Mar 16,2023 06:38

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ మంగళవారం చేసిన ప్రసంగం ఆసాంతం ప్రభుత్వ నవరత్న పథకాల వల్లెవేతలతో నిండిపోయింది. బటన్‌ నొక్కడమొక్కటే అశేష జనబాహుళ్యం సంక్షేమమని మరోమారు గవర్నర్‌ చేత ప్రభుత్వం చెప్పించింది. పథకాలన్నింటినీ నవరత్నాల గొడుగు కిందకు తీసుకురావడమే సరికొత్త సమ్మిళిత వృద్ధి ఫార్ములా అని, అటువంటి సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి తమ ప్రాధాన్యతలని పేర్కొంది. కాగా ఏడాదికోమారు చట్టసభల్లో చేసే గవర్నర్‌ ప్రసంగం ప్రభుత్వ దశ, దిశకు కొలమానంగా ఉండాలి. గడచిన సంవత్సరంపై సమీక్ష, రాబోయే ఏడాదికి కార్యాచరణ ప్రణాళికలపై సర్కారు స్పష్టత ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లవుతున్న సమయాన, వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే వేళ గవర్నర్‌ ప్రసంగం కీలకం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించలేదని ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. రాష్ట్రాభివృద్ధి, రాజధాని, విభజన హామీలు, యువతకు ఉద్యోగ ఉపాధి, కార్మికులు, రైతులు, కౌలు రైతులు, ప్రజలెదుర్కొంటున్న సమస్యలు దుర్భిణీ వేసి వెతికినా గవర్నర్‌ ప్రసంగంలో కనిపించవు. నాలుగేళ్లలో నగదు బదిలీ పథకాల జమా ఖర్చుల అంకెలే కనిపిస్తాయి. అవే ప్రభుత్వ గొప్పతనాలుగా వండి వార్చడం వంచనే అవుతుంది.
ఎ.పి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. ఆ రంగం అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు అనివార్యం. పదేళ్లల్లో 54 ప్రాజెక్టులు చేపడితే ఇవ్పటికి పూర్తయినవి 14. రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొనే 'పోలవరం'లో నిర్వాసితుల పునరావాసం 22 శాతమే పూర్తయింది. ఇంకా 78 శాతం పెండింగ్‌లో ఉండగా, ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారు? గడువులు ముగుస్తున్నాయి తప్ప పురోగతి లేదు. కేంద్రం దోబూచులాటపై రాష్ట్ర ప్రభుత్వం నిలదీసింది లేదు. ఎన్నికల లబ్ధి కోసం ఎగువనున్న కర్ణాటకకు కేంద్రం నిధులిస్తున్న తరుణంలో నిత్యకరువులను చవి చూస్తున్న రాయలసీమను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కారు చేసిన కనీస ప్రయత్నం లేదు. ఈ పూర్వరంగంలో వచ్చే నాలుగేళ్లల్లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామంటే జనం నమ్మగలరా? నాలుగేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ పెట్టినట్లుకానీ, ఒక్కరికి ఉపాధి కల్పించినట్లుకాని చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రతి ఏడాదీ జనవరిలో జాబ్‌ కేలండర్‌ ఎక్కడికి పోయిందో తెలీదు. ఖాళీగా ఉన్న 2.60 లక్షల సర్కారీ కొలువులు, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్‌, సిపిఎస్‌ రద్దు, స్కీం వర్కర్ల సమస్యల పరిష్కార హామీలను ప్రభుత్వం మర్చిపోయినట్లుంది. సుమారు50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా ఒక్క డిఎస్‌సి కూడా ఇవ్వలేదు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల బకాయిలపైనా అంతే. చివరికి ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వడమూ గగనమైంది. ఉపాధి హామీ బకాయిలపైనా అశ్రద్ధే. ఇసుక సమస్య నేటికీ పరిష్కారం కాక లక్షలాది మంది భవన నిర్మాణ, అనుబంధ వృత్తుల వారు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కాదు సరికదా మద్దతు ధరలు కూడా దక్కడం లేదు. మేనిఫెస్టోనే తమకు భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అన్న ప్రభుత్వం నాలుగేళ్లయినా ముఖ్యమైన వాగ్దానాల ఊసు తీయట్లేదు.
విభజన హామీలు, నిధుల విషయంలో రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాలను గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టడమే. విభజన చట్టం వచ్చి తొమ్మిదేళ్లు దాటింది. మరి కొన్ని నెలల్లో చట్టంలో చాలా అంశాలకు నిర్దేశించిన గడవు ముగుస్తుంది. ఇప్పుడు కూడా కేంద్రంపై పోరాడకపోతే రాష్ట్రానికి జరిగే నష్టానికి బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని కాగ్‌ వంటి సంస్థలు ఘోషిస్తున్నాయి. అప్పు పుడితేనే రోజు గడిచేదన్నట్లుంది. మంత్రి పదవులతో సామాజిక న్యాయం, దిశ యాప్‌తో మహిళలకు రక్షణ, సచివాలయ ఉద్యోగాలతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన వంటివి ప్రచార పటాటోపానికే పనికొస్తాయి. భవిష్యత్తు విజన్‌ను ఆవిష్కరించాల్సిన గవర్నర్‌ ప్రసంగం రాష్ట్రాభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని విస్మరించింది. నేల విడిచి సాము చేసింది. ఇలాంటి ప్రసంగం వలన రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు.