ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : 'రాష్ట్రంలో ఒకవైపు వరదలు, మరోవైపు కరువు నెలకొనడంతో రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి వారిని ఆదుకోవాలి' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురంలోని గణేనాయక్ భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంటలు చేతికందక రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2018, 2019 కంటే 2020లో కొంత వరకు రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినప్పటికీ 2021, 2022, 2023లో క్రమంగా అధికమవుతున్నాయని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వమిస్తున్న రూ.ఏడు లక్షల పరిహారం కూడా సక్రమంగా అందడం లేదన్నారు. ఏదో ఒక కారణం నమోదు చేసి పరిహారం డబ్బులు ఎగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతు ఏ రూపంలో చనిపోయినా తెలంగాణలో రూ.ఐదు లక్షలు పరిహారం ఇస్తున్నారని..ఆ విధానాన్ని ఎపిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే వచ్చే పంటల బీమా మొత్తం లోపభూయిష్టంగా ఉందన్నారు. ఇది కూడా ప్రయివేటు బీమా కంపెనీలకు లాభం చేకూర్చేదిగా ఉందని విమర్శించారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కంపెనీలకు పంటలబీమా కింద రూ.లక్షల కోట్లు ప్రీమియం కడితే రైతులకు పరిహారంగా ఇచ్చింది రూ.700 కోట్లు మాత్రమేనని చెప్పారు. అందుకే పంటల బీమా విధానంలో రైతుకు లాభం చేకూర్చే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులు, కౌలు రైతులకు కూడా రుణమాఫీ వర్తించే విధంగా అమలు చేయాలని కోరారు.
- పార్లమెంట్‌లో మౌనం...ఇక్కడ అనుకూలమైన ప్రకటనలు
మణిఫూర్ ఘటనపై పార్లమెంటులో విపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపిలు మౌనంగా ఉంటున్నాయని విమర్శించారు. అక్కడ మాట్లాడకుండా ఇక్కడికొచ్చి మీకు అండగా ఉంటామని చెప్పడం మోసకారితనమే అవుతుందని దుయ్యబట్టారు. జనసేన కూడా మణిపూర్ ఘటనపై కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ పాల్గొన్నారు.










