ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : ప్రజల సమస్యలపై శాసనమండలిలో మాట్లాడి వాటి పరిష్కార దిశగా పనిచేసే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. బుధవారం స్థానిక ఎన్జీవో కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పిడిఎఫ్ అభ్యర్థులయినా మీగడ వెంకటేశ్వరరెడ్డి, బాబురెడ్డిలను శాసనమండలి ఎన్నికలలో గెలిపించుకున్నట్లయితే ప్రజా సమస్యలు, ఉపాధ్యాయ, కార్మిక నిరుద్యోగ, సమస్యలన్నింటిపై ప్రశ్నించే గొంతుకుగా ప్రజల పక్షాన నిలబడి వాటిని పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. అనంతరం పొలంసాల గురించి చర్చించి జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును పిడిఎఫ్ అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.










