Aug 17,2023 06:38

1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి భారత దేశం స్వాతంత్య్రం పొందినట్లు ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు ...దేశ విభజనను గుర్తు చేస్తూ అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్ల సాక్షిగా పుట్టిన దేశంలో నేడు అధికారంలో ఉన్న వారి నాయకత్వంలో అల్లర్లు జరుగుతున్నాయి.
సామాజిక ఐక్యతను విచ్ఛిన్నం చేసి విభజనకు నాంది పలికేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో దేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగమైన కోట్లాది మంది దేశభక్తులు భారత ప్రజలందరికి కొత్త, మెరుగైన జీవితం లభిస్తుందని ఆశపడ్డారు. పేదరికం, దోపిడీ లేని భారతదేశంలో మతతత్వం, మత విద్వేషం, కులతత్వం వంటి సాంఘిక దురాచారాలు నిర్మూలించబడతాయని, ప్రజాస్వామ్య హక్కులు విస్తరించబడతాయని కూడా వారు కలలు కన్నారు. అయితే స్వాతంత్య్ర పోరాటానికి సహకరించని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని బిజెపి పాలనలో...స్వాతంత్య్ర పోరాటం ద్వారా వృద్ధి చేసుకున్న ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాన్య ప్రజల శ్రేయస్సు, సామ్రాజ్యవాద వ్యతిరేకత వంటి విలువలన్నీ నేడు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కార్పొరేట్‌ ప్రయోజనాలను మాత్రమే పరిరక్షించే నిరంకుశ హిందూ రాష్ట్రాన్ని స్థాపించడమే బిజెపి లక్ష్యం. నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థను, లౌకిక సంప్రదాయాన్ని నిలబెట్టే రాజ్యాంగాన్నే తిరగరాసే ఎత్తుగడ జరుగుతోంది. బహుళ త్వం, సహనంతో నిండిన భారతీయ సంస్కృతి దాడికి గురవు తోంది. మతం ఆధారంగా పౌరసత్వాన్ని ఇచ్చేలా పౌరసత్వ సవరణ చట్టం, ఏకరూప పౌర స్మృతిని ప్రవేశపెట్టే చర్యలు చేపడుతోంది. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర హోదా రద్దు చేయబడింది. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది.
ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు ఉద్దేశపూర్వకంగానే మతపరమైన అల్లర్లను సృష్టించి ప్రజలను విభజించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మతపరమైన, జాతిపరమైన అల్లర్లు అన్ని బిజెపి పాలిత రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్నాయి. స్వేచ్ఛాయుతమైన చర్చకు అనుమతి ఇవ్వకుండా, ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని సస్పెండ్‌ చేయడం, సాధారణ ప్రసంగాలను సైతం నిషేధించడం ద్వారా నియంతృత్వ తరహా పోకడలకు పోతున్నది. లోక్‌సభకు అవిశ్వాస తీర్మానంపై చర్చకు రావడానికి కూడా సిద్ధంగా లేని ప్రధాని నేడు మనకున్నారు. సుప్రీంకోర్టు తీర్పులను కొట్టివేయడానికి చర్చ లేకుండానే పార్లమెంటులో చట్టాలను ప్రవేశపెడుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆలస్యం చేస్తూ తనకు నచ్చని వ్యక్తులను న్యాయమూర్తులుగా నియమించడంలో మోడీ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఎన్నికల సంఘాన్ని అధికార పార్టీకి అనుకూలంగా నడిచే సంస్థగా మార్చారు. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఎన్‌ఐఏ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి సాధనాలుగా మార్చారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టేందుకు అవసరమైతే దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం భారతదేశం అనుసరించిన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మోడీ ప్రభుత్వం విడిచిపెట్టింది. భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదానికి జూనియర్‌ భాగస్వామిగా మారిపోయింది. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించేందుకు సన్యాసులను, అర్చకులను రప్పించి ప్రధాని రాజదండం అమర్చారు. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు మత మార్పిడులను, మతాంతర వివాహాలను నిషేధిస్తూ చట్టాలు తీసుకు వస్తున్నాయి. మూఢనమ్మకాలు, అపోహలకు ప్రాధాన్యతనిస్తూ, సైన్స్‌ను మినహాయించే విద్యా విధానం అమలు చేయబడుతున్నది.
బిజెపి ప్రభుత్వ ఆర్థిక విధానాలు ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్లకు మేలు చేసేలా వున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచవగ్గా కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయి. కార్పొరేట్లకు భారీ పన్ను మినహాయింపునిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, పేదరికం, అసమానతలు పెరిగిపోవడంతో మోడీకి అనుకూలమైన కార్పొరేట్ల సంపద అత్యంత వేగంగా రెట్టింపయింది.

