ప్రజాశక్తి-పాడేరు (మన్యం) : మన్య ప్రజల ఆరాధ్య దేవత, భక్తుల కొంగు బంగారం శ్రీ మోదకొండమ్మ అమ్మవారి శాకాంబరి మహోత్సవం ఆదివారం పాడేరులో అతి వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారికి శాకంబరీ ఉత్సవాన్ని ఆలయ కమిటీ ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ఈ మేరకు పలు రకాల కూరగాయలతో అమ్మవారిని (శాఖములు) ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయమంతా ప్రత్యేక అలంకరణ చేశారు. శాకాంబరిగా అమ్మవారి దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణములోని భక్తులు పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. అమ్మవారి శాకంబరీ మహౌత్సవం సందర్భంగా ఆలయం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్పర్సన్ పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ తమర్బ నరసింగరావు, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు రమాదేవి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.










