లోపం కేవలం ఆరోగ్య సంక్షోభం కాదు... ఇది ఆర్థిక సంక్షోభం. ఆర్థికవృద్ధిని అణిచివేస్తుంది, కార్మిక ఉత్పాదకతను తగ్గిస్తుంది. పేదరిక ఉచ్చులను శాశ్వతం చేస్తుంది' అంటారు బ్రిటిష్ ఆర్థికవేత్త లారెన్స్ హడిద్.
ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలంటే... పౌష్టికాహారం అవసరం. పోషకాహార లోపం మానవ ఆరోగ్యం, అభివృద్ధి, సామాజిక పురోగతికి ఒక సవాలుగా మారింది. పేదరికం, ఆహార భద్రత, ప్రజారోగ్యం వంటి సంక్లిష్టమైన అంశాలతో ముడిపడి వున్నందున పోషకాహార లోపాన్ని ఎదుర్కోడానికి చేసే ప్రయత్నాలు... విస్తృతమైన అభివృద్ధి ఎజెండాగా మార్చాలి. 'పోషకాహారం కోసం పెట్టే పెట్టుబడి... మానవ సామర్థ్యాన్ని వెలికితీస్తుంది. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి వైపు నడిపిస్తుంది' అని భారతీయ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అంటే, 'పౌష్టికాహార లోపానికి వ్యతిరేకంగా పోరాటం అంటే, కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు... ఇది ఆర్థిక అవసరం' అంటారు కోఫీ అన్నన్. ఇది ప్రపంచ సమస్యే అయినప్పటికీ... పోషకాహార లోపం వున్న జనాభాలో దాదాపు సగం భారత్‌లోనే వుంది. దేశంలోని 20 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే... పేదరికం, అసమానతలను తగ్గించాలి. ఆహార భద్రతను కల్పించాలి. మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా- 'మాట చేతగా మారి/ మనిషి మనిషితో చేరి/ స్వప్నం సత్యం ఐతేనే/ స్వర్గం'. ఆకలి రోగాన్ని, పోషకాహార లోపాన్ని అరికట్టడమంటే... సమాజం, వ్యక్తులు ఆరోగ్యవంతమైన జీవితాలను గడపడానికి, అభివృద్ధి పథం వైపు నడవడానికి భరోసానివ్వడమే.