  • బుల్డోజర్లతో మైనారిటీలపై వేట

భవనాల కూల్చివేతలకు నిబంధనలు ఉన్నాయని కోర్టులు తరచూ గుర్తు చేస్తుంటాయి. బుల్డోజర్‌ రాజ్‌పై ఇతర హైకోర్టులు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వినడం లేదు. ఆదిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌లో మొదలెట్టిన బుల్డోజర్‌ పద్ధతి అస్సాం, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌, గుజరాత్‌, మణిపూర్‌లకు విస్తరించింది.

  • మణిపూర్‌ రాజుకుంది బుల్డోజర్‌ రాజ్‌తోనే....

మణిపూర్‌లో వివాదాలు మొదలైంది బుల్డోజర్‌ రాజ్‌తోనే. 2023 ఫిబ్రవరి 24న, చురచంద్‌పూర్‌ లోని సాంగ్‌జాంగ్‌ గ్రామంలో అటవీ భూమిని ఆక్రమించారని 16 కుకి కుటుంబాల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇంట్లోని వస్తువులను తెచ్చుకోడానికి కూడా వీల్లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

  • మైనారిటీ ప్రాంతాలే టార్గెట్‌

బిజెపి ఢిల్లీలో బుల్డోజర్లతో మైనారిటీ ప్రాంతాలను టార్గెట్‌ చేసింది. హనుమాన్‌ జయంతి ఊరేగింపు సందర్భంగా మత ఉద్రిక్తత సృష్టించిన సంఘ్ పరివార్‌ జహంగీర్‌పురిలో భవనాలను నేలమట్టం చేసింది. పోలీసుల సహాయంతో కూల్చివేతను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అయితే కూల్చివేత గంటన్నర పాటు కొనసాగింది.

  • గుజరాత్‌లో ప్రార్థనా స్థలాల ధ్వసం

కచ్‌ ప్రాంతంలో ఆరు మదర్సాలు నేలమట్టమయ్యాయి. రామనవమి సందర్భంగా సంఘ్ పరివార్‌ సష్టించిన ఘర్షణల ముసుగులో హిమ్మత్‌నగర్‌, వడోదర, సకర్‌పురా తదితర ప్రాంతాల్లోని మైనారిటీల ఇళ్లను, సంస్థలను, ప్రార్థనా స్థలాలను బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లోని ఒక మసీదులో రామనవమి వేడుకల సందర్భంగా కాషాయ జెండాను ఎగురవేశారు. మసీదులో కాషాయ జెండాను కట్టడంతో ఘర్షణ చెలరేగింది. దీనికి సంబంధించిన 47 కేసుల్లో 177 మందిని అరెస్టు చేశారు. అనుమానితులుగా భావించి ముస్లింల 57 దుకాణాలు, ఇళ్లను పోలీసులు కూల్చివేశారు. రామనవమి ఘర్షణల ముసుగులో, సంఫ్‌ు పరివార్‌ అల్లర్ల తర్వాత ప్రభుత్వం బుల్డోజర్లను ఉపయోగించి 92 ముస్లింల భవనాలను కూల్చివేసింది.

  • బుల్డోజర్‌ బాబా

ఆదిత్యనాథ్‌ యూపీ ముఖ్యమంత్రి అయిన బుల్డోజర్‌ రాజ్‌ను ప్రారంభించారు. ఇది 2017-2021లో విస్తృతంగా వ్యాపించింది. 2022 ఎన్నికల్లో ఆదిత్యనాథ్‌ను బుల్డోజర్‌ బాబాగా అభివర్ణించారు. నేరగాళ్లను అణచివేస్తామని ప్రకటించినప్పటికీ...ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై మాత్రం బుల్డోజర్‌ ప్రయోగించారు.
బిజెపి అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ దూషణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను అణిచివేసేందుకు బుల్డోజర్లను ఉపయోగించారు. సహరాన్‌పూర్‌, కాన్పూర్‌లో జరిగిన నిరసనల్లో నిందితుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరేళ్లలో పెద్ద పెద్ద భవనాలు సహా దాదాపు 500 ఇళ్లు నేలమట్టమయ్యాయి.

  • అక్కడ దళితులకు ఆలయ ప్రవేశం లేదు

మధ్యప్రదేశ్‌లో, దళితులు శివరాత్రి నాడు దేవాలయాలలోకి ప్రవేశించకుండా నిషేధించారు. ఖర్గోన్‌ జిల్లాలోని చాప్రా గ్రామంలోని శివాలయంలోకి దళితులను రానీయకుండా అగ్రవర్ణాలకు చెందిన వారు అడ్డుకున్నారు.
సెమ్రా గ్రామంలోని రామజానకి ఆలయంలో నిర్వహించిన సామూహిక విందులో దళిత కుటుంబానికి ఆహారం నిరాకరించబడింది. వాస్తవానికి దళిత సంఘాలతో పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరి నుంచి విరాళాలు స్వీకరించి విందు నిర్వహించారు.
బిజెపి నాయకుడు ప్రవేశ్‌ శుక్లా సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో అతడిని అరెస్ట్‌ చేశారు.
జోధ్‌పూర్‌లో బోర్‌వెల్‌ నుండి నీరు తోడుకున్నందుకు నలభై ఆరేళ్ల కిషన్‌లాల్‌ భిల్‌ని కొట్టి చంపారు.

