Sep 09,2023 07:30
  • ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వేగం పెంచిన ఇడి

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేసులో ఉన్న ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీలోనే ఉన్న ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్‌ విభాగానికి చెందిన అధికారులు విచారణకు పిలిచారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ముడుపుల వ్యవహారంపై పలు కోణాల్లో ఆయనను విచారించినట్లు ఢిల్లీ నుంచి చర్చ సాగుతోంది. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ కేసులో ఇడి అధికారులు వేగం పెంచారని సమాచారం. ఇటీవలే ఆయన కుమారుడు రాఘవరెడ్డికి బెయిల్‌ వచ్చింది. ఆయన కూడా ఈ కేసులో ఇడికి అనుకూలంగా మారినట్లు చర్చ సాగుతున్న తరుణంలో మాగుంట అప్రూవర్‌గా మారిన వ్యవహారం ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సౌత్‌ గ్రూపు నుంచి రూ.వంద కోట్ల ముడుపులు అందాయనే అంశంపై ఇడి ఈ కేసును చేపట్టింది. ఇందులో సుమారు 20 మందికిపైగా ఇప్పటికే విచారించింది. ఇందులో తెలంగాణా సిఎం కెసిఆర్‌ కుమార్తె కవిత కూడా ఉన్నారు. ఇటీవల మాగుంటకు నోటీసులు ఇచ్చారు. అప్పటికే ఆయన కుమారుడు ఈ కేసులో అరెస్టయ్యారు. చాలా కాలం బెయిల్‌ రాలేదు. రాఘవరెడ్డిని అప్రూవర్‌గా మారాలని ఒత్తిళ్లు పెరిగాయనే చర్చ వచ్చింది. ఇటీవల ఆయనకు బెయిల్‌ రాగా జిల్లాకు వచ్చారు. ఈ కేసు నుంచి మాగుంట కూడా బయటపడాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఆయన కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయంగానూ ఈ కేసుపై చర్చ సాగుతోంది. కేంద్రం వ్యూహాత్మకంగానే ఈ కేసులో పలువురిని ఇరికించినట్లు మొదట నుంచీ ప్రచారం సాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలను ఇరికించేందుకేననే ప్రచారం బాహాటంగానే సాగుతోంది. ఏదేమైనా మాగుంట అప్రూవర్‌గా మారారనే వ్యవహారం రాష్ట్రంలో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ చర్చకు దారితీసింది.