ప్రజాశక్తి -నందిగామ(ఎన్‌టిఆర్ జిల్లా) : మతోన్మాద బిజెపిని తరిమికొట్టి.. దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐ ప్రచార బేరిలో భాగంగా మంగళవారం నందిగామ గాంధీ సెంటర్‌లో కరపత్రాలు పంచుతూ.. ప్రచారం చేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు, సిపిఐ నందిగామ ఏరియా కార్యదర్శి చుండూరు సుబ్బారావు, నందిగామ కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ప్రతీ వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయవలసిన సమయం వచ్చిందన్నారు. లేకుంటే మనందరి భవిష్యత్తూ చీకటిమయమైపోతుందని తెలిపారు. మోడీ-షాల నాయకత్వంలో బిజెపి, ఆర్.ఎస్. ఎస్. కూటమి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండవలసిన ప్రజల మధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తుందని విమర్శించారు. మరోవైపు అదానీ, అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు, సామాన్య ప్రజలకు అండగా ఉండాల్సి పోయి వారి మీద మోయలేనంత భారాలను మోపుతోందన్నారు. కరెంటు బిల్లులు ముట్టుకుంటేనే షాకులు కొడుతున్నాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మన బతుకుల్లో మంటలు రాజేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నందిగామ కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసిం, గోపి నాయక్, లాజర్, సిపిఐ నాయకులు కట్టా చామంతి, ఎం.అంజి స్వామి, నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.