  • ప్రాణం పోయాకా... అవమానమే...

వడోదరలో, కుటుంబాన్ని బహిరంగ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించకుండా నిషేధించారు. కుల దూషణలకు పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రిన్సిపాల్‌ వాటర్‌ బాటిల్‌ లోంచి నీళ్లు తాగినందుకు ఓ విద్యార్థిని కొట్టారు. బిజ్నోర్‌ జిల్లాలోని చామన్‌దేవి ఇంటర్‌ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • మణిపూర్‌లో అల్లర్లకు అంతే లేదు

మణిపూర్‌లో బిజెపి చీలిక రాజకీయాల కారణంగా 100 రోజులు దాటినా అల్లర్లకు అంతు లేదు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు గానీ, ఈ అంశంపై కచ్చితమైన సమాధానం చెప్పేందుకు గానీ సిద్ధంగా లేరు. రిజర్వేషన్‌ సహా డిమాండ్ల ద్వారా మైతీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్న అరంబై తెంగ్‌కోల్‌, మైతీ లీపున్‌ వంటి అతివాద సంస్థలు అల్లర్లను ప్రారంభించాయి. భారీ సంఖ్యలో క్రైస్తవ చర్చిలు, సంస్థలు నాశనం చేయబడ్డాయి. రెండు వందల మందికి పైగా చనిపోయారు. 60,000 మందికి పైగా పారిపోయారు. మణిపూర్‌ మహిళలు ఏ క్షణంలోనైనా సామూహిక అత్యాచారం, హత్యకు గురయ్యే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు.

  • హర్యానాలోనూ వేట

హర్యానా లోని నూహ్ జిల్లాలో రెండు వారాల క్రితం మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. బజరంగ్‌దళ్‌, విహెచ్‌పి ఆధ్వర్యంలో చేపట్టిన బ్రిజ్‌మండల్‌ జలాభిషేక యాత్రలో పాల్గొన్నవారు ఈ ఘర్షణలను ప్రారంభించారు. ముఠా సభ్యులు కత్తులు, కర్రలు సహా ఆయుధాలతో వచ్చారు. మైనారిటీలు అధికంగా వున్న ప్రాంతాల్లో ఒకటైన నూహ్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన వెంటనే అల్లర్లు మొదలయ్యాయి. ఆవుల దొంగ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు యువకులను దహనం చేసిన కేసులో నిందితుడు మోను మానేసర్‌, అతని బృందం యాత్రలో పాల్గొనడంతో పాటు సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టర్‌ వివాదానికి దారితీసింది. ఘర్షణను నిరోధించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు కూడా నిందితులకే సహాయపడ్డాయి. ఆలయంలో 3,000 మందిని బందీలుగా ఉంచారన్న రాష్ట్ర హోంమంత్రి ప్రకటనతో సమీపంలోని గుర్గావ్‌, ఫరీదాబాద్‌, పాల్వాల్‌ వంటి జిల్లాలకు అల్లర్లు వ్యాపించాయి. గుర్గావ్‌లో దాడి చేసిన వ్యక్తులు మసీదుకు నిప్పంటించి, ఇమామ్‌ను కాల్చి చంపారు. పల్వాల్‌ జిల్లాలో కూడా పలు మసీదులపై దాడులు జరిగాయి. ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలో వివాదం తర్వాత రాజస్థాన్‌లో కూడా ఘర్షణలు జరిగాయి. అల్వార్‌ జిల్లాలో ఒక గుంపు రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను ధ్వంసం చేసింది. ఈద్‌ వేడుకలకు వ్యతిరేకంగా సంఫ్‌ు పరివార్‌ వచ్చి రెండు నెలల క్రితం జోధ్‌పూర్‌, అల్వార్‌, కరౌలీ జిల్లాల్లో ఉద్రిక్తత సృష్టించింది.
మనుస్మృతిని రాజ్యాంగబద్ధం చేయాలని డిమాండ్‌ చేస్తున్న సంఫ్‌ు పరివార్‌ సంస్థలు దళితులను మనుషులుగా చూసేందుకు ఇప్పటికీ ఇష్టపడడం లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచినా ఉత్తర భారతదేశం లోని అనేక ప్రాంతాల్లో అంటరానితనం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం దేశంలో దళితులపై హింస పెరిగిపోతోంది. నాలుగేళ్లలో 1,89,000 కేసులు నమోదయ్యాయి. దళితులపై 54 శాతం నేరాలు యు.పి, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయి. నేరస్తులకు శిక్ష తప్పడం వల్ల దాడుల సంఖ్య పెరుగుతున్నది.
ఇది మోడీ అండ్‌ కో బుల్డోజర్‌ రాజ్‌ తీరు!
ఇంకా చూస్తూనే వుందామా!!

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